ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
ఖైరతాబాద్, న్యూస్‌లైన్: ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం... చింతలబస్తీలో నివాసముండే మునిస్వామి ప్రైవేట్ ప్రెస్‌లో ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి(21) రామాంతపూర్‌లోని అరోరా కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నకుమార్తె మానస సీఏ చేస్తోంది. చిన్నకుమార్తెకు ఆరోగ్యం బాగోకపోవడంతో శనివారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహాలక్ష్మి మధ్యాహ్నం 2 గంటలకు తల్లిదండ్రులకు టిఫిన్ తయారు చేసి పంపింది. ఆ తర్వాత చెల్లెలు ఫోన్ చేస్తే స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో ఆమె తమ ఇంటి పక్కన ఉండే వారికి ఫోన్ చేసి.. తమ ఇంటికి వెళ్లి చూడమని కోరింది. వారు వచ్చి తలుపు తట్టినా తీయలేదు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఇంటికి చేరుకున్నారు.
మహాలక్ష్మి ఎంతకూ తలుపు తీయకపోవడంతో వెంటిలేటర్‌లోంచి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా మహాలక్ష్మిఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని మృతి చెంది ఉంది. మధ్యాహ్నం తమకు టిఫిన్ పంపిన కూతురు అంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
అందరితో కలివిడిగా ఉండే మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, మహాలక్ష్మి బలవన్మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌నోట్ కూడా దొరకలేదు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.