కథను నమ్ముకునే ఈ సినిమా తీశాం: టాలీవుడ్ నిర్మాత | Mutyala Subbaiah about Tollywood Movie Thalli Manasu | Sakshi
Sakshi News home page

Thalli Manasu Movie: కథను నమ్ముకునే ఈ సినిమా తీశాం: ముత్యాల సుబ్బయ్య

Published Thu, Jan 9 2025 9:08 PM | Last Updated on Thu, Jan 9 2025 9:09 PM

Mutyala Subbaiah about Tollywood Movie Thalli Manasu

రచిత మహాలక్ష్మి,  కమల్ కామరాజు,  సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "తల్లి మనసు". ఈ సినిమాను వి శ్రీనివాస్  (సిప్పీ) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ముత్యాల సుబ్బయ్య తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా హైదరాబాద్ నిర్మాత ముత్యాల సుబ్బయ్య మాట్లాదుతూ.. "ప్రముఖ హీరోలందరితో సినిమాలు చేశా. దర్శకుడిగా 50 సినిమాలను తీశా. మంచి కథలను ఎంచుకోవడమే కాదు వాటికి తగ్గ మంచి టైటిల్స్ పెట్టి.. ప్రేక్షకుల ఆదరణతో నా సినీ ప్రయాణం సాగింది. నా యాభై సినిమాలలో అద్భుతమైన సక్సెస్ సినిమాలే కాదు. కొన్ని ఫెయిల్యూర్స్ కూడా లేకపోలేదు. అయినప్పటికీ ఏ రోజు ఏదో ఒక సినిమా  చేయాలని అనుకోలేదు. ఏదో ఒక కోణంలో సమాజానికి పనికి వచ్చే పాయింట్‌తో పాటు సెంటిమెంట్, కామెడీ, డ్రామా లాంటి అంశాలను మేళవించి సినిమాలు చేశా. ఒక దశలో కొన్ని సెంటిమెంట్ సినిమాల కారణంగా నాకు  సెంటిమెంట్ సుబ్బయ్య అని కూడా పేరొచ్చింది. నేను దర్శకుడిగా 50 సినిమాలను చేశా. తప్ప నిర్మాతగా గతంలో ఏ సినిమాను తీయలేదు. మా పెద్ద అబ్బాయి అనంత కిషోర్‌కు నిర్మాతగా ఒక మంచి సినిమా తీయాలనే అభిరుచి మేరకు  నిర్మించడం జరిగింది. మంచి కథ దొరికే వరకు వేచి చూసి మా బ్యానర్‌ ముత్యాల మూవీ మేకర్‌పై ఈ సినిమాను రూపొందించాం. ఒక అనుభవం ఉన్న నిర్మాతగా అన్నీ తానై అనంత కిషోర్  ఎంతో చక్కగా చూసుకున్నారని' అని అన్నారు. 

అనంతరం మాట్లాడుతూ.. 'నా దగ్గర.. అలాగే చిత్ర పరిశ్రమలో దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం గురించిన  వి శ్రీనివాస్  (సిప్పీ)ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. నేను సీనియర్ దర్శకుడిని అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో కానీ దర్శకత్వంలో  కానీ సూచనలు, సలహాలు ఇచ్చానే తప్ప ఎక్కడా తలదూర్చలేదు. ప్రేక్షకుల మనసులను హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ అని సెన్సార్ సభ్యులు కూడా ప్రశంసించడం ఆనందం కలిగించింది. ఒకరు ఓల్డ్ టైటిల్‌లా అనిపిస్తోందని కామెంట్ చేశారు. అందుకు నేను చెప్పింది ఒక్కటే... తల్లి  లేకుండా ప్రపంచమే లేదు. మనుష్యులకే కాదు సమస్త జీవ రాశికి, ఆఖరికి చెట్లకు సైతం తల్లి వేరు వల్లే పుట్టుక జరుగుతుందని, బదులిచ్చా.  అలాంటి తల్లి భావోద్వేగం, తపనను ఈ చిత్రంలో చక్కగా ఆవిష్కరించడం జరిగింది. చూస్తున్న ప్రేక్షకులు  ప్రతీ ఒక్కరూ కథలో పాత్రలతో లీనమవుతారు. పాత్రలకు తగ్గ నటీ నటులనే ఎంచుకున్నాం. టైటిల్ పాత్రదారి కోసం ఎందరో నటీమణులను ప్రయత్నించాం. ఎట్టకేలకు  కన్నడలో నటిగా మంచి పేరు తెచ్చుకున్న రచిత మహాలక్ష్మి  అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. కథకు తగ్గట్టు మూడు పాటలు ఉంటాయి. మా అందరి అంచనాలను ఈ సినిమా నిలబెడుతుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి కోటి సంగీతమందించారు.  

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement