ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ గెలుస్తాడు
సంప్రాస్ అభిప్రాయం
లండన్: రోజర్ ఫెడరర్‌కు మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే సత్తా ఉందని మాజీ ఆటగాడు పీట్ సంప్రాస్ అన్నాడు. మార్చి 3న ఆండ్రీ అగస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా సంప్రాస్ మాట్లాడుతూ.. ఫెడరర్ మరో నాలుగేళ్లపాటు టెన్నిస్ ఆడగలడని, గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను 17కు చేర్చగలడని అభిప్రాయపడ్డాడు. వెన్నునొప్పి కారణంగా ఫెడరర్ 2013లో పూర్తిగా నిరాశపరిచినా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరాడు. ఈ క్రమంలో జో విల్ఫ్రెడ్ సోంగా, ఆండీ ముర్రే వంటి వారిని ఓడించాడు.
సంప్రాస్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘ప్రస్తుతం ఫెడరర్ చక్కగా ఆడుతున్నాడు. నాదల్‌ను ఎదుర్కొంటున్నప్పుడే ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నాడు. దాన్ని అధిగమించాల్సివుంది. అతడు తన అత్యుత్తమ ఆటతీరును కనబరిస్తే మరో గ్రాండ్‌స్లామ్ సాధించగలడు’ అని అన్నాడు. ఆటను ఆస్వాదిస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటే మరో మూడు, నాలుగేళ్లు ఫెడరర్ ఆటను చూడొచ్చని సంప్రాస్ పేర్కొన్నాడు.