ప్రధాని చేతిలో ఆ బీరేంటి.. పాపకు ముద్దేంటి?
సిడ్నీ : సరదాగా ఓ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ఆస్ట్రేలియా ప్రధాని మాకమ్ టర్న్‌బుల్ కొంత విమర్శకు గురయ్యారు. వ్యక్తిగతంగా ఆయనకు మంచి సందర్భంగా అయినా కొంతమంది నెటిజన్లకు నచ్చక ఆయనను తిట్టారు. అయితే, విమర్శలకు మించి ఆయనను చాలామంది సమర్థించారు. ఇంతకీ చర్చకు దారి తీసేంతగా ఆయన ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ఏమిటో తెలుసా.. సిడ్నీలోని ఓ మైదానంలో రూల్స్ గేమ్ జరుగుతుండగా దానిని వీక్షించేందుకు కుటుంబంతో కలిసి టర్న్‌బుల్ వెళ్లారు. మ్యాచ్‌ను తిలకిస్తూ తన బుల్లి మనవరాలిని ఒడిలో పెట్టుకొని మరో చేతిలో బీరు పట్టుకొని ముద్దు చేస్తూ మురిసిపోయారు.
ఈ ఫొటోను ఆయన తన ఫేస్బుక్లో ఒకే సమయంలో రెండు పనులు అనే టైటిల్‌తో ఫేస్బుక్లో పెట్టారు. దీనిని చూసిన పలువురు ఒక ప్రధాని అయి ఉండి చేతిలో బీరు ఉన్నప్పుడు చిన్నపాపను అలా చేతుల్లోకి ఎలా తీసుకుంటారు? పైగా అలా తాగుతూ పాపను ఎలా ముద్దు చేస్తారు? ఆయనకు ఎందుకంతా బాధ్యతా రాహిత్యం అంటూ విమర్శించారు. దీనికి స్పందించిన పలువురు 'మన ప్రధానికి అది ఓ మధురమైన అనుభూతి. ఆయన కుటుంబానికి సంబంధించిన మంచి జ్ఞాపకం. ఆయనను కొద్దిసేపు అలా తాతగా ఉండనివ్వండి. దానిని కూడా రాద్ధాంతం చేయకండి. మేం ప్రధానికి మద్దతిస్తున్నాం' అంటూ పలువురు మద్దతిచ్చారు. ఇలా ఈ ఫొటోపై దాదాపు 1600 అనుకూల వ్యతిరేక కామెంట్లు వచ్చాయి.