auto drivers JAC
-
10న ఆటోలు బంద్: ఆటోడ్రైవర్స్ జేఏసీ
సుల్తాన్ బజార్: దిశ హత్య కేసు నేపథ్యంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు డిమాండ్ చేస్తూ ఈనెల 10న ‘షరాబ్ హటావో–తెలంగాణ బచావో’అనే నినాదంతో ఒక్క రోజు ఆటోల బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆటోడ్రైవర్స్ జేఏసీ వెల్లడించింది. ఈమేరకు ఆదివారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో విలేకరులతో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లా ఖాన్ మాట్లాడారు. మద్యపాన నిషేధం లేకపోవడం వల్లే మద్యం మత్తులో దుండగులు దిశను హత్య చేశారని, నిందితులకు వెంటనే ఉరి శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాలు, సామాజిక నేరాలు పెరగడానికి ప్రధాన కారణం మద్యం తాగడమేనన్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా రూ. 500 ఎంవీ ట్యాక్స్ మాఫీ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని, అదే ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఆటోకు రూ. 10 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. -
'ఓలా, ఉబర్లపై చర్యలు తీసుకోండి'
హైదరాబాద్ సిటీ: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓలా, ఉబర్ క్యాబ్‌ల సంస్థల యాజమాన్యాలను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ మాట్లాడుతూ...ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆటో డ్రైవర్లపై పోలీసుల వేధింపులు ఉండవని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆటోపర్మిట్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇ-ఛలాన్ విధానాన్ని రద్దుచేసి స్పాట్ ఛలాన్ పద్దతిని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించేంతవరకు 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నిరవధిక ఆటో సమ్మె కొనసాగుతుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ వద్ద ధర్నా చేపడతామని తెలిపారు. ఆటోల కంటే తక్కువ కిలోమీటర్ రేటు తీసుకుంటున్న డీజిల్‌తో నడిచే క్యాబ్‌లను నిషేధించాలని కోరారు.