రైడ్‌కు రెడీ...మారుతీ సెలెరియో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర మార్కెట్లోకి సెలెరియో కారును శుక్రవారం మారుతి సుజుకి విడుదల చేసింది. వేగాన్నిబట్టి కారు సొంతంగా గేర్లు మార్చుకునేలా ఆటో గేర్ షిఫ్ట్‌ను ఇందులో పొందుపరిచారు. ప్యాసింజర్ కార్లలో దేశంలో తొలిసారిగా ఆటో గేర్ షిఫ్ట్‌ను సెలెరియోలో అమర్చారు. భారత్‌లో కొత్త విభాగాన్ని ఇది సృష్టిస్తుందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సి.వి.రామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ ఓంకార్ నాథ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ వాహనాల ఖరీదు ఎక్కువగా ఉంటుందని, మైలేజీ రాదన్న అపవాదు ఉండడం వల్లే వీటి వ్యాప్తి అతి తక్కువగా ఉందని చెప్పారు. సెలెరియో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేసిక్ వేరియంట్‌తో పోలిస్తే ఆటో గేర్ షిఫ్ట్ బేసిక్ వేరియంట్ రూ.41 వేలు మాత్రమే ఖరీదు ఎక్కువ. ఇక మైలేజీ రెండు వేరియంట్లూ లీటరు పెట్రోలుకు 23.1 కిలోమీటర్లని వివరించారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో నాలుగు, ఆటో గేర్‌లో రెండు వేరియంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ ఎక్స్ షోరూంలో కారు ధర మాన్యువల్ ట్రాన్స్మిషన్ రూ.4.02 లక్షల నుంచి రూ.5.10 లక్షల వరకు ఉంది. ఆటో గేర్ షిఫ్ట్ ధర రూ.4.43-4.73 లక్షలు.
త్వరలో కొత్త భద్రతా ప్రమాణాలు...
దేశంలో ప్రయాణికుల వాహనాలు ఇక మరింత భద్రంగా రూపొందనున్నాయని రామన్ చెప్పారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మూడు నెలల్లో కనీస భద్రతా ప్రమాణాలను ప్రకటించనుందని పేర్కొన్నారు.
800.. ఇక ఓ జ్ఞాపకం
దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత మధ్య తరగతి ప్రజలను మురిపించిన మారుతీ 800 కారు ఇక మధుర జ్జాపకంగా మిగిలిపోనుంది. మధ్య తరగతి ప్రజల కలల కారుగా ప్రఖ్యాతి గాంచిన ‘800’ ఉత్పత్తిని మారుతీ ఆపేసింది. గత నెల 18 నుంచి ఈ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశామని కంపెనీ ఈడీ రామన్ శుక్రవారం చెప్పారు. కార్ల ఉత్పత్తిని ఆపేసినా, నిబంధనల ప్రకారం ఈ కార్ల విడిభాగాలు మరో 8-10 ఏళ్ల పాటు అందుబాటులో ఉంచుతామని వివరించారు.
సెలెరియో హ్యాచ్‌బాక్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్ నుంచి ఉపసంహరించిన కారు మోడళ్ల విడిభాగాలను గతంలో 8-10 ఏళ్లపాటు అందుబాటులో ఉంచామని, ఎం800 కారు విషయంలో కూడా దీనినే అనుసరిస్తామని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్సహా మొత్తం 13 నగరాల్లో 2010, ఏప్రిల్ నుంచే ఈ కార్ల విక్రయాలను కంపెనీ ఆపేసింది.