Automobile Project
-
బంపరాఫర్,జాక్ పాట్ కొట్టేసిన 'హీరో'ఎలక్ట్రిక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. డెలివరీ సేవల్లో ఉన్న షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్‌కు 25,000 యూనిట్ల ఎన్వైఎక్స్ హెచ్ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సరఫరా చేయనుంది. సంస్థ ఖాతాలో 2024 నాటికి ఈ–వెహికల్స్ వాటాను 75 శాతానికి చేర్చనున్నట్టు షాడోఫ్యాక్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ 7,000 పిన్‌కోడ్స్‌లో డెలివరీ సేవలు అందిస్తోంది. నెలకు 2 కోట్ల డెలివరీలను నమోదు చేస్తోంది. నమోదిత యూజర్లు 10 లక్షలకుపైమాటే. స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, బిగ్‌బాస్కెట్, లీషియస్ వంటి 100కుపైగా బ్రాండ్స్‌తో భాగస్వామ్యం ఉంది. -
మారుతీ.. ట్యాక్సీవాలా..!!
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు మందగిస్తున్న నేపథ్యంలో కార్ల అమ్మకాలను పెంచుకునే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ట్యాక్సీ సేవలకు ఉపయోగపడేలా మరో మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే ఆల్టో కారు మోడల్లో .. ట్యాక్సీ సెగ్మెంట్ కోసం ప్రత్యేక వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆల్టో హెచ్1గా వ్యవహరిస్తున్న ఈ కారును.. ప్రత్యేకంగా ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సంస్థలకు సర్వీసులందించే వారికోసం డిజైన్ చేశారు. 800 సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ కారు ధర రూ.3.64 లక్షలు (చెన్నై ఎక్స్‌షోరూం). ప్రస్తుతానికి దీన్ని తమిళనాడు వంటి ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలోనే మారుతీ విక్రయిస్తోంది. బేసిక్ ఫీచర్లు.. రిటైల్ కస్టమర్లకు విక్రయించే బేస్ వేరియంట్ ఆల్టో ఎస్టీడీ ధరతో పోలిస్తే హెచ్1 రేటు సుమారు రూ. 61,000 అధికంగా ఉంటుంది. ఆల్టో ఎస్టీడీ కారు ధర చెన్నైలో రూ.3.03 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఇందులో ఎయిర్ కండీషనింగ్ గానీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ గానీ, కనీసం బాడీ కలర్ బంపర్స్ కూడా ఉండవు. హెచ్1 డిజైన్ కూడా ఇదే తరహాలో బేసిక్ ఫీచర్స్‌తోనే ఉంది. కానీ దీంట్లో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండీషనింగ్ ఫీచర్స్ ఉంటాయి. పవర్ విండోస్, మ్యూజిక్ సిస్టంలాంటివి ఆల్టో హెచ్1లో లేవు. మారుతీ సుజుకీ ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ స్టేజ్–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆల్టో వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భద్రతకు సంబంధించి అదనపు ఫీచర్లు, కొత్త టెక్నాలజీ పొందుపర్చింది. దీంతో భారత్ స్టేజ్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే తొలి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కారుగా ఆల్టో నిల్చింది. మూడో మోడల్... ట్యాక్సీ సర్వీసుల సంస్థలు టార్గెట్‌గా మారుతీ సుజుకీ ప్రవేశపెట్టిన కార్ల మోడల్స్‌లో ఆల్టో హెచ్1 మూడోది. మారుతీ ఇప్పటికే ఉన్న మోడల్స్‌లో డిజైర్ టూర్, సెలీరియో హెచ్2 పేరిట ట్యాక్సీలకు సంబంధించి రెండు వేరియంట్స్‌ను విక్రయిస్తోంది. ట్యాక్సీ ఆపరేటర్లకు మైలేజీ కీలకం కాబట్టి.. లీటరుకు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే ఆల్టోకు మంచి డిమాండ్ ఉంటుందని మారుతీ ఆశిస్తోంది. ప్రస్తుతం మారుతీ మొత్తం అమ్మకాల్లో వాణిజ్య అవసరాల కోసం విక్రయించే కార్ల విభాగం వాటా సుమారు 8 శాతంగా ఉంది. పరిశ్రమపరంగా చూస్తే మూడేళ్ల క్రితం కార్ల కొనుగోళ్లలో 10–15 శాతం దాకా ఉన్న ట్యాక్సీ ఆపరేటర్ల వాటా 6–8 శాతానికి పడిపోయింది. ముంబై, ఢిల్లీ వంటి కీలక నగరాల్లో కార్లకు డిమాండ్ సంతృప్త స్థాయికి చేరిందన్న అభిప్రాయం నెలకొంది. దీంతో ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ ఆపరేటర్ల తరఫున సేవలు అందిస్తున్న డ్రైవర్లు చాన్నాళ్లుగా తమ ఆదాయాలు, లాభాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2030 నాటికి మొత్తం కొత్త వాహనాల అమ్మకాల్లో ట్యాక్సీ ఆపరేటర్ల వాటా 12 శాతానికి చేరొచ్చని రీసెర్చ్ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మారుతీ ప్రధానంగా దృష్టి పెడుతోంది. మందగిస్తున్న కార్ల అమ్మకాలు.. గడిచిన కొద్ది నెలలుగా కొత్త వాహనాల అమ్మకాలకు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. సంవత్సరం ప్రారంభంలో రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమాగా చెప్పినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మారుతీ అమ్మకాల వృద్ధి కేవలం 5.3 శాతానికి పరిమితమైంది. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్‌లోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించి నిరుత్సాహపర్చాయి. పరిశ్రమపరంగా చూసినా కూడా ఆల్టో, రెనో క్విడ్ వంటి ఎంట్రీ స్థాయి కార్లకు డిమాండ్ ఒక మోస్తరు స్థాయికి పరిమితమైపోయిందని ఆటోమొబైల్ రంగ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతీ సుజుకీ గతేడాది ప్రతి నెలా సగటున 21,000 కొత్త ఆల్టో కార్లను విక్రయించింది. కానీ 2017–18తో పోలిస్తే పెద్దగా వృద్ధి లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త కార్ల కస్టమర్లు .. స్విఫ్ట్ లేదా బాలెనో వంటి మరికాస్త ప్రీమియం కార్ల వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం కావొచ్చని పేర్కొన్నాయి. -
‘హీరో’ మైండ్ మారిందా?
♦ రిజిస్ట్రేషన్ చేసుకోమంటూ ఏపీ సర్కారు లేఖ ♦ అయినా ముందుకొచ్చి భూమి తీసుకోని హీరో ♦ ఒప్పందం జరిగి రెండేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే ♦ వివాదంలో ఉన్న భూమి ఇవ్వడమే కారణమా!! సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వస్తుందనుకున్న భారీ ఆటోమొబైల్ ప్రాజెక్టు చుట్టూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్... ఏపీలో పెడతామన్న భారీ ప్లాంట్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ఉచితంగా భూమి ఇచ్చి... దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి లేఖలు రాస్తున్నా... కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీకి ఆనుకొని ఉన్న స్థలంలో హీరో మోటోకార్ప్‌కు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూ కేటాయింపునకు సంబంధించి అన్ని అనుమతులూ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని లేఖ రాసి నెల రోజులు దాటినా కంపెనీ ముందుకు రావడం లేదని ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం గుజరాత్లో నిర్మాణంలో ఉన్న 5వ ప్లాంట్ పూర్తయితే తప్ప ఈ ప్లాంట్ గురించి ఆలోచించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పునరాలోచనలో కంపెనీ..!! ఏపీ ప్రభుత్వ వైఖరితో యూనిట్ ఏర్పాటు గురించి కంపెనీ పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రాజెక్టులను ఆకర్షించడానికి అనేక హామీలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా ఒప్పందం కుదుర్చుకున్నాక వ్యవహరిస్తున్న విధానంపై కంపెనీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉచితంగా భూమి ఇస్తామని చెప్పి కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని కట్టబెట్టడంపై కంపెనీ విస్తుపోయింది. హీరో కంపెనీకి ఇచ్చిన స్థలం తమదంటూ చెన్నైకి చెందిన కంపెనీ కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో హీరో సంస్థ రాష్ట్రంలో ప్రాజెక్టు ఆలోచనలను పక్కకు పెట్టి గుజరాత్‌లోని యూనిట్ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై మాట్లాడటానికి హీరో మోటోకార్ప్ అధికారులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యూనిట్ గురించి ఎటువంటి వివరాలు చెప్పలేమని తమను సంప్రతించిన ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. దీనికి తోడు ద్విచక్ర వాహన అమ్మకాల్లో తీవ్ర ఒత్తిడి ఉండటం కూడా కంపెనీ పునరాలోచనకు కారణం కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తు తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షల యూనిట్లు ఉండగా, అమ్మకాలు 66 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు స్కూటర్ మార్కెట్ నుంచి వస్తున్న తీవ్ర పోటీ మోటార్ సైకిళ్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత యువత స్కూటర్ల వైపే మొగ్గు చూపుతుండటమే దీనికి కారణం. దీనితో భవిష్యత్తు విస్తరణ కార్యక్రమాలను పునస్సమీక్షించాలని కంపెనీ ఆలోచనగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఒప్పందం కుదిరి రెండేళ్లు హీరో మోటార్స్ దక్షిణాదిలో యూనిట్ పెడతామని ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా పోటీపడ్డాయి. అనేక రాయితీలతో పాటు భూమి కూడా ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్రం ముందుకు రావడంతో ఇక్కడే యూనిట్ నెలకొల్పడానికి కంపెనీ అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబర్, 2014లో హీరో మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో మొత్తం మూడు దశల్లో 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు చెప్పింది. దీంతో హీరో మోటోకార్ప్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్ల యూనిట్లకు చేరుతుంది. ప్రస్తుతం కంపెనీకి దేశ వ్యాప్తంగా నాలుగు యూనిట్లుండగా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షలుగా ఉంది. ఇప్పుడు గుజరాత్లో ఐదవ యూనిట్ నిర్మాణంలో ఉంది. ఈ యూనిట్ తొలి దశ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరవ యూనిట్ ఆంధ్రప్రదేశ్‌ది అవుతుంది. ఇదీ ఒప్పందం... ⇒ సెప్టెంబర్ 2014లోనాటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం.. ⇒ రూ.1,600 కోట్ల పెట్టుబడితో 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ⇒ మూడు దశల్లో డిసెంబర్, 2023 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం ⇒ డిసెంబర్ 2018 నాటికి తొలి దశలో 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి