‘హీరో’ మైండ్ మారిందా?
♦ రిజిస్ట్రేషన్ చేసుకోమంటూ ఏపీ సర్కారు లేఖ
♦ అయినా ముందుకొచ్చి భూమి తీసుకోని హీరో
♦ ఒప్పందం జరిగి రెండేళ్లయినా ఎక్కడి గొంగడి అక్కడే
♦ వివాదంలో ఉన్న భూమి ఇవ్వడమే కారణమా!!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా వస్తుందనుకున్న భారీ ఆటోమొబైల్ ప్రాజెక్టు చుట్టూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్... ఏపీలో పెడతామన్న భారీ ప్లాంట్‌పై ఆశలు అడుగంటుతున్నాయి. ఉచితంగా భూమి ఇచ్చి... దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి లేఖలు రాస్తున్నా... కంపెనీ నుంచి స్పందన లేకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.
చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీకి ఆనుకొని ఉన్న స్థలంలో హీరో మోటోకార్ప్‌కు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూ కేటాయింపునకు సంబంధించి అన్ని అనుమతులూ పూర్తి చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమని లేఖ రాసి నెల రోజులు దాటినా కంపెనీ ముందుకు రావడం లేదని ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం ఉన్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం గుజరాత్‌లో నిర్మాణంలో ఉన్న 5వ ప్లాంట్ పూర్తయితే తప్ప ఈ ప్లాంట్ గురించి ఆలోచించకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పునరాలోచనలో కంపెనీ..!!
ఏపీ ప్రభుత్వ వైఖరితో యూనిట్ ఏర్పాటు గురించి కంపెనీ పునరాలోచనలో పడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రాజెక్టులను ఆకర్షించడానికి అనేక హామీలు గుప్పించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా ఒప్పందం కుదుర్చుకున్నాక వ్యవహరిస్తున్న విధానంపై కంపెనీ వర్గాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉచితంగా భూమి ఇస్తామని చెప్పి కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని కట్టబెట్టడంపై కంపెనీ విస్తుపోయింది. హీరో కంపెనీకి ఇచ్చిన స్థలం తమదంటూ చెన్నైకి చెందిన కంపెనీ కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో హీరో సంస్థ రాష్ట్రంలో ప్రాజెక్టు ఆలోచనలను పక్కకు పెట్టి గుజరాత్‌లోని యూనిట్ నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయమై మాట్లాడటానికి హీరో మోటోకార్ప్ అధికారులు నిరాకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యూనిట్ గురించి ఎటువంటి వివరాలు చెప్పలేమని తమను సంప్రతించిన ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. దీనికి తోడు ద్విచక్ర వాహన అమ్మకాల్లో తీవ్ర ఒత్తిడి ఉండటం కూడా కంపెనీ పునరాలోచనకు కారణం కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తు తం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షల యూనిట్లు ఉండగా, అమ్మకాలు 66 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు స్కూటర్ మార్కెట్ నుంచి వస్తున్న తీవ్ర పోటీ మోటార్ సైకిళ్ల అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత యువత స్కూటర్ల వైపే మొగ్గు చూపుతుండటమే దీనికి కారణం. దీనితో భవిష్యత్తు విస్తరణ కార్యక్రమాలను పునస్సమీక్షించాలని కంపెనీ ఆలోచనగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి.
ఒప్పందం కుదిరి రెండేళ్లు
హీరో మోటార్స్ దక్షిణాదిలో యూనిట్ పెడతామని ప్రకటించినప్పటి నుంచి ఆ ప్రాజెక్టును చేజిక్కించుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా పోటీపడ్డాయి. అనేక రాయితీలతో పాటు భూమి కూడా ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్రం ముందుకు రావడంతో ఇక్కడే యూనిట్ నెలకొల్పడానికి కంపెనీ అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబర్, 2014లో హీరో మోటార్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో మొత్తం మూడు దశల్లో 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు చెప్పింది. దీంతో హీరో మోటోకార్ప్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 1.2 కోట్ల యూనిట్లకు చేరుతుంది. ప్రస్తుతం కంపెనీకి దేశ వ్యాప్తంగా నాలుగు యూనిట్లుండగా మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 81 లక్షలుగా ఉంది. ఇప్పుడు గుజరాత్‌లో ఐదవ యూనిట్ నిర్మాణంలో ఉంది. ఈ యూనిట్ తొలి దశ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరవ యూనిట్ ఆంధ్రప్రదేశ్‌ది అవుతుంది.
ఇదీ ఒప్పందం...
⇒ సెప్టెంబర్ 2014లోనాటి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం..
⇒ రూ.1,600 కోట్ల పెట్టుబడితో 18 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం
⇒ మూడు దశల్లో డిసెంబర్, 2023 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం
⇒ డిసెంబర్ 2018 నాటికి తొలి దశలో 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి