మారుతీ.. ట్యాక్సీవాలా..!! | Up to Rs 70000 off on Maruti Suzuki Arena cars, SUVs, MPVs | Sakshi
Sakshi News home page

మారుతీ.. ట్యాక్సీవాలా..!!

Published Thu, May 9 2019 12:01 AM | Last Updated on Thu, May 9 2019 12:01 AM

Up to Rs 70000 off on Maruti Suzuki Arena cars, SUVs, MPVs - Sakshi

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు మందగిస్తున్న నేపథ్యంలో కార్ల అమ్మకాలను పెంచుకునే దిశగా ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ట్యాక్సీ సేవలకు ఉపయోగపడేలా మరో మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దేశీయంగా అత్యధికంగా అమ్ముడయ్యే ఆల్టో కారు మోడల్‌లో .. ట్యాక్సీ సెగ్మెంట్‌ కోసం ప్రత్యేక వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆల్టో హెచ్‌1గా వ్యవహరిస్తున్న ఈ కారును.. ప్రత్యేకంగా ఓలా, ఉబెర్‌ తదితర ట్యాక్సీ సంస్థలకు సర్వీసులందించే వారికోసం డిజైన్‌ చేశారు. 800 సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ కారు ధర రూ.3.64 లక్షలు (చెన్నై ఎక్స్‌షోరూం). ప్రస్తుతానికి దీన్ని తమిళనాడు వంటి ఎంపిక చేసిన కొన్ని మార్కెట్లలోనే మారుతీ విక్రయిస్తోంది. 

బేసిక్‌ ఫీచర్లు.. 
రిటైల్‌ కస్టమర్లకు విక్రయించే బేస్‌ వేరియంట్‌ ఆల్టో ఎస్‌టీడీ ధరతో పోలిస్తే హెచ్‌1 రేటు సుమారు రూ. 61,000 అధికంగా ఉంటుంది.  ఆల్టో ఎస్‌టీడీ కారు ధర చెన్నైలో రూ.3.03 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ఇందులో ఎయిర్‌ కండీషనింగ్‌ గానీ, పవర్‌ స్టీరింగ్, పవర్‌ విండోస్‌ గానీ, కనీసం బాడీ కలర్‌ బంపర్స్‌ కూడా ఉండవు. హెచ్‌1 డిజైన్‌ కూడా  ఇదే తరహాలో బేసిక్‌ ఫీచర్స్‌తోనే ఉంది. కానీ దీంట్లో పవర్‌ స్టీరింగ్, ఎయిర్‌ కండీషనింగ్‌ ఫీచర్స్‌ ఉంటాయి. పవర్‌ విండోస్, మ్యూజిక్‌ సిస్టంలాంటివి ఆల్టో హెచ్‌1లో లేవు. మారుతీ సుజుకీ ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ స్టేజ్‌–6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆల్టో వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భద్రతకు సంబంధించి అదనపు ఫీచర్లు, కొత్త టెక్నాలజీ పొందుపర్చింది. దీంతో భారత్‌ స్టేజ్‌ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఉండే తొలి ఎంట్రీ లెవెల్‌ సెగ్మెంట్‌ కారుగా ఆల్టో నిల్చింది.  

మూడో మోడల్‌... 
ట్యాక్సీ సర్వీసుల సంస్థలు టార్గెట్‌గా మారుతీ సుజుకీ ప్రవేశపెట్టిన కార్ల మోడల్స్‌లో ఆల్టో హెచ్‌1 మూడోది. మారుతీ ఇప్పటికే ఉన్న మోడల్స్‌లో డిజైర్‌ టూర్, సెలీరియో హెచ్‌2 పేరిట ట్యాక్సీలకు సంబంధించి రెండు వేరియంట్స్‌ను విక్రయిస్తోంది. ట్యాక్సీ ఆపరేటర్లకు మైలేజీ కీలకం కాబట్టి.. లీటరుకు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే ఆల్టోకు మంచి డిమాండ్‌ ఉంటుందని మారుతీ ఆశిస్తోంది. ప్రస్తుతం మారుతీ మొత్తం అమ్మకాల్లో వాణిజ్య అవసరాల కోసం విక్రయించే కార్ల విభాగం వాటా సుమారు 8 శాతంగా ఉంది. పరిశ్రమపరంగా చూస్తే మూడేళ్ల క్రితం కార్ల కొనుగోళ్లలో 10–15 శాతం దాకా ఉన్న ట్యాక్సీ ఆపరేటర్ల వాటా 6–8 శాతానికి పడిపోయింది. ముంబై, ఢిల్లీ వంటి కీలక నగరాల్లో కార్లకు డిమాండ్‌ సంతృప్త స్థాయికి చేరిందన్న అభిప్రాయం నెలకొంది. దీంతో ఓలా, ఉబెర్‌ వంటి ట్యాక్సీ ఆపరేటర్ల తరఫున సేవలు అందిస్తున్న డ్రైవర్లు చాన్నాళ్లుగా తమ ఆదాయాలు, లాభాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, 2030 నాటికి మొత్తం కొత్త వాహనాల అమ్మకాల్లో ట్యాక్సీ ఆపరేటర్ల వాటా 12 శాతానికి చేరొచ్చని రీసెర్చ్‌ సంస్థ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంపై మారుతీ ప్రధానంగా దృష్టి పెడుతోంది.

మందగిస్తున్న కార్ల అమ్మకాలు.. 
గడిచిన కొద్ది నెలలుగా కొత్త వాహనాల అమ్మకాలకు డిమాండ్‌ తగ్గుతూ వస్తోంది. సంవత్సరం ప్రారంభంలో రెండంకెల వృద్ధి సాధిస్తామని ధీమాగా చెప్పినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మారుతీ అమ్మకాల వృద్ధి కేవలం 5.3 శాతానికి పరిమితమైంది. ఇక వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్‌లోనూ అమ్మకాలు 20 శాతం క్షీణించి నిరుత్సాహపర్చాయి. పరిశ్రమపరంగా చూసినా కూడా ఆల్టో, రెనో క్విడ్‌ వంటి ఎంట్రీ స్థాయి కార్లకు డిమాండ్‌ ఒక మోస్తరు స్థాయికి పరిమితమైపోయిందని ఆటోమొబైల్‌ రంగ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్‌ లీడర్‌గా ఉన్న మారుతీ సుజుకీ గతేడాది ప్రతి నెలా సగటున 21,000 కొత్త ఆల్టో కార్లను విక్రయించింది. కానీ 2017–18తో పోలిస్తే పెద్దగా వృద్ధి లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొత్త కార్ల కస్టమర్లు .. స్విఫ్ట్‌ లేదా బాలెనో వంటి మరికాస్త ప్రీమియం కార్ల వైపు మళ్లుతుండటమే ఇందుకు కారణం కావొచ్చని పేర్కొన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement