మహీంద్రా ఆటో ష్రెడ్డింగ్ ప్లాంట్ ఏర్పాటు
ఎంఎస్టీసీ భాగస్వామ్యంతో..
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఇంటర్‌ట్రేడ్ సంస్థ, ప్రభుత్వ రంగంలోని ఎంఎస్టీసీతో కలసి ఆటోమొబైల్ ష్రెడ్డింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని మహీంద్రా ఇంటర్‌ట్రేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి, రీసైక్లింగ్ చేసే ఈ ప్లాంట్ పూర్తిగా ఆటోమేటెడ్ అని, భారత్‌లో ఇలాంటి ప్లాంట్ ఇదే మొదటిదని మహీంద్రా ఇంట్రాట్రేడ్ ఎండీ సుమీత్ ఇసార్ పేర్కొన్నారు. రీసైక్లింగ్ కారణంగా ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా ఇతర వనరులను కనిష్ట స్థాయిలో వినియోగించుకోవచ్చని వివరించారు.
కాలం చెల్లిన వాహనాలను వినియోగించరాదనే అంశంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని తెలిపారు. ఈ ప్లాంట్ పాత వాహనాల ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్ రబ్బర్ స్క్రాప్‌ల నుంచి తగిన స్థాయిల్లో ఆయా పదార్ధాలను రికవర్ చేస్తుందని వివరించారు. తుక్కును రీసైకిల్ చేయడం, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎంఎస్టీసీ వినూత్నమైన విధానాలనే అవలంభిస్తుందని, దాంట్లో భాగంగానే ఈ ప్లాంట్ ఏర్పాటని ఎంఎస్టీసీ ఎండీ ఎస్.కె. త్రిపాఠి పేర్కొన్నారు.