autumn winter
-
పండుగ సీజన్లో పర్యాటకానికి ఉత్తమ ప్రదేశాలు: ఎయిర్‌బీఎన్‌బీ
రాబోయే పండుగలను.. శరదృతువు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని చాలామంది కొత్త ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. ఈ తరుణంలో అమెరికాకు చెందిన వెకేషన్ రెంటల్ కంపెనీ 'ఎయిర్‌బీఎన్‌బీ' (Airbnb) భారతీయ ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రయాణ అనుభవాలను అందించడానికి టాప్ ట్రెండింగ్ ప్రదేశాలను వెల్లడించింది. ఇందులో కాన్పూర్, లక్షద్వీప్, ఉజ్జయిని వంటివి ఉన్నాయి.కాన్పూర్‌లో దసరా ఉత్సవాలను ఆడంబరంగా నిర్వహిస్తారు. ఉష్ణమండల ఆకర్షణకు ప్రసిద్ధి చెందిన లక్షద్వీప్ కూడా పర్యాటకానికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఉజ్జయినిలో ఆధ్యాత్మిక శోభను చూడవచ్చు. ఇవన్నీ సహజ సౌందర్యమైన సాంస్కృతిని.. వాటి ప్రాముఖ్యతను తెలియజేసే గమ్యస్థానాలు.అంతర్జాతీయ ప్రదేశాల కోసం అన్వేషించేవారికి టోక్యో, అమాల్ఫీ, బాకు వంటివి చెప్పుకోదగ్గవి. టోక్యోలోని పార్కులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అమాల్ఫీ తీరం పర్యాటకులకు ప్రశాంతమైన వాతావరణం అందిస్తాయి. బాకు ప్రాంతం వాస్తుశిల్పం, గొప్ప చరిత్రను తెలియజేస్తాయి. భారతీయ పర్యాటకులు మంచి ప్రదేశాలను సందర్శించాలనుకున్నప్పుడు ఇవన్నీ మరుపురాని మధురమైన అనుభూతులను అందిస్తాయి.ఓ వైపు పండుగ సీజన్, మరోవైపు శరదృతువు.. ఈ సమయంలో భారతీయులు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. అలాంటి ఈ ప్రదేశాలు చాలా అనుకూలంగా ఉంటాయని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ 'అమన్‌ప్రీత్ బజాజ్' పేర్కొన్నారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం (సెప్టెంబర్ 27) సమీపిస్తోంది. ఈ ఏడాది వరల్డ్ టూరిజం డే థీమ్ "పర్యాటకం మరియు శాంతి". దీని అర్థం ఏమిటంటే ప్రపంచ దేశాల మధ్య శాంతి, సంస్కృతుల మీద అవగాహన కల్పించడం. పర్యాటకులు విభిన్న ప్రకృతి దృశ్యాలను.. మెరుగైన అనుభవాలను అన్వేషించడానికి టూరిజం ఎంతో ఉపయోగపడుతుంది. -
Pudami Sakshiga : పైకి కనపడవు గానీ, ఈ బుజ్జి పిట్టల అల్లరి అంతా ఇంతాకాదు
వసంత రుతువు రాగానే చెట్లన్నీ పల్లవిస్తే, ఆ హరిత పల్లవాల లోంచి వినిపించే కోకిల గానం గురించి కవులు చెబుతారు. కాని, కాస్తంత ఆకుపచ్చదనం కనిపిస్తే చాలు, అనేక రకాల పక్షులు వచ్చి సంబరాలు చేసుకుంటాయి. జనావాసాల మధ్య పక్షులు ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్ పై సునీత పొత్తూరి ప్రత్యేక కథనం.. పచ్చని ప్రకృతికి బహుమతిగా మళ్లీ కొన్ని చెట్లనిద్దాం...చిన్ని పక్షిని పాడనిద్దాం -ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేం టెర్రెస్ గార్డెన్ మొదలు పెట్టాక, మాకు ఈ చిన్ని అతిథుల సందడి పెరిగిందని చెప్పాలి. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్స్(Asian green bee eaters)అన్ని రకాల పిట్టల లోనూ ఇదొక ఆకుపచ్చని ఆకర్షణ! ఈ మధ్య వీటి హాడావుడి ఎక్కువే అయింది. సాధారణ పిచుకల పరిమాణంలో ఉండే ఈ పక్షులు ఆకుపచ్చ రంగులో, కంఠం దగ్గర నీలంగాను, తలపైన పింగళవర్ణం(మిశ్రమ రాగి వర్ణం)తోను, తోక సన్నగా పుల్లలా సాగి, ఉంటుంది. తోక తో కలిపి 9 అంగుళాలు (పూర్వపుభాషలో అయితే జానా బెత్తెడు) ఉంటుంది. ఎంత తేలిక అంటే వెదురు కొమ్మ మీద అర డజను పిట్డలు దర్జాగావాలిపోతాయి! ఇందుకు అనుగుణం గా వాటి కాలి గోళ్లు కలసి ఉండటం వల్ల కొమ్మలపైన పట్డు నిలుస్తుందిట. కొమ్మ కదలకుండా ఒకదానికొకటి ఒరుసుకుని కూర్చున్న తీరు నులి వెచ్చని ఎండ లో చలి కాగుతున్నట్డుఉంటుంది.వెదురు మొక్క కొమ్మలకి అటు ఇటూ.. వాలి, పచ్చని తోరణంలా కనువిందు చేస్తుంటాయి. ఫ్లై కాచర్ అన్న పేరుకు తగ్గట్టు చిన్న చిన్న పురుగులను, తేనెటీగలనూ పట్టి తింటాయి. అయితే వేటాడే విధానం..అదొక కళ లా, ప్రత్యేకం గా ఉంటుంది. గాలిలో ఉండగానే తమ ఆహారాన్ని నోటికి అంకించుకుంటాయి. అలా అనిచటుక్కున మింగవు. నింపాదిగా ఇలా ఓ చెట్టుకొమ్మ మీద వాలి, తన ఆహారాన్ని పొడిచి వేరుచేసి తింటాయి. వీటి గూళ్లను మానవ సమూహాలకు దూరంగా లోతట్డు గా ఉండే పొదలు, గడ్డి భూములలో ఏర్పాటుచేసుకుంటాయిట. ఇవి వలస పక్షులు కావు. అంతరించి పోతున్న జాతుల లెక్కలోనూ లేవు. కాని,మాకు వానాకాలం లో కంటే, ఇలా శీతా కాలం లో మా ప్రాంతంలో ఎక్కువగా చూస్తాను. ఉదయం, సాయంత్రంవేళల్లో కోలహాలంగా గుంపులుగా వచ్చే వాటి అరుపు అనునాసికంగా, తంత్రీ వాద్యంలా ట్రిం...ట్రిం.. అంటూ ఉంటుంది. కొమ్మల మీదనుండి ఒక్కసారిగా ఎగిరి పోయేటప్పుడు చేసే శబ్దం మాత్రం అధికంగా ఉంటుంది. ఇది కాక, క్రిమి కీటకాలను వేటాడే పక్షుల నిత్య సందడి సూర్యోదయానికి ముందే మొదలౌతుంది. తేనె పిట్డలు, జిట్టంగి పిట్టలు, బుల్ బుల్(పిగిలి పిట్ట), తేనిటీగల్ని, పురుగుల్ని పట్టితినే పాసరైన్స్, వేటి కవే నిత్యంతమ కలకూజితాలతో- మధురారవాలతో ఉదయస్తమయాలు రాగరంజితం చేస్తుంటాయి. చలికాలం లో మా ముంగిట్లో ఉన్న కోవిదార చెట్టు (Bauhinia) సుందరంగా పూస్తుంది. వీటి మీద ఎగురుతూ తేనెపిట్టలు, passerines చేసే సందడి అంతా ఇంతా కాదు. కనిపించవు గాని, కొమ్మకొమ్మ కో సన్నాయీ...! ఆపిలుపులన్నీ పూలవేనేమో అనిపిస్తాయిసన్ బర్డ్స్ మందార పూలమీద అలా వాలి, ఇలా చటుక్కున తేనె సంగ్రహించి పోతుంటాయి. కెమెరాకి ‘యాక్షన్’ చెప్పేఅవకాశమే ఇవ్వవు. ఈ బుల్లి పిట్టలు గొంతు విప్పితే చెవులు చిల్లుపడాల్సిందే. పిట్ట కొంచెం కూత ఘనం అంటారుకదా.. అలా! పిగిలి పిట్టలు(Bulbul)- గుబురు తలల తో తోక కింద ఎర్రగా ఉండే ఈ పక్షులు మా టెర్రస్ పైన చేసే సందడి తక్కువేంకాదు. మీకు అలారం క్లాక్ అవసరం లేదు. తెల్లవారు జామునే మొదలు .. కిసకిసలు!బ్లాక్ రాబిన్– ఓ సారి నా నడక దారిలో ఓచిత్రం చూసాను. బ్లాక్ రాబిన్ తన ప్లమేజ్ లో ఆకుపచ్చని గడ్డిపరకలుటక్ చేసుకుని లాన్ లో తిరుగుతూ కనబడింది. ఫోటో తీద్దామనే ప్రయత్నం ఫలించలేదు. కింగ్ ఫిషర్ ఒకటి ఒకే సమయానికి దర్శనం ఇస్తూంటుంది. రివ్వున వాలి, కావలసినదేదో దొరకపుచ్చుకుని దూరంగా లైట్ స్తంభం మీదకి గెంతి .. కాస్త తాళి, ఎగిరెళ్లిపోతుంది. కన్నుమూసి తెరచేంతలోనే ఈ విన్యాసాలన్నీ..! ఒక నీలి ఈకను మాత్రం ఓసారి బహుమతి చేసింది. జిట్టంగి పక్షులు.– ఇళ్ల కప్పులెక్కి, ఈల వేస్తూ హెచ్చరిస్తూ సందడి చేస్తూంటాయి ఉదయాస్తమయాల వేళల్లో. సిల్వర్ బిల్ మునియాలు. గుంపుగా వచ్చి, తమ చిన్ని ముక్కులను నీటి లో తడుపుకొని, జలకాలాడుతూ తెగ సందడి చేస్తాయి. వెదురు ఆకులను ఒడుపుగా చీల్చి గూటికోసం తీసుకుని పోతూంటాయి. అరగదీసినట్లు నునుపు దేలిన ముక్కు(bill), పొట్ట భాగం లో స్కేలింగ్ వుండి కాస్త బ్రౌన్‌గా ఉండే ఈ పిచుకల్లాటి మునియాలు గార్డెన్ లో చెట్ల కొమ్మల్లో జంటలుగా వచ్చి వాలుతాయి. మన ఇళ్ల దగ్గర ప్రమాదస్థాయిలో బ్రీడింగ్ అవుతున్న మరో పక్షి పావురం. పావురాళ్లు గూడు పెట్టని చోటు లేదు. వాటి సంతతి పెరిగిపోతూనే ఉండటంతో, కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పావురాలకు ధాన్యపు గింజలను వేయడం వల్ల సహజమైన ఆహారవేటను ఆపేసాయంటారు. ఏదేమైనా చిన్న చిన్నపావురాల కువకువలు మాత్రం బాగుంటాయి. ఇక పోతే కాకులూ, పిచికలూ ఒకప్పుడు మనకి సర్వసాధారణంగా కనిపించే పక్షులు. మన సంస్కృతి లో భాగం.పిచికలకు ముంగిట్లో ధాన్యపు కంకులను వేలాడదీసేవారు. కాకులు సరేసరి. మన పితృదేవతలు కాకిరూపం లోవచ్చి పిండం ముట్టి పోతాయని నమ్మకం.కాని ఇవీ ఇపుడు అరుదైపోయాయిఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా సెల్ టవర్స్ నిర్మింవడం వల్ల, ఎలక్ట్రో మాగ్నటిక్ రేడియేషన్ కి, దాదాపు ఊర పిచుకలు తుడిచి పెట్డుకుని పోయాయి. అలాగే కాకులు కూడా, పట్టణీకరణ పేరుతో వాటి ఆవాసాలనుంచి,వాటికి అనుకూలమైన చోట గూళ్లు ఏర్పరుచుకుని, సంతానోత్పత్తి చేయడానికి వీలు లేకుండా తరిమి వేయబడ్డాయి. పక్షులు పర్యావరణానికి ఎంత మేలు చేస్తాయి అన్నది ప్రత్యేకించి ఎవరికీ చెప్పనక్కరలేదు. క్రిమి కీటకాల బెడదనుంచి పంటలను కాపాడ్డం తో బాటు, పాలినేషన్కు విత్తనాల విస్తరణకు పక్షుల ఉనికిఅవసరమన్నది అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిమీద జరిపిన తిరుగుబాటు వల్ల కలిగిన దుష్పరిణామం ఏమిటో చైనా ఉదంతం ఒకటి చెబుతారు. ఆహారధాన్యాలను పిచుకలు తింటున్నాయని, పిచుకలను పట్డి చంపిస్తారు చైర్మన్ మావో సమయంలో. తర్వాత వాటి పొట్ట కోసి చూసి తెల్లబోయారట శాస్త్రజ్ణులు. ఆహారధాన్యాల కంటే ఎక్కువ క్రిమి కీటకాలను పట్టి తింటాయనితెలిసి. ఆ తరవాత క్రిమికీటకాల అదుపు లేక పంట నష్టం తీవ్రమై కరవు సంభవించిందిట. మిడతలను చంపడానికి క్రిమి కీటకాల నాశకాలను వాడగా, ఫలితంగా భూమిలోని సారం తగ్గిపోయిందిట. ఇదొక గుణపాఠం. అయినా...మనిషి మారలేదు; ఆతని కాంక్ష తీరలేదు–అని సినీకవి తీర్పు ఇచ్చినట్టు జరిగేవి జరుగుతూనే ఉన్నాయి.ప్రకృతిలో సమతౌల్యతకు పక్షుల ఉనికి ఎంత అవసరమన్నది మానవాళికి అర్థం అయేసరికి, ఆధునీకరణ పేరుతో చాలా నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. అందుచేత నేడు ఆవాసాల వద్ద ఎంతో కొంత గ్రీనరీ వుండేలా చూసుకోవడంసామాజిక బాధ్యత అయింది. రచయిత : సునీత పోతూరి ఫోటో : శ్యాం సుందర్ తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం
లండన్ : మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు తలమునకలైవున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన అంశాన్ని ప్రకటించింది. నయం చేయలేని ఈ వ్యాధికి రాబోయే ఆరు నెలల్లో వ్యాక్సిన్ తయారు చేయగలమంటూ నమ్మకంగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చినట్టేనని తాజాగా ప్రకటించారు. మూడవ దశ ట్రయల్ అనంతరం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆక్సఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు 500 మంది వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. కనీసం 2021 ప్రారంభంనాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకొచ్చారని, ఇవి విజయవంతమైతే వ్యాక్సిన్ అనుకున్న దానికంటే ముందుగానే అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే చైనాలో మార్చి 17నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని పరిశోధకులు చెప్పారు. మొదటిదశలో చైనాకు చెందిన వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగం జరిపినట్టు పరిశోధకులు వెల్లడించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసున్న ఆరోగ్యవంతులు మొత్తం 108 మందిపై పరిశోధనలు జరిపామని18మంది అబ్టర్వేషన్ పూర్తయిందని, వారంతా కరోనానుంచి బయటపడ్డారని వివరించారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో బుధవారం ఇంటికి వెళ్లినట్టు వివరించారు. మరో ఆరునెలల పాటు వీరినుంచి రక్త నమూనాలు సేకరిస్తూ, పరిశోధనలు జరుపుతామని, అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. టీకా సమర్థవంతంగా, సురక్షితంగా ఉందని తేలితే విదేశాలలో అదనపు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా గతఏడాది చైనాలో విస్తరించిన కరోనా శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నా, వైరస్ విస్తరణ ఉధృతిని నిలువరించడం పెను సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో నిజంగా పరిశోధకుల ప్రయోగాలు ఫలించి వ్యాక్సిన్ సిద్ధమయితే యావత్ ప్రపంచానికి భారీ ఊరట లభించినట్టే. -
చిగురించే అవసరాన్ని గుర్తు చేస్తున్న కాలం
ఉగాది, వసంతం, చైత్రమాసం, కోకిల, మామిడి చిగుళ్లూ కవిసమయాలుగా మారిపోయి చాలాకాలమే అయింది. ఇప్పుడు ఆ పదజాలం కూడా అదృశ్యమైపోతున్న కాలంలో ఉన్నాం. ఇంగ్లిష్ నెలలు మాత్రమే తెలిసిన గ్లోబల్ కుగ్రామంలో చాంద్రమాన కాలానికి చెందిన రుతువులు పాతరాతియుగానికి చెందిన మాటలు. మార్చి నెల రాకుండానే ఎండలు ముదురుతున్న రోజుల్లో వింటర్ తరువాత వచ్చే కాలాన్ని సమ్మర్‌గా పిలుచుకునే దేశంలో- ఎప్పుడూ ఏదో ఒక కొత్త నిర్మాణంతో ఇనుమూ, ఉక్కూ, సిమెంటూ, కాంక్రీటు పోగుపడే నగరంలో- కోకిల, తుమ్మెద, మకరందంలాంటి పదాలు ఎవరిలోనూ ఏ స్పందననీ రేకెత్తించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో మన చుట్టూ ఏదో జరుగుతూంటుందిగానీ అది శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పు అని తిలక్ అంటే గాని మనకు తెలియదు. ఇంతకీ రుతువుల గురించి వినడం వల్లా తెలుసుకున్నందు వల్లా మనకేమి ప్రయోజనం అనుకునే ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాసం కూడా ఒక వ్యాపార నిర్వహణాంశంగా మారిపోయిన ఈ కాలంలో రుతుఘోష ఎవరికి కావాలి? అయినా అనాదికాలం నుంచి చెట్టు చిగురించడాన్ని మనుషులు పండగ చేసుకుంటూనే ఉన్నారు. శీతాకాలంలో మంచులో కప్పడిపోయిన లోకంలో తొలి సూర్యరశ్మి, లేతాకుపచ్చ చిగుళ్లూ జీవితానికి ముగింపు లేదనీ అది ప్రతి ఏడాదీ సంభవించే పునరుత్థానమనీ తెలిసినప్పుడల్లా మనిషి వాటి చుట్టూ ఎన్నో పురాణగాథలు అల్లుకుంటూనే ఉన్నాడు. గ్రీకుల డెమెటర్, బేబిలోనియన్ల ఇనానా, యూదుల రొట్టెల పండగ, ప్రాచీన యూరోప్‌లో డ్రూయిడ్ల వనదేవతారాధన, క్రైస్తవుల ఈస్టర్, భారతదేశపు హోలి పండగ వసంతం మతక్రతువుగా మారిపోయిన ఆనవాళ్లు. బహుశా తిరిగి తిరిగి సంభవించే సంతోషాన్ని క్రతువుగా మార్చకుండా కాపాడుకోవడం కష్టం. తెలుగువాడికి కొత్తసంవత్సరం చైత్రమాసంతో మొదలవుతుంది. అది అతడి సౌందర్యారాధనకి గుర్తు. అయినా ఎందుకో తెలుగు కవిత్వంలో చెట్ల గురించి మాట్లాడేవాళ్లంటే చిన్నచూపు, ఒకింత అనుమానం. పీడిత ప్రజల పట్ల ఎక్కువ ప్రేమ, సమాజిక అసమానతల పట్లా, అన్యాయాల పట్లా సహించలేని ఆగ్రహం, అసమ్మతి ఉంటేనే కవి! అందుకనే బెర్టోల్డ్ బ్రెహ్ట్ అనుకున్నట్టే ఒక తెలుగుకవి కూడా ఇలా అనుకుంటాడు: ఎట్లాంటి కాలమిది, ఇప్పుడొక చెట్టు గురించి మాట్లాడటమంటే ఒక నేరం చేస్తున్నట్టే అలా మాట్లాడటం వల్ల ఎన్నో ఘోరాల గురించి మౌనం వహిస్తున్నట్టే అయినా చెట్టు గురించి ఆలోచించకుండా ఉండలేం. చిగురిస్తున్న చెట్టుని చూసే మనం కఠిన సమయాల్లో గుండె దిటవు చేసుకోవలసి ఉంటుంది. కాని వసంతం రావడం ప్రత్యక్షదృశ్యం. లేతాకుపచ్చ కాంతితో మిలమిల్లాడే కానగచెట్లు, తెల్లవారుజాముల్లో గాలంతా ఆవరించే వేపపూల తీపిసుగంధం, ఇక ఎక్కణ్ణుంచో ప్రతి వసంతంలోనూ ఆకాశాన్నొక వలగా మన మీద విసిరే కోకిలపాట నగరంలో ప్రత్యక్షానుభవాలే. తెలుగు నేల మీద కవిత్వం రాసిన నేరానికి కారాగారానికి నడిచిన మొదటి కవి దాశరథి కృష్ణమాచార్యనే. ‘మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే/ మాటలు రాని కోయిలమ్మ పాడునులే’ అన్నప్పుడు అది ఎంత ఉత్సాహకరంగా వినిపిస్తుందని. ‘నిజంగానే నిఖిలలోకం నిండుహర్షం వహిస్తుందా! బానిసలు సంకెళ్లు తెగిసే పాడుకాలం లయిస్తుందా’ అని శ్రీశ్రీ అశ్చర్యార్థకంగా మనముందుంచిన ప్రశ్నార్థకానికి దాశరథి వాక్యం సమాధానమనిపిస్తుంది. వసంతంలో ఏదో ఇంద్రజాలముంది. ముప్పై ఏళ్ల కిందన రాజమండ్రిలో ఒక సాయంకాలం ప్రబంధకవిత్వం గురించి మాట్లాడుతూ మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు అల్లసాని పెద్దన రాసిన ఈ పద్యం వినిపించారు: చలిగాలి బొండుమల్లెల పరాగము రేచి నిబిడంబు సేసె వెన్నెల రసంబు వెన్నెల రసముబ్బి వెడలించె దీర్ఘికా మంద సౌగంధిక మధునదంబు మధునదంబెగబోసె మాకందమాలికా క్రీడానుషంగి భృంగీరవంబు భృంగీరవంబహంకృతి దీగెసాగించే బ్రోషిత భర్తృకారోదనముల విపినవీథుల వీతెంచె కుపితమదన సమదభుజనత సుమధనుష్టాంకృతములు సరసమధుపానని ధువనవిలీన యువతి యువకోటి కోరికల్ చివురులొత్త. ఈ పద్యం నాకు అయిదువందలేళ్ల కిందటి కవితలాగా అనిపించలేదు. చాలా కొత్తగా ఆధునికంగా వినిపించింది. కవి ఏం చెప్తున్నాడు? చల్లగాలికి మల్లెల పరాగం రేగిందట. ఆ పుప్పొడి వల్ల వెన్నెల రసం చిక్కబడిందట. ఆ వెన్నెల వాక వల్ల దిగుడుబావుల్లో పూసిన ఎర్రకలువల మకరందం ఏరులై ప్రవహించిందట. ఆ తేనెవాకకి తియ్యమామిడి చెట్ల గుబుర్లలో తిరుగుతున్న తేనెటీగల పాట బలపడింది. ఆ పాట వినగానే ఒంటరిగా ఉంటున్న స్త్రీ హృదయవేదన మిక్కుటమైంది. వారి వేదనవల్ల ప్రేమబాణాలు మరింత పదునెక్కాయి. ప్రణయానురాగం తీవ్రమైనందువల్ల యువతీయువకుల కోరికలు చిగురించాయట. ఇందులో ఉన్నవన్నీ సాధారణ కవిసమయాలే. కాని కవి చెప్తున్న విషయం మాత్రం సాధారణం కాదు. అసాధారణమైన హృదయకోశం. ఒక జీర. బహుశా కుపిత మన్మథ ధనుష్టంకారాన్ని అందరికన్నా ముందు వినేవాడే కవి. కవిత్వమెందుకు చదవాలంటే ఎద మెత్తనవడానికని వేరే చెప్పాలా? ఎప్పటికప్పుడు కాలాన్ని కొత్తగా మార్చే రుతుగమనాన్ని పసిగట్టి మనం చూడలేని అందాల్ని మనకు చూపించే కవులే లేకపోతే ఈ ప్రపంచమింత వర్ణమయశోభితంగా ఉండేదే కాదు. కేవలం రంగులూ రాగాలూ మాత్రమే కాదు ఈ గమనంలో ఏదో మెలకువ ఉంది. దాన్ని పట్టుకున్న క్షణం మనం మన జీవిత కేంద్రంలోకి చొచ్చుకుపోయినట్టూ మన జీవితసారాంశం కరతలామలకమైనట్టూ అనిపిస్తుంది. వసంతవేళ్లలో జీవితం కొత్తగా మొగ్గ తొడిగే ఉత్సాహం. మళ్లా మరొకసారి అల్లసాని పెద్దననే స్మరించాలనిపిస్తోంది. చెట్టు కొమ్మ మీద చిగురు పొటమరించే దృశ్యాన్నెట్లా కవితగా మలిచాడో చూడండి: సానదేరి పొటమరించి నెరె వాసినయట్టి యాకురాలపు గండ్లయందు తొరగి యతిబాల కీరచ్చదాంకృతి బొల్చి కరవీరకోరక గతిగ్రమమున నరుణంపు మొగ్గలై యరవిచ్చి పికిలి యీ కలదండలట్లు గుంపులయి పిదప రేఖలేర్పడగ వర్థిల్లి వెడల్పయి రెమ్మ పసరువారుచు నిక్కబసరు కప్పు పూటపూటకు నెక్క గప్పునకు దగిన మెరుగు నానాటికిని మీద గిరికొనంగ సోగయై యాకువాలగ జొంపమగుచు జిగురు దళుకొత్తె దరులంతా శ్రేణులందు ఇదొక దృశ్యం. వసంతకాలం వచ్చింది. అప్పుటికి కొమ్మల మీంచి పండుటాకులు రాలిన గండ్లల్లో ఒక కలకలం. గుడ్డు నుంచి బయటపడ్డ చిలకరెక్కల కొనల్లాగా కనిపించి ఆ మీదట ఎర్రగన్నేరు మొగ్గల్లాగా విచ్చుకుని పికిలిపిట్టల ఈకలాగా ఈనెలు చాపి పచ్చరంగు తిరిగి ఆ పచ్చదనం నెమ్మదిగా నలుపెక్కీ చిక్కటి కాంతితో ఆకుచాటున చిగురు తళుకెత్తిన దృశ్యం. దీన్ని కేవలం చిగురుటాకు వర్ణనగా చూడలేం. చిగురించే ప్రతి సందర్భం- అది ప్రేమ కావచ్చు. స్నేహం కావచ్చు. గాఢమైన ఏ మానవానురాగమైనా కావచ్చు. జీవితం చిగురించే ప్రతి వేళా ఇదే క్రమం. ఇదే వర్ణమయ శోభ. ఇంద్రధనుసులో ఎన్ని రంగులున్నాయో అన్నీ ఉన్నాయిక్కడ. అందుకనే కృష్ణశాస్త్రి ప్రతీ రాత్రి వసంతరాత్రి కావాలని ప్రతిగాలి పైరగాలి కావాలనీ బతుకంత ప్రతి నిమిషం పాటలాగ సాగాలనీ కోరుకున్నాడు. బహుశా ప్రపంచానికి కవిత్వం అవసరముంటే, వసంతవేళల్ని వర్ణించడం అవసరముంటే ఆ అవసరం మానవచరిత్రలో ఇప్పుడు అవసరమైనంతగా ముందెన్నడూ లేదనే అనుకోవాలి. - వాడ్రేవు చినవీరభద్రుడు -
ప్రతి చెట్టూ ఒక దీపవృక్షం
‘చైత్ర వైశాఖములు వసంత రుతువు. చెట్లు చిగిర్చి పూలు పూయును’- అని చిన్నప్పుడు చాలామంది వల్లె వేసి ఉంటారు. చైత్ర మాస ఆరంభం తెలుగు నూతన సంవత్సర ఆరంభం. అంటే మన ఉగాది. నిజానికి ఒక వృత్తానికి తుది మొదలు ఉండదు. కాలం ఒక మహావృత్తం. నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఇక మొదలేమిటి, చివరేమిటి? రుతువులను- రుతు ధర్మాలను బట్టి నిర్ణయించారు మన పూర్వులు. ఆరు రుతువులు పన్నెండు నెలలుగా విభజించారు. ఇప్పుడిది వసంతరుతువు. ఇది రుతువుల్లో రాజు. ఆహ్లాదకరమైన రుతువు. మనిషి గుండె కూడా చెట్టు చేమలతోబాటు చిగిర్చి పుష్పించి కొత్తదనంతో ఘుమఘుమలాడుతుంది ఈ తరుణంలో. కొత్త చిగుళ్లను మెక్కి కోయిలలు ఈ సమయంలోనే కొండకోన ఊరువాడ ప్రతిధ్వించేలా తీయని పాటలు వినిపిస్తాయి. ఉగాది అంటే వసంతం. వసంతం అంటే మధుమాసం. ప్రకృతి పులకించిన వేళ కవులు పులకిస్తారు. ప్రతి కవీ ఒక కోయిలగా కొత్తరాగాలు గానం చేస్తారు. వసంతరుతువుపై వచ్చినంత కవిత్వం తెలుగునాట మరే అంశంపైనా రాలేదు. నన్నెచోడుడు తన కుమార సంభవములో సుదీర్ఘ సమాసాలలో ఆమని రాకను కళ్లకు కట్టాడు. చెట్లు- మొగ్గలతో పూలతో చిగుళ్లతో వెలిగే దీపవృక్షాల్లాగా ఉన్నాయన్నాడు. సురపొన్నల పై పాకిన గురువిందలు మన్మధునకు అమరిన ముత్యాల పందిరిలా ఉందన్నాడు. ఇంత సందడిని ఇంతటి అందాలను పరిమళాలను కవులకు చూపించే పండగ మరొకటి లేదు. చెట్లు చెలమలు పండుగ వేళ బుక్కాలు జల్లుకున్నట్లుందని కొందరు ఆరోపించారు. ఒకే దృశ్యం వారి వారి ప్రకృతులను బట్టి రకరకాలుగా కనిపిస్తుంది. రాయప్రోలు సుబ్బారావు ‘రమ్యాలోకము’ ఖండకావ్యం రచించారు. నాటి కవులు యిష్టదేవతా స్తుతితో రచన ప్రారంభించడం ఆచారం. రాయప్రోలు వారు ఏమన్నారో చూడండి: ' ‘మామిడి కొమ్మ మీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి ఈయభినవ ధ్వనిధారణ కుద్యమించితిన్’... ఆధునిక కవులు సైతం కొత్త సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానిస్తూ కవితలల్లి చదువుతారు. కొందరు ‘రా ఉగాదీ... రా’ అంటారు. మరికొందరు ‘రావద్దు ఉగాదీ... రావద్దు. అంతా అల్లకల్లోలంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉంది, ఏముందని వస్తావు రావద్దు’ అంటూ సమకాలీన సమస్యలను ఏకరువు పెడతారు. పాపం రావాలో మానాలో ఉగాదికి అర్థం కాదు. సాహిత్యంలో ఉగాదికి ఉన్న స్థానం మరే పండుగకీ లేదు. ఇప్పటికీ పలుచోట్ల కవి సమ్మేళనాలు జరుగుతాయి. ప్రభుత్వ పక్షాన ఆకాశవాణి కవిగోష్టులను నిర్వహిస్తుంది. ఇది పండుగ వేళ. వినవేడుక. వీణ చిట్టిబాబు గొప్ప వైణికులు. శాస్త్రీయ సంగీత కృతులతో బాటు ఆధునిక గీతాలు కూడా వీణపై పలికించేవారు. ‘కొమ్మల్లో కోయిలమ్మ కూయన్నది’ పాటను అద్భుతంగా వినిపించేవారు. ‘కూయన్నది’ తర్వాత పాట ఆపేవారు. చిట్టిబాబు కూహూ.. కూహూ కోయిల కూతను వీణపై అత్యంత సహజంగా పలికించేవారు. శ్రోతలు చెవులు మరింత రిక్కించేవారు. ‘ఊహూ.. కోయిల పలకనంటోంది. పండుగ వేళ కానుకలు కావాలంటోంది’ అనేవారు చమత్కారంగా. ఇక ప్రేక్షకులు కానుకలతో వేదికపైకి వచ్చి సమర్పించేవారు. అప్పుడు చిట్టిబాబు వీణలోంచి కోయిల వచ్చేది. వసుచరిత్రకారుడు సంగీత సాహిత్యాల దిట్ట. ఆమని ఆగమవేళను వర్ణిస్తూ: ‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభికా భంగదో ప్రసంగ మలయానిల విలోల’ ఈ సీసపద్యం వీణ గమకాలకు వొదుగుతుంది. దీనిని వీణపై సాధన చేసిన ప్రముఖులున్నారు. ఉగాది శుభవేళ నేల నిండు దర్బారులా ఉంది. అందులోకి సంవత్సరాది అడుగుపెట్టిందన్నాడు అడిదము సూరకవి. చిగురించిన తియ్యమామిడి చెట్లు పెండ్లికై వేసిన చలువ పందిళ్లుగా కన్పించాయి కూచిమంచి తిమ్మకవికి. అవధాన ద్వయం తిరుపతి వేంకటవులు- ‘కూయంజొచ్చెను కోకిల ప్రతతి కూకూ రాగమొప్పన్’ అంటూ వసంతోదయాన్ని ఆశువుగా వర్ణించారు. ఇక విశ్వనాథ కల్పవృక్షములో అనువైన సందర్భాలను దేనినీ వదలలేదు. పింగళి కాటూరి కవులు, నాయని సుబ్బారావు రుతురాజుని అద్భుతంగా దర్శింపచేశారు. ఉగాది కొత్త చిగుళ్లను, పూలనే కాదు కొత్త ఆశలను వెంట తెస్తుంది. కాలం అనంతమైంది. అందులో తిరిగే కొత్త సంవత్సరం చిన్న చుక్క. ఆ చుక్క నిండా ఎన్నో మధురభావాలు. - శ్రీరమణ