ప్రతి చెట్టూ ఒక దీపవృక్షం
‘చైత్ర వైశాఖములు వసంత రుతువు. చెట్లు చిగిర్చి పూలు పూయును’- అని చిన్నప్పుడు చాలామంది వల్లె వేసి ఉంటారు. చైత్ర మాస ఆరంభం తెలుగు నూతన సంవత్సర ఆరంభం. అంటే మన ఉగాది. నిజానికి ఒక వృత్తానికి తుది మొదలు ఉండదు. కాలం ఒక మహావృత్తం. నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఇక మొదలేమిటి, చివరేమిటి? రుతువులను- రుతు ధర్మాలను బట్టి నిర్ణయించారు మన పూర్వులు. ఆరు రుతువులు పన్నెండు నెలలుగా విభజించారు. ఇప్పుడిది వసంతరుతువు. ఇది రుతువుల్లో రాజు. ఆహ్లాదకరమైన రుతువు. మనిషి గుండె కూడా చెట్టు చేమలతోబాటు చిగిర్చి పుష్పించి కొత్తదనంతో ఘుమఘుమలాడుతుంది ఈ తరుణంలో. కొత్త చిగుళ్లను మెక్కి కోయిలలు ఈ సమయంలోనే కొండకోన ఊరువాడ ప్రతిధ్వించేలా తీయని పాటలు వినిపిస్తాయి.
ఉగాది అంటే వసంతం. వసంతం అంటే మధుమాసం. ప్రకృతి పులకించిన వేళ కవులు పులకిస్తారు. ప్రతి కవీ ఒక కోయిలగా కొత్తరాగాలు గానం చేస్తారు. వసంతరుతువుపై వచ్చినంత కవిత్వం తెలుగునాట మరే అంశంపైనా రాలేదు. నన్నెచోడుడు తన కుమార సంభవములో సుదీర్ఘ సమాసాలలో ఆమని రాకను కళ్లకు కట్టాడు. చెట్లు- మొగ్గలతో పూలతో చిగుళ్లతో వెలిగే దీపవృక్షాల్లాగా ఉన్నాయన్నాడు. సురపొన్నల పై పాకిన గురువిందలు మన్మధునకు అమరిన ముత్యాల పందిరిలా ఉందన్నాడు. ఇంత సందడిని ఇంతటి అందాలను పరిమళాలను కవులకు చూపించే పండగ మరొకటి లేదు. చెట్లు చెలమలు పండుగ వేళ బుక్కాలు జల్లుకున్నట్లుందని కొందరు ఆరోపించారు. ఒకే దృశ్యం వారి వారి ప్రకృతులను బట్టి రకరకాలుగా కనిపిస్తుంది. రాయప్రోలు సుబ్బారావు ‘రమ్యాలోకము’ ఖండకావ్యం రచించారు. నాటి కవులు యిష్టదేవతా స్తుతితో రచన ప్రారంభించడం ఆచారం. రాయప్రోలు వారు ఏమన్నారో చూడండి:
'
‘మామిడి కొమ్మ మీద కలమంత్ర పరాయణుడైన
కోకిల స్వామికి మ్రొక్కి ఈయభినవ ధ్వనిధారణ కుద్యమించితిన్’...
ఆధునిక కవులు సైతం కొత్త సంవత్సరాన్ని సాదరంగా ఆహ్వానిస్తూ కవితలల్లి చదువుతారు. కొందరు ‘రా ఉగాదీ... రా’ అంటారు. మరికొందరు ‘రావద్దు ఉగాదీ... రావద్దు. అంతా అల్లకల్లోలంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉంది, ఏముందని వస్తావు రావద్దు’ అంటూ సమకాలీన సమస్యలను ఏకరువు పెడతారు. పాపం రావాలో మానాలో ఉగాదికి అర్థం కాదు. సాహిత్యంలో ఉగాదికి ఉన్న స్థానం మరే పండుగకీ లేదు. ఇప్పటికీ పలుచోట్ల కవి సమ్మేళనాలు జరుగుతాయి. ప్రభుత్వ పక్షాన ఆకాశవాణి కవిగోష్టులను నిర్వహిస్తుంది. ఇది పండుగ వేళ. వినవేడుక.
వీణ చిట్టిబాబు గొప్ప వైణికులు. శాస్త్రీయ సంగీత కృతులతో బాటు ఆధునిక గీతాలు కూడా వీణపై పలికించేవారు. ‘కొమ్మల్లో కోయిలమ్మ కూయన్నది’ పాటను అద్భుతంగా వినిపించేవారు. ‘కూయన్నది’ తర్వాత పాట ఆపేవారు. చిట్టిబాబు కూహూ.. కూహూ కోయిల కూతను వీణపై అత్యంత సహజంగా పలికించేవారు. శ్రోతలు చెవులు మరింత రిక్కించేవారు. ‘ఊహూ.. కోయిల పలకనంటోంది. పండుగ వేళ కానుకలు కావాలంటోంది’ అనేవారు చమత్కారంగా. ఇక ప్రేక్షకులు కానుకలతో వేదికపైకి వచ్చి సమర్పించేవారు. అప్పుడు చిట్టిబాబు వీణలోంచి కోయిల వచ్చేది.
వసుచరిత్రకారుడు సంగీత సాహిత్యాల దిట్ట. ఆమని ఆగమవేళను వర్ణిస్తూ:
‘లలనా జనాపాంగ వలనా వసదనంగ
తులనాభికా భంగదో ప్రసంగ
మలయానిల విలోల’
ఈ సీసపద్యం వీణ గమకాలకు వొదుగుతుంది. దీనిని వీణపై సాధన చేసిన ప్రముఖులున్నారు. ఉగాది శుభవేళ నేల నిండు దర్బారులా ఉంది. అందులోకి సంవత్సరాది అడుగుపెట్టిందన్నాడు అడిదము సూరకవి. చిగురించిన తియ్యమామిడి చెట్లు పెండ్లికై వేసిన చలువ పందిళ్లుగా కన్పించాయి కూచిమంచి తిమ్మకవికి. అవధాన ద్వయం తిరుపతి వేంకటవులు-
‘కూయంజొచ్చెను కోకిల ప్రతతి కూకూ రాగమొప్పన్’
అంటూ వసంతోదయాన్ని ఆశువుగా వర్ణించారు. ఇక విశ్వనాథ కల్పవృక్షములో అనువైన సందర్భాలను దేనినీ వదలలేదు. పింగళి కాటూరి కవులు, నాయని సుబ్బారావు రుతురాజుని అద్భుతంగా దర్శింపచేశారు. ఉగాది కొత్త చిగుళ్లను, పూలనే కాదు కొత్త ఆశలను వెంట తెస్తుంది. కాలం అనంతమైంది. అందులో తిరిగే కొత్త సంవత్సరం చిన్న చుక్క. ఆ చుక్క నిండా ఎన్నో మధురభావాలు.
- శ్రీరమణ