చిగురించే అవసరాన్ని గుర్తు చేస్తున్న కాలం
ఉగాది, వసంతం, చైత్రమాసం, కోకిల, మామిడి చిగుళ్లూ కవిసమయాలుగా మారిపోయి చాలాకాలమే అయింది. ఇప్పుడు ఆ పదజాలం కూడా అదృశ్యమైపోతున్న కాలంలో ఉన్నాం. ఇంగ్లిష్ నెలలు మాత్రమే తెలిసిన గ్లోబల్ కుగ్రామంలో చాంద్రమాన కాలానికి చెందిన రుతువులు పాతరాతియుగానికి చెందిన మాటలు. మార్చి నెల రాకుండానే ఎండలు ముదురుతున్న రోజుల్లో వింటర్ తరువాత వచ్చే కాలాన్ని సమ్మర్‌గా పిలుచుకునే దేశంలో- ఎప్పుడూ ఏదో ఒక కొత్త నిర్మాణంతో ఇనుమూ, ఉక్కూ, సిమెంటూ, కాంక్రీటు పోగుపడే నగరంలో- కోకిల, తుమ్మెద, మకరందంలాంటి పదాలు ఎవరిలోనూ ఏ స్పందననీ రేకెత్తించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో మన చుట్టూ ఏదో జరుగుతూంటుందిగానీ అది శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పు అని తిలక్ అంటే గాని మనకు తెలియదు.
ఇంతకీ రుతువుల గురించి వినడం వల్లా తెలుసుకున్నందు వల్లా మనకేమి ప్రయోజనం అనుకునే ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాసం కూడా ఒక వ్యాపార నిర్వహణాంశంగా మారిపోయిన ఈ కాలంలో రుతుఘోష ఎవరికి కావాలి? అయినా అనాదికాలం నుంచి చెట్టు చిగురించడాన్ని మనుషులు పండగ చేసుకుంటూనే ఉన్నారు. శీతాకాలంలో మంచులో కప్పడిపోయిన లోకంలో తొలి సూర్యరశ్మి, లేతాకుపచ్చ చిగుళ్లూ జీవితానికి ముగింపు లేదనీ అది ప్రతి ఏడాదీ సంభవించే పునరుత్థానమనీ తెలిసినప్పుడల్లా మనిషి వాటి చుట్టూ ఎన్నో పురాణగాథలు అల్లుకుంటూనే ఉన్నాడు. గ్రీకుల డెమెటర్, బేబిలోనియన్ల ఇనానా, యూదుల రొట్టెల పండగ, ప్రాచీన యూరోప్‌లో డ్రూయిడ్ల వనదేవతారాధన, క్రైస్తవుల ఈస్టర్, భారతదేశపు హోలి పండగ వసంతం మతక్రతువుగా మారిపోయిన ఆనవాళ్లు. బహుశా తిరిగి తిరిగి సంభవించే సంతోషాన్ని క్రతువుగా మార్చకుండా కాపాడుకోవడం కష్టం.
తెలుగువాడికి కొత్తసంవత్సరం చైత్రమాసంతో మొదలవుతుంది. అది అతడి సౌందర్యారాధనకి గుర్తు. అయినా ఎందుకో తెలుగు కవిత్వంలో చెట్ల గురించి మాట్లాడేవాళ్లంటే చిన్నచూపు, ఒకింత అనుమానం. పీడిత ప్రజల పట్ల ఎక్కువ ప్రేమ, సమాజిక అసమానతల పట్లా, అన్యాయాల పట్లా సహించలేని ఆగ్రహం, అసమ్మతి ఉంటేనే కవి! అందుకనే బెర్టోల్డ్ బ్రెహ్ట్ అనుకున్నట్టే ఒక తెలుగుకవి కూడా ఇలా అనుకుంటాడు:
ఎట్లాంటి కాలమిది, ఇప్పుడొక
చెట్టు గురించి మాట్లాడటమంటే ఒక నేరం చేస్తున్నట్టే
అలా మాట్లాడటం వల్ల ఎన్నో ఘోరాల గురించి
మౌనం వహిస్తున్నట్టే
అయినా చెట్టు గురించి ఆలోచించకుండా ఉండలేం. చిగురిస్తున్న చెట్టుని చూసే మనం కఠిన సమయాల్లో గుండె దిటవు చేసుకోవలసి ఉంటుంది. కాని వసంతం రావడం ప్రత్యక్షదృశ్యం. లేతాకుపచ్చ కాంతితో మిలమిల్లాడే కానగచెట్లు, తెల్లవారుజాముల్లో గాలంతా ఆవరించే వేపపూల తీపిసుగంధం, ఇక ఎక్కణ్ణుంచో ప్రతి వసంతంలోనూ ఆకాశాన్నొక వలగా మన మీద విసిరే కోకిలపాట నగరంలో ప్రత్యక్షానుభవాలే.
తెలుగు నేల మీద కవిత్వం రాసిన నేరానికి కారాగారానికి నడిచిన మొదటి కవి దాశరథి కృష్ణమాచార్యనే. ‘మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే/ మాటలు రాని కోయిలమ్మ పాడునులే’ అన్నప్పుడు అది ఎంత ఉత్సాహకరంగా వినిపిస్తుందని. ‘నిజంగానే నిఖిలలోకం నిండుహర్షం వహిస్తుందా! బానిసలు సంకెళ్లు తెగిసే పాడుకాలం లయిస్తుందా’ అని శ్రీశ్రీ అశ్చర్యార్థకంగా మనముందుంచిన ప్రశ్నార్థకానికి దాశరథి వాక్యం సమాధానమనిపిస్తుంది.
వసంతంలో ఏదో ఇంద్రజాలముంది. ముప్పై ఏళ్ల కిందన రాజమండ్రిలో ఒక సాయంకాలం ప్రబంధకవిత్వం గురించి మాట్లాడుతూ మా మాష్టారు మల్లంపల్లి శరభయ్యగారు అల్లసాని పెద్దన రాసిన ఈ పద్యం వినిపించారు:
చలిగాలి బొండుమల్లెల పరాగము రేచి
నిబిడంబు సేసె వెన్నెల రసంబు
వెన్నెల రసముబ్బి వెడలించె దీర్ఘికా
మంద సౌగంధిక మధునదంబు
మధునదంబెగబోసె మాకందమాలికా
క్రీడానుషంగి భృంగీరవంబు
భృంగీరవంబహంకృతి దీగెసాగించే
బ్రోషిత భర్తృకారోదనముల
విపినవీథుల వీతెంచె కుపితమదన
సమదభుజనత సుమధనుష్టాంకృతములు
సరసమధుపానని ధువనవిలీన
యువతి యువకోటి కోరికల్ చివురులొత్త.
ఈ పద్యం నాకు అయిదువందలేళ్ల కిందటి కవితలాగా అనిపించలేదు. చాలా కొత్తగా ఆధునికంగా వినిపించింది. కవి ఏం చెప్తున్నాడు?
చల్లగాలికి మల్లెల పరాగం రేగిందట. ఆ పుప్పొడి వల్ల వెన్నెల రసం చిక్కబడిందట. ఆ వెన్నెల వాక వల్ల దిగుడుబావుల్లో పూసిన ఎర్రకలువల మకరందం ఏరులై ప్రవహించిందట. ఆ తేనెవాకకి తియ్యమామిడి చెట్ల గుబుర్లలో తిరుగుతున్న తేనెటీగల పాట బలపడింది. ఆ పాట వినగానే ఒంటరిగా ఉంటున్న స్త్రీ హృదయవేదన మిక్కుటమైంది. వారి వేదనవల్ల ప్రేమబాణాలు మరింత పదునెక్కాయి. ప్రణయానురాగం తీవ్రమైనందువల్ల యువతీయువకుల కోరికలు చిగురించాయట.
ఇందులో ఉన్నవన్నీ సాధారణ కవిసమయాలే. కాని కవి చెప్తున్న విషయం మాత్రం సాధారణం కాదు. అసాధారణమైన హృదయకోశం. ఒక జీర. బహుశా కుపిత మన్మథ ధనుష్టంకారాన్ని అందరికన్నా ముందు వినేవాడే కవి. కవిత్వమెందుకు చదవాలంటే ఎద మెత్తనవడానికని వేరే చెప్పాలా?
ఎప్పటికప్పుడు కాలాన్ని కొత్తగా మార్చే రుతుగమనాన్ని పసిగట్టి మనం చూడలేని అందాల్ని మనకు చూపించే కవులే లేకపోతే ఈ ప్రపంచమింత వర్ణమయశోభితంగా ఉండేదే కాదు. కేవలం రంగులూ రాగాలూ మాత్రమే కాదు ఈ గమనంలో ఏదో మెలకువ ఉంది. దాన్ని పట్టుకున్న క్షణం మనం మన జీవిత కేంద్రంలోకి చొచ్చుకుపోయినట్టూ మన జీవితసారాంశం కరతలామలకమైనట్టూ అనిపిస్తుంది.
వసంతవేళ్లలో జీవితం కొత్తగా మొగ్గ తొడిగే ఉత్సాహం. మళ్లా మరొకసారి అల్లసాని పెద్దననే స్మరించాలనిపిస్తోంది. చెట్టు కొమ్మ మీద చిగురు పొటమరించే దృశ్యాన్నెట్లా కవితగా మలిచాడో చూడండి:
సానదేరి పొటమరించి నెరె వాసినయట్టి
యాకురాలపు గండ్లయందు తొరగి
యతిబాల కీరచ్చదాంకృతి బొల్చి
కరవీరకోరక గతిగ్రమమున
నరుణంపు మొగ్గలై యరవిచ్చి పికిలి యీ
కలదండలట్లు గుంపులయి పిదప
రేఖలేర్పడగ వర్థిల్లి వెడల్పయి రెమ్మ
పసరువారుచు నిక్కబసరు కప్పు
పూటపూటకు నెక్క గప్పునకు దగిన
మెరుగు నానాటికిని మీద గిరికొనంగ
సోగయై యాకువాలగ జొంపమగుచు
జిగురు దళుకొత్తె దరులంతా శ్రేణులందు
ఇదొక దృశ్యం. వసంతకాలం వచ్చింది. అప్పుటికి కొమ్మల మీంచి పండుటాకులు రాలిన గండ్లల్లో ఒక కలకలం. గుడ్డు నుంచి బయటపడ్డ చిలకరెక్కల కొనల్లాగా కనిపించి ఆ మీదట ఎర్రగన్నేరు మొగ్గల్లాగా విచ్చుకుని పికిలిపిట్టల ఈకలాగా ఈనెలు చాపి పచ్చరంగు తిరిగి ఆ పచ్చదనం నెమ్మదిగా నలుపెక్కీ చిక్కటి కాంతితో ఆకుచాటున చిగురు తళుకెత్తిన దృశ్యం. దీన్ని కేవలం చిగురుటాకు వర్ణనగా చూడలేం. చిగురించే ప్రతి సందర్భం- అది ప్రేమ కావచ్చు. స్నేహం కావచ్చు. గాఢమైన ఏ మానవానురాగమైనా కావచ్చు. జీవితం చిగురించే ప్రతి వేళా ఇదే క్రమం. ఇదే వర్ణమయ శోభ. ఇంద్రధనుసులో ఎన్ని రంగులున్నాయో అన్నీ ఉన్నాయిక్కడ. అందుకనే కృష్ణశాస్త్రి ప్రతీ రాత్రి వసంతరాత్రి కావాలని ప్రతిగాలి పైరగాలి కావాలనీ బతుకంత ప్రతి నిమిషం పాటలాగ సాగాలనీ కోరుకున్నాడు.
బహుశా ప్రపంచానికి కవిత్వం అవసరముంటే, వసంతవేళల్ని వర్ణించడం అవసరముంటే ఆ అవసరం మానవచరిత్రలో ఇప్పుడు అవసరమైనంతగా ముందెన్నడూ లేదనే అనుకోవాలి.
- వాడ్రేవు చినవీరభద్రుడు