వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముఠాకు చెందిన 18 మంది అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కాగా వరంగల్లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని రోజులుగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అబార్షన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ దీనిపై దృష్టి సారించారు. దీన్ని చేదించేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యారోగ్యశాఖ విభాగాలను రంగంలోకి దించి దర్యాప్తు చేయించారు. ‘ఆపరేషన్ దేశాయ్’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు.
‘ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. ‘గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అరెస్టయ్యాడు.గత అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, హాస్పిటల్ మెనెజ్మెంట్, డాక్టర్లతో కలిసి అక్రమ దందా పాల్పడుతున్నాడు.
ప్రవీణ్ భార్య సంధ్యారాణితో కలిసిగోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో పోర్టబుల్ స్కానర్ల సహయంతో స్కానింగ్ ఏర్పాటు. ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్లు చేసిన ముఠా. స్కానింగ్ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు.
చదవండి: నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు