చార్మినార్: పాతబస్తీలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారిని కట్టడి చేసేందుకు ఇక్కడ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి తమ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రెట్టింపు చేయనున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ ఎ.వి. రంగనాథ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆయన చార్మినార్ వద్ద విలేకరులతో మాట్లాడారు. అంతేకాకుండా దక్షిణ మండలంలో 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే వాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ సంఖ్య అత్యల్పమని పేర్కొన్నారు. పాతబస్తీలో నకిలీ నంబర్ ప్లేట్లు, దొంగలించిన ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయని... ఇవీ పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ ఓనర్‌షిప్‌లపై నగరంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు. నగరంలో దాదాపు 45 లక్షల వాహనదారులుంటే... 25 లక్షల మందికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్‌లున్నాయన్నారు. లేని వారంతా వెంటనే లెర్నింగ్ లైసెన్స్‌లు తీసుకోకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు. క్రిమినల్ కేసులు నమోదైతే పాస్‌పోర్టు సంపాదించడానికి కష్ట సాధ్యమవుతుందన్నారు. నగరంలో 7 నుంచి 10 లక్షల వాహనాలకు ఓనర్‌షిప్ పత్రాలు అందుబాటులో లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గతేడాది అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ అంశాలపై నగర వాహనదారులకు పది సార్లు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించిన ఆరు నెలల అనంతరం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
'పాతబస్తీలోనే ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువ'
Published Wed, Mar 9 2016 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement