Avinash dev chandra
-
హోంమంత్రి గారికి 'బంధువుల' బెడద !
డిప్యూటీ సీఎంకు ‘బంధువుల’ బెడద చినరాజప్ప పేరు యథేచ్ఛగా వాడుకుంటున్న నేరగాళ్లు కాల్‌మనీ కేసుల్లోనూ వాడేస్తున్న వైనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ‘బంధువుల’ బెడద పట్టుకుంది. అది కూడా నేరగాళ్ల రూపంలో. ‘హోం మంత్రి ఎవరనుకుంటున్నావు? మా బంధువే! చెప్పింది చెయ్యి’ అంటూ తమ నేరాల గురించి ప్రశ్నించిన పోలీసులను సైతం కొందరు బెదిరించిన దాఖలాలున్నాయి! తాజాగా కాల్‌మనీ కేసుల్లోనూ హోం మంత్రి తమ బంధువంటూ పలువురు నిందితులు చెప్పుకుంటున్నారు. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తుల పేర్లను ఇలా ఇష్టానుసారం ఉపయోగిస్తే.. రియాక్షన్ కూడా సీరియస్‌గానే ఉండాలి. కానీ, రాజప్ప సాక్షాత్తూ రాష్ర్ట పోలీసు శాఖకు బాస్ అయినా.. అటువంటి వ్యక్తులపై ఆ స్థాయిలో స్పందిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. మెతకగా ఉంటూ కేవలం ఖండనలకే పరిమితమవుతున్నారంటూ ఆయన వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. కాకినాడ : ఇటీవల వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారు డిప్యూటీ సీఎం చినరాజప్ప పేరును యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌతిండియా చైర్మన్‌నని, హోం మంత్రి రాజప్ప బంధువునని హడావుడి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్‌చంద్ర గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో ఆయనకు సలాం చేసిన అమాయకులు.. పోలీ సులకు పట్టుబడిన తరువాత అతడో మోడగాడని గ్రహించారు. గత ఏడాది మార్చి నెలలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అవినాష్ పూర్వీకుల స్వస్థలం కోనసీమలోని పి.గన్నవరం మండలం పోతవరం. చినరాజప్ప కూడా కోనసీమలోని అమలాపురం ప్రాంతానికి చెందినవారే. ఆయన వివరాలన్నీ అవినాష్ చెబుతూండటంతో అంతా రాజప్ప బంధువేనని నమ్మేవారు. కొంతమంది అధికారులు కూడా ఆయనకు బాగానే సహకరించేవారు. ఇదే అదనుగా అతడు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గంజాయి, పులిచర్మాల స్మగ్లింగ్ చేసేవాడు. చివరకు పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ సమయంలో కూడా హోం మంత్రి ఖండించడం తప్ప అవినాష్‌పై వ్యక్తిగతంగా ఎటువంటి కేసూ నమోదు చేయించలేదు. తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో అడపాదడపా ఆయన పేరును కొంతమంది వాడుకున్నా పోలీసులు కఠిన చర్యలు చేపట్టలేదు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోకన్నా ఆయన నివాసం ఉంటున్న అమలాపురంలోనే ఎక్కువమంది నేరగాళ్లు తాము ఆయన బంధువులమని బాహాటంగా చెప్పుకుంటున్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వాధికారులను కూడా బెదిరిస్తున్నారు. కాల్‌మనీ కేసుల్లోనూ.. జిల్లాలో అమలాపురం కేంద్రంగా వడ్డీ వ్యాపారం భారీస్థాయిలో జరుగుతోంది. వడ్డీ వసూళ్లు, సెటిల్మెంట్లలో వేలు పెట్టే రౌడీషీటర్లు, దందాబాబులకు ఇది అడ్డాగా మారింది. డిప్యూటీ సీఎంకు చెందిన ప్రాంతంలోనే వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేరగాళ్లలో చాలామంది ప్రతి చిన్న విషయానికీ రాజప్ప పేరు చెప్పి తప్పించుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల విజయవాడలో కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో.. జిల్లాలోనూ పలువురు బాధితులు బయటకొచ్చారు. ఇచ్చిన రుణానికి పదిరెట్లు గుంజుతున్నా, భయపెట్టి ఆస్తులు లాక్కుంటున్నా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బంధువునంటూ అమలాపురానికి చెందిన వడ్డీ వ్యాపారి ఒకరు, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎన్.కొత్తపల్లికి చెందిన ఆక్వా రైతు ఏలూరు డీఐజీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రాజప్ప స్పందించినా.. వారు తన బంధువులు కాదంటూ ఖండనకే పరిమితమయ్యారు. తప్పుడు సంకేతాలు ఇలా పలువురు నేరగాళ్లు, క్రిమినల్ కేసుల్లో నిందితులు రాజప్ప పేరు వాడేస్తున్నా.. అటు ఆయన కానీ, ఇటు పోలీసులు కానీ కేసులు నమోదు చేయడంలేదు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రైతు దేశంశెట్టి సత్తిబాబు... గత నెలలో కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన ఆవేదనతో ఫ్లెక్సీ పెట్టిన విషయం తెలిసిందే. ఈమార్రానికే పోలీసులు అతడిని స్టేషన్‌కు లాగారు. అలాంటిది డిప్యూటీ సీఎం పేరును వాడుకుంటున్నవారిపై కేసులు పెట్టడంలేదు. కనీసం రాజప్ప నుంచి కూడా ఫిర్యాదులు ఉండడంలేదు. ఇలాంటి నేరాల విషయంలో డిప్యూటీ సీఎం వ్యవహార శైలి తప్పుడు సంకేతాలు ఇచ్చేదిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
పోలీసు కస్టడీలో అవినాష్
కాకినాడ క్రైం :అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ మండల అధ్యక్షుడినని, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునని చెప్పుకుంటూ పలు అక్రమాలకు పాల్పడిన అవినాష్ దేవ్‌చంద్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడైన అతడిని విచారించేందుకు తమకు అప్పగించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. రెండు రోజుల క్రితమే అతడిని పోలీసు కస్టడీకి తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం కాకినాడలోని పోలింగ్ కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఈ విషయం విలేకర్లకు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో కూడా అతడిపై వన్యప్రాణి సంరక్షణ, స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం అవి కోర్టు విచారణలో ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారని చెప్పారు. అలాగే అవినాష్‌కు ఇసుక మాఫియా, గంజాయి స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ దందాల్లో కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రైస్ పుల్లింగ్ కాయిన్ (ఈ కాయిన్స ఉన్నవారికి అతీంద్రియ శక్తులు, భోగభాగ్యాలు వస్తాయని నమ్ముతారు) నిమిత్తం ఒడిశా రాష్ర్టం రాయగడకు చెందిన ఇద్దరిని అతడు గతంలో నిర్బంధించాడన్నారు. వారిని విశాఖలోని ఒక రూములో బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇద్దరు బాధితుల వివరాలు కూడా తమకు తెలిశాయని, వారి నిమిత్తం ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపామని చెప్పారు. ఈ వ్యవహారంలో మరో ఆరుగురు వ్యక్తులు అవినాష్‌కు సహకరించారని, వారి వివరాలు కూడా తమకు తెలిశాయని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు. అవినాష్ అనుచరుడు ఒకరిని విజయవాడలో ఇటీవల అరెస్టు చేశారని, జిల్లాలో కూడా అతడి అనుచరులున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు. బాధితుల బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, అవినాష్‌కు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తనకు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంలో పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుంచి అవినాష్ రూ.14 లక్షలు వసూలు చేసినట్లు కాకినాడకు చెందిన బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన కేసులకు సంబంధించి అతడిని విచారిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని రాబట్టి తిరిగి రెండు రోజుల్లో అవినాష్‌ను సబ్‌జైలుకు తరలించనున్నారు.