:అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ మండల అధ్యక్షుడినని, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునని చెప్పుకుంటూ పలు అక్రమాలకు పాల్పడిన అవినాష్ దేవ్‌చంద్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
కాకినాడ క్రైం :అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ మండల అధ్యక్షుడినని, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువునని చెప్పుకుంటూ పలు అక్రమాలకు పాల్పడిన అవినాష్ దేవ్‌చంద్రను తూర్పు గోదావరి జిల్లా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడైన అతడిని విచారించేందుకు తమకు అప్పగించాల్సిందిగా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. రెండు రోజుల క్రితమే అతడిని పోలీసు కస్టడీకి తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం కాకినాడలోని పోలింగ్ కేంద్రానికి తనిఖీ నిమిత్తం వచ్చిన ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఈ విషయం విలేకర్లకు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో కూడా అతడిపై వన్యప్రాణి సంరక్షణ, స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని, ప్రస్తుతం అవి కోర్టు విచారణలో ఉన్నట్లు అక్కడి పోలీసులు తెలిపారని చెప్పారు. అలాగే అవినాష్‌కు ఇసుక మాఫియా, గంజాయి స్మగ్లింగ్, రియల్ ఎస్టేట్ దందాల్లో కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రైస్ పుల్లింగ్ కాయిన్ (ఈ కాయిన్‌స ఉన్నవారికి అతీంద్రియ శక్తులు, భోగభాగ్యాలు వస్తాయని నమ్ముతారు) నిమిత్తం ఒడిశా రాష్ర్టం రాయగడకు చెందిన ఇద్దరిని అతడు గతంలో నిర్బంధించాడన్నారు.
వారిని విశాఖలోని ఒక రూములో బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇద్దరు బాధితుల వివరాలు కూడా తమకు తెలిశాయని, వారి నిమిత్తం ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపామని చెప్పారు. ఈ వ్యవహారంలో మరో ఆరుగురు వ్యక్తులు అవినాష్‌కు సహకరించారని, వారి వివరాలు కూడా తమకు తెలిశాయని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు. అవినాష్ అనుచరుడు ఒకరిని విజయవాడలో ఇటీవల అరెస్టు చేశారని, జిల్లాలో కూడా అతడి అనుచరులున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు.
బాధితుల బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, అవినాష్‌కు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. తనకు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘంలో పదవి ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుంచి అవినాష్ రూ.14 లక్షలు వసూలు చేసినట్లు కాకినాడకు చెందిన బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన కేసులకు సంబంధించి అతడిని విచారిస్తున్నారు. పూర్తి సమాచారాన్ని రాబట్టి తిరిగి రెండు రోజుల్లో అవినాష్‌ను సబ్‌జైలుకు తరలించనున్నారు.