ప్రమాదాల నివారణకు టాస్క్‘ఫోర్స్’
– 14 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం
– ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేలా శిక్షణ
– జిల్లా అగ్నిమాపకశాఖలో నూతన ఒరవడి
ప్రమాదం ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు. సామాన్యులు ప్రమాదాల్లో చిక్కుకున్నపుడు వెంటనే సాయం కోరేది పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులనే. విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు సుక్షితులైన సిబ్బందిని తయారుచేయడంపై జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు దృష్టి సారించారు.
అనంతపురం సెంట్రల్: ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో పోలీసుశాఖతో పాటు అగ్నిమాపకశాఖ అధికారులు కూడా కీలకం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, మంటలు ఎగిసిపడినప్పుడు, వరదల సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ అధికారుల సేవలు ఎంతో కీలకం. భారీ భవంతుల్లో అగ్నికీలలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా బయటకు చేరవేయడం చాలా కష్టం. రోప్‌ల సాయంతో భవంతులపైకి ఎక్కాల్సి వస్తుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాల్సి ఉంటుంది. వరదల సమయంలో ముంపులో చిక్కుపోయిన ప్రజలను బయటపడేయాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ విభాగం :
విపత్తులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపకశాఖలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని నెలకొల్పారు. 14 మంది సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరికి వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. రెండు రోజులుగా జీడిపల్లి జలాశయంలో స్విమ్మింగ్ (ఈత), బోటింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఈ విభాగాల్లో కానిస్టేబుల్ మనోహర్ మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో పాటు భవంతుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు రోప్ క్లెయిమింగ్, అగ్నిప్రమాదాలు సమయాల్లో తీసుకోవాల్సిన మెలకువలు తదితర అంశాలపై వీరికి తర్ఫీదు ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఒడిశాలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో జిల్లా నుంచి ముగ్గరు అధికారులు పాల్గొన్నారు. సముద్రంలో సహాయక చర్యల్లో పాల్గొనేలా వీరికి తర్ఫీదు ఇచ్చారు.
ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొంటాం
ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 14 మంది టాస్క్ఫోర్సు సిబ్బందిని ఏర్పాటు చేశాం. జిల్లా నుంచి ముగ్గురు సభ్యులు ఇటీవల ఒడిశాలో కూడా శిక్షణ తీసుకున్నారు. జిల్లాలో కూడా జీడిపల్లి జలాశయానికి తీసుకెల్లి బోటింగ్, స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నాం. సుశిక్షితులైన వారు ఉండడం వలన ప్రమాదాల సమయంలో నష్టం లేకుండా ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు ఆస్కారం ఉంటుంది.
- సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి