క్రికెటర్లకు అవార్డులెందుకు?
క్రీడా శాఖ ఆలోచన
బెంగళూరు: భారత్ తరఫున ఆడని ఆటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న కేంద్ర క్రీడా శాఖ దృష్టి ప్రస్తుతం క్రికెటర్లపై పడింది. సరైన కారణం చూపకుండా భారత్‌కు ఆడని ప్రముఖ క్రీడాకారులకు ఇక నుంచి అర్జున, ఖేల్త్న్ర అవార్డులు కూడా దక్కకపోవచ్చు. వచ్చే ఏడాది క్రీడా అవార్డుల నిబంధనల్లో ఇలాంటి మార్గదర్శకాలను పొందుపరిచేందుకు అవకాశం ఉన్నట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. ఇక కేంద్రం ఇచ్చే నిధులు తమకు అనవసరమన్నట్టు వ్యవహరించే బీసీసీఐ ఆసియా క్రీడలకు వరుసగా రెండోసారి క్రికెట్ జట్లను పంపలేదు. దీంతో బోర్డు వైఖరి కారణంగా క్రికెటర్లను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోకపోవచ్చని సమాచారం.
నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు: పేస్
న్యూఢిల్లీ: తన పాతికేళ్ల కెరీర్లో ఎన్నడూ దేశం తరఫున ఆడేందుకు వెనుకాడలేదని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. ‘క్రీడా శాఖ ఏం చెప్పిందనేది పూర్తిగా నాకు తెలీదు. కానీ దేశం తరఫున ఆడేందుకు ఎప్పుడూ గర్విస్తుంటాను. ఇప్పటికే ఆరు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నప్పుడు కూడా దేశం తరఫున ఆడుతున్నట్టే భావిస్తాను’ అని పేస్ చెప్పాడు.