Ayubkhan
-
టీఆర్ఎస్పై తిరుగుబాటు వస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో అన్నివర్గాల్లో టీఆర్ఎస్పై తిరుగుబాటు మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి మల్లేశం, తాహెర్బిన్తో కలిసి విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలకు పార్టీ నేతలు, తెలంగాణ ఉద్యమకారులే ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులను ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల పట్ల టీఆర్ఎస్ అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేయడంతో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిముందు దళిత యువకుడు శ్రీనివాస్ ఆత్మాహుతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఆయూబ్‌ఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రజల ప్రాణాలను హరించడానికే పాలకులు ఉన్నారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. దళితుల హత్యలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించడం, పోలీసుల లాఠీ చార్జీ, థర్డ్ డిగ్రీ వేధింపులు, గిరిజన మహిళలను తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం, పంటలకు ధరలు ఇవ్వమని అడిగినందుకు గిరిజన యువకుల చేతులకు బేడీలు వేయడం, మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసాలు, మహిళలను అవమానించడం వంటి ఎన్నో చర్యలకు టీఆర్ఎస్ పాల్పడిందని వివరించారు. శ్రీనివాస్, ఆయుబ్ ఖాన్ ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. వీటిపై ప్రజలు విసిగిపోయారని, తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. -
పార్టీలో గుర్తింపు లేదని.. నిప్పంటించుకున్నాడు
- టీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్యాయత్నం - మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఘటన పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు తాండూరు: పార్టీలో తనకు సరైన గుర్తింపు లేద ని.. నామినేటెడ్ పదవులు కూడా దక్కలేదంటూ మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఓ టీఆర్ఎస్ నాయకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో కలకలం సృష్టిం చింది. బుధవారం పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే.. మొదటగా తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ కోరగా.. ఇందుకు మంత్రి అంగీకరించారు. అయూబ్‌ఖాన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడి పనిచేశానని, రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కూడా పని చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం సాధించి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనా కూడా తమలాంటి ఉద్యమకారులకు గుర్తింపు లేదని అయూబ్‌ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో వచ్చిన వారికి పదవులు దక్కుతున్నాయని, ఉద్యమ కారులకు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం లేదని చెప్పి తన ప్రసంగం ముగించి వెళ్లి కార్యకర్తల మధ్యలో కూర్చున్నాడు. అనంతరం సభ జరుగుతుండగా అయూబ్‌ఖాన్ ఒక్కసారిగా లేచి అప్పటికే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తల, ఛాతీ భాగాలు తీవ్రంగా కాలి పోయాయి. వెంటనే అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పి జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఉలిక్కిపడ్డ మంత్రి మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో తనకు న్యాయం జరగడం లేదంటూ అయూబ్‌ఖాన్ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో అక్కడే ఉన్న మంత్రి మహేందర్‌రెడ్డి ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘటనతో ఆయన షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని, వైద్యులతో మాట్లాడారు. అయూబ్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించగా, మంత్రి మహేందర్‌రెడ్డి కూడా వెళ్లారు.