సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో అన్నివర్గాల్లో టీఆర్‌ఎస్‌పై తిరుగుబాటు మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి మల్లేశం, తాహెర్‌బిన్‌తో కలిసి విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ చేస్తున్న మోసాలకు పార్టీ నేతలు, తెలంగాణ ఉద్యమకారులే ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులను ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల పట్ల టీఆర్‌ఎస్ అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేయడంతో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిముందు దళిత యువకుడు శ్రీనివాస్ ఆత్మాహుతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఆయూబ్‌ఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రజల ప్రాణాలను హరించడానికే పాలకులు ఉన్నారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. దళితుల హత్యలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించడం, పోలీసుల లాఠీ చార్జీ, థర్డ్ డిగ్రీ వేధింపులు, గిరిజన మహిళలను తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం, పంటలకు ధరలు ఇవ్వమని అడిగినందుకు గిరిజన యువకుల చేతులకు బేడీలు వేయడం, మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసాలు, మహిళలను అవమానించడం వంటి ఎన్నో చర్యలకు టీఆర్‌ఎస్ పాల్పడిందని వివరించారు. శ్రీనివాస్, ఆయుబ్ ఖాన్ ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. వీటిపై ప్రజలు విసిగిపోయారని, తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.