‘సహజం’ మరి.. దిగ్గజాలూ ఇటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాక్ టు బేసిక్స్... అనేది ఆయుర్వేద ఉత్పత్తులకు అమాంతం డిమాండ్ పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఔషధాలు, ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు, హెయిర్ ఆయిల్స్‌లో వినియోగదార్లు ‘నేచురల్’ కోరుకుంటుండటంతో కంపెనీలు దీనిపై మరింత ఫోకస్ పెడుతున్నాయి.
ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేద, సహజ ఉత్పత్తుల వాడకం ఉన్నప్పటికీ, యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి రావడం, పతంజలి రాకతో భారత మార్కెట్లో వీటకి ఊపొచ్చింది. ఇక్కడున్న అపార అవకాశాల నేపథ్యంలో దిగ్గజ కంపెనీలూ నేచురల్ బాట పట్టడం విశేషం. ప్రపంచంలో ఆయుర్వేద ఉత్పత్తుల తొలి ఈ–కామర్స్ వేదికైన ‘ఆల్ఆయుర్వేద.కామ్’ అమ్మకాల్లో హైదరాబాద్ వాటా ఏకంగా 40 శాతం ఉండటం గమనార్హం.
ఇదీ దేశీయ మార్కెట్..
భారత ఆయుర్వేద, సహజ ఉత్పత్తుల మార్కెట్ 13–15 శాతం వార్షిక వృద్ధితో సుమారు రూ.50,000 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా హెయిర్ ఆయిల్స్ వాటా రూ.30,000 కోట్లు. ఆయుర్వేద ఔషధాలు రూ.10,000 కోట్లు, ఆహార పదార్థాలు రూ.1,000 కోట్లు నమోదు చేస్తున్నాయి. మిగిలిన వాటా పర్సనల్ కేర్ ఉత్పత్తులది. 2020 నాటికి మొత్తం మార్కెట్ రూ.70,000 కోట్లకు చేరుతుందని ‘కపివ’ ఫౌండర్ శ్రే బధానీ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.
డాబర్, బైద్యనాథ్, హిమాలయ, ఇమామీ, చరక్, విక్కో, హమ్దర్ద్ వంటి ప్రముఖ కంపెనీలు ఆయుర్వేద, సహజ ఉత్పత్తులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సంప్రదాయ చైనా మందులకు ఆదరణ ఉంది. దీన్ని సానుకూలంగా తీసుకున్న భారతీయ కంపెనీలు... యూఎస్, సింగపూర్, హాంకాంగ్, యూకే తదితర దేశాలకు ఎగుమతుల్ని పెంచటంపై దృష్టి పెట్టాయి. హాలీవుడ్లో పాపులర్ ప్లాస్టిక్ సర్జన్ అయిన భారత సంతతికి చెందిన డాక్టర్ రాజ్ కనోడియా... ఉసిరితో చేసిన సౌందర్య సాధనాలను ప్రమోట్ చేస్తుండటం గమనార్హం.
తీవ్రమైన పోటీ..: బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి దూకుడు మీద ఉంది. అవకాశమున్న అన్ని విభాగాల్లోకీ ప్రవేశిస్తోంది. ఆయుర్వేద, నేచురల్ప్రొడక్టులను విక్రయిస్తున్న ఆల్ఆయుర్వేద.కామ్ భారత్‌తోపాటు విదేశీ కస్టమర్లకూ చేరువవుతోంది. హిందుస్తాన్ యూనిలీవర్ ఆయుర్వేద ఉత్పత్తులతో లీవర్ ఆయుష్ బ్రాండ్‌ను పరిచయం చేసి... బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ను ప్రచారకర్తగా నియమించుకుంది.
కేరళకు చెందిన ఇందులేఖ బ్రాండ్‌ను హిందుస్తాన్ యూనిలీవర్ రెండేళ్ల కిందట కొనుగోలు చేయటం తెలిసిందే. కోల్గేట్–పామోలివ్ నుంచి కోల్గేట్ వేదశక్తి, సిబాకా వేదశక్తి, సెన్సిటివ్ క్లోవ్ పేరుతో కొత్త బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. ఇక దేశీ దిగ్గజం డాబర్.... ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌తో చేతులు కలిపి యూఎస్ విపణిలో ఉత్పత్తులు విక్రయిస్తోంది.
మెడిమిక్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న చోళాయిల్ ఇతర విభాగాలకు విస్తరిస్తోంది. ఇమామీ తన పాపులర్ బ్రాండ్స్ కేశ్ కింగ్, బోరో ప్లస్, నవరత్న, ఝండూబామ్, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్, మెంథోప్లస్ ఉత్పత్తుల ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తోంది. ఆర్ట్ ఆఫ్ లివిండ్ ఫౌండేషన్ ప్రమోట్ చేస్తున్న శ్రీశ్రీ ఆయుర్వేద బ్రాండ్ కూడా విదేశాల్లోకి ప్రవేశించింది.
క్లినిక్స్కూ కార్పొరేట్ కిక్కు...!
ఉత్పత్తుల విస్తరణ, కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడంతో పాటు ఆయుర్వేద క్లినిక్స్ సైతం కార్పొరేట్ స్థాయిని సంతరించుకుంటున్నాయి. కేరళ ఆయుర్వేదిక్ హెల్త్‌కేర్, జీవ ఆయుర్వేద, కీవ ఆయుర్వేద వంటి కంపెనీలు క్లినిక్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. బైద్యనాథ్‌కు చెందిన కపివ బ్రాండ్ హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా క్లినిక్స్‌ను ప్రారంభిస్తోంది.
కాగా, సహజ వనమూలికలతో తయారైన సౌందర్య సాధనాల విపణి సుమారు రూ.9,000 కోట్లుంది. ఈ విభాగంలోకి నియోవేద, జస్ట్ హెర్బ్స్, డిసర్ట్ స్లె్పండర్, సోల్ట్రీ, ఫస్ట్ వాటర్ సొల్యూషన్స్ వంటి కొత్త బ్రాండ్లు ప్రవేశించాయి.
ఆయిల్స్దే హవా..
దేశంలో సహజ ఉత్పత్తుల విపణిలో రూ.30వేల కోట్ల వాటాతో హెయిర్ ఆయిల్స్ హవాయే నడుస్తోంది. నిజానికి పట్టణ ప్రాంతాల్లో తల నూనెల వాడకం కొన్నేళ్లుగా తగ్గుతోంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనెతోపాటు నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారైన నూనెల రాకతో వాడకం తిరిగి పుంజుకుందని డాబర్ ఇండియా హెయిర్ ఆయిల్స్, షాంపూస్ మార్కెటింగ్ హెడ్ రజత్ నందా తెలిపారు.
చుండ్రు, తలనొప్పి, ఒత్తిడి, వెంట్రుకలు రాలడం, బట్టతల వంటి సమస్యల పరిష్కారానికి సహజ, ఆయుర్వేద ఉత్పత్తులతో తయారైన నూనెలపై ఆధారపడుతున్నారని చెప్పారు. తలనూనెల పరిశ్రమలో 80 శాతం వ్యవస్థీకృత రంగానిదేనని ఆయన వెల్లడించారు.