Azlan Shah hockey cup tournament
-
భారత్‌కు మలేసియా షాక్
అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీ ఇపో (మలేసియా) : చివరి నిమిషాల్లో తడబాటు బలహీనతను అధిగమించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల హాకీ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకుంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఆతిథ్య మలేసియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-3 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌తో ఆడిన 106 మ్యాచ్‌ల్లో కేవలం 14 సార్లు మాత్రమే నెగ్గిన మలేసియా ఈసారి సొంతగడ్డపై సత్తా చాటుకుంది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా షారున్ అబ్దుల్లా గోల్‌తో మలేసియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు మలేసియా తరఫున ఫైజల్ సారీ (17వ ని.లో), హజీక్ సంసూల్ (35వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు రూపిందర్ పాల్ సింగ్ (20, 51వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 58వ నిమిషంలో రక్షణ పంక్తిలో గుర్బాజ్ సింగ్ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న మలేసియా ప్లేయర్ అబ్దుల్లా బంతిని గోల్ పోస్ట్‌లోని పంపించి ఆతిథ్య జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. గురువారం కెనడాతో తలపడనున్న భారత్, శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ ఒక పాయింట్‌తో ఐదో స్థానంలో ఉంది. తొమ్మిది పాయింట్లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాయి. -
ఒలింపిక్స్ సన్నాహకాలే లక్ష్యంగా...
♦ ఆజ్లాన్ షా కప్ బరిలోకి భారత్ ♦ తొలి మ్యాచ్‌లో కొరియాతో ఢీ ఇపో (మలేసియా) : ఆసియా క్రీడల్లో చాంపియన్‌గా నిలిచిన భారత హాకీ జట్టు రియో డి జనీరో ఒలింపిక్స్ (2015)కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద అడ్డంకిని అధిగమించిన సర్దార్ సింగ్ సేన... నేటి (ఆదివారం) నుంచి జరిగే ఆజ్లాన్ షా కప్ హాకీ టోర్నీని ఒలింపిక్స్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా జట్టులోని యువ ఆటగాళ్ల ప్రావీణ్యాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. ఆరు దేశాలు ఆడే ఈ టోర్నీలో... అందుబాటులో ఉన్న పటిష్ట జట్టునే బరిలోకి దింపుతామని టీమ్ మేనేజిమెంట్ చెబుతోంది. మరోవైపు నూతన కోచ్ పాల్ వాన్ ఆస్కు జట్టు తరఫున ఇదే తొలి అంతర్జాతీయ టోర్నీ కావడంతో ఆయనపై కూడా కాస్త ఒత్తిడి ఉంది. ఆటగాళ్లతో ఇప్పటికే కావాల్సినంత సమయం గడిపానని, వారి లోపాలను తెలుసుకున్నట్టు ఆయన చెప్పారు. ఆదివారం నాటి ప్రారంభ మ్యాచ్‌లోనే భారత్.. పటిష్ట కొరియా జట్టును ఢీకొనాల్సి ఉంది. యువ స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్స్ వీఆర్ రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ రాణింపుపై జట్టు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. టోర్నీలో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా, కెనడా జట్లు కూడా బరిలోకి దిగుతున్నాయి.