అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీ
ఇపో (మలేసియా) : చివరి నిమిషాల్లో తడబాటు బలహీనతను అధిగమించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల హాకీ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకుంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఆతిథ్య మలేసియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-3 గోల్స్ తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌తో ఆడిన 106 మ్యాచ్‌ల్లో కేవలం 14 సార్లు మాత్రమే నెగ్గిన మలేసియా ఈసారి సొంతగడ్డపై సత్తా చాటుకుంది.
మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా షారున్ అబ్దుల్లా గోల్‌తో మలేసియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు మలేసియా తరఫున ఫైజల్ సారీ (17వ ని.లో), హజీక్ సంసూల్ (35వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు రూపిందర్ పాల్ సింగ్ (20, 51వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 58వ నిమిషంలో రక్షణ పంక్తిలో గుర్బాజ్ సింగ్ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న మలేసియా ప్లేయర్ అబ్దుల్లా బంతిని గోల్ పోస్ట్‌లోని పంపించి ఆతిథ్య జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. గురువారం కెనడాతో తలపడనున్న భారత్, శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్ ఒక పాయింట్‌తో ఐదో స్థానంలో ఉంది. తొమ్మిది పాయింట్లతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నాయి.
భారత్‌కు మలేసియా షాక్
Published Thu, Apr 9 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement
Advertisement