'బాహుబలి 2: ది కంక్లూజన్' మూవీ రివ్యూ
టైటిల్ : బాహుబలి 2: ది కంక్లూజన్
జానర్ : ఫాంటసీ యాక్షన్ డ్రామా
తారాగణం : ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, తమన్నా..
సంగీతం : ఎమ్ ఎమ్ కీరవాణి
దర్శకత్వం : ఎస్ ఎస్ రాజమౌళి
నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని,
ఏడాదిన్నరగా యావత్ భారత సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమాధానం బయటికి వచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి తొలిభాగం సంచలన విజయం సాధించింది. ఎలాంటి ఎమోషనల్ సీన్స్ లేకుండా కేవలం పాత్ర పరిచయాల కోసమే కేటాయించిన బాహుబలి తొలి భాగం భారీ విజయం సాధించటంతో అసలు కథ నడిచే బాహుబలి 2పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. తొలి భాగం అందించిన జోష్ తో మరింత భారీగా రెండో భాగాన్ని రూపొందించారు. భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు తొలి భాగంలో మిస్ అయిన రాజమౌళి మార్క్ డ్రామా, ఎమోషన్స్ ను సీక్వల్ లో చూడొచ్చన్న హైప్ క్రియేట్ చేశారు. మరి నిజంగా బాహుబలి 2 ఆ అంచనాలను అందుకుందా..? తొలి భాగాన్ని మించే విజయం సాధిస్తుందా..?
కథ :
రాజుగా ప్రకటించిన తరువాత దేశంలోని పరిస్థితులను తెలుసుకొని రమ్మని బాహుబలి కి కట్టప్పను తోడుగా ఇచ్చి దేశాటనకు పంపిస్తుంది శివగామి దేవి. అలా దేశాటనకు బయలుదేరిన బాహుబలి కుంతల రాజ్య యువరాణి దేవసేన అందం, ధైర్యసాహసాలు నచ్చి తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. దేవసేన ప్రేమను గెలుచుకోవడానికి ఆమె రాజ్యంలోనే అతిథిలుగా ఉండిపోతారు. అయితే ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకు భల్లాలదేవుడు కూడా దేవసేనను సొంతం చేసుకోవాలనుకుంటాడు. బాహుబలి ప్రేమ విషయం రాజమాతకు చెప్పక ముందే తాను దేవసేనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, ఎలాగైన దేవసేనతో తన వివాహం జరిపించాలని శివగామి దగ్గర మాట తీసుకుంటాడు.
కొడుకు కోరికను మన్నించిన శివగామి, దేవసేనను తన కొడలిగా చేసుకోవాలని భావిస్తున్నాని వర్తమానం పంపుతుంది. అయితే శివగామి వర్తమానం పంపిన తీరు నచ్చని దేవసేన, శివగామి పంపిన బహుమతులను తిప్పిపంపుతుంది. కానీ కుంతల రాజ్యంలోనే ఉన్న బాహుబలి, కట్టప్పలు మాత్రం రాజమాత... దేవసేనకు బాహుబలితో వివాహం చేయించనుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే నీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదని మాట ఇచ్చి దేవసేనను మాహిష్మతికి తీసుకువస్తాడు. మాహిష్మతికి వచ్చిన తరువాత అసలు నిజం తెలుస్తుంది.
దేవసేన అభిప్రాయం తెలుసుకోకుండా రాజమాత తీసుకున్న నిర్ణయాన్ని బాహుబలి తప్పు పడతాడు. దీంతో బాహుబలి మీద కోపంతో రాజమాత శివగామి దేవి, భల్లాలదేవుడిని రాజుగా, బాహుబలిని సైన్యాధ్యక్షుడిగా ప్రకటిస్తుంది. రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత బాహుబలిని ఎలాగైన రాజమాతకు దూరం చేయాలనుకున్న భల్లాలదేవుడు, తండ్రి బిజ్జలదేవుడితో కలిసి కుట్రలు పన్ని బాహుబలి, దేవసేనలపై అంతఃపుర బహిష్కరణ శిక్ష వేయిస్తాడు. కోటకు దూరమైన బాహుబలి.. సామాన్యులతో కలిసి ఉంటూ అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు.
ఇది సహించలేని భల్లాలదేవుడు.. బాహుబలి బతికుండగా తనకు రాజుగా గుర్తింపు రాదని ఎలాగైన బాహుబలిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు. బాహుబలి మామా అని ఆప్యాయంగా పిలుచుకునే కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడు. అసలు బాహుబలిని చంపడానికి కట్టప్ప ఎందుకు అంగీకరించాడు...? భల్లాలదేవుడు చేసిన మోసాలు రాజమాత శివగామి దేవికి తెలిసాయా..? భల్లాలదేవుడు శివగామిని ఎందుకు చంపాలనుకున్నాడు..? మహేంద్ర బాహుబలి, భల్లాలదేవుడ్ని ఎలా అంతమొందించాడు.? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఈ సినిమా తెర మీదకు రావటంలో ప్రధాన పాత్ర హీరో ప్రభాస్‌దే. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక్క సినిమాకే సమయం కేటాయించే సాహసం చేసిన ప్రభాస్ తన నమ్మకం తప్పు కాదని ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఇలా ప్రతీ దాంట్లో అద్భుతమైన నటనతో అలరించాడు. లుక్స్ పరంగా తాను తప్ప బాహుబలికి మరో నటుడు సరిపోడేమో అన్నంతగా ఆకట్టుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాకోసం ప్రభాస్ పడిన కష్టం చూపించిన డెడికేషన్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది.
ఇక ప్రభాస్‌కు ధీటైన పాత్రలో రానా ఆకట్టుకున్నాడు. తన వయసుకు అనుభవానికి మించిన పాత్రను తలకెత్తుకున్న రానా.. మరోసారి విలక్షణ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. క్రూరత్వం, కండబలం కలిగిన బల్లాలదేవుడిగా రానా నటనకు థియేటర్లు మోత మొగిపోతున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర రాజమాత శివగామి దేవి హుందాతనంతో రాజకీయ చతురత కలిగిన రాజమాతగా రమ్యకృష్ణ ఆకట్టుకుంది. రాజరిక కట్టుబాట్లు, పెంచినపాశం మధ్య నలిగిపోయే తల్లిగా ఆమె నటన అద్భుతం. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్‌తో రమ్యకృష్ణ నటన సినిమా స్థాయిని పెంచింది. తొలి భాగాంతంలో కొన్ని సీన్స్‌కు మాత్రమే పరిమితమైన అనుష్క, రెండో భాగంలో కీలక పాత్రలో ఆకట్టుకుంది. బాహుబలి ప్రియురాలిగా అందంగా కనిపిస్తూనే, యుద్ధ సన్నివేశాల్లోనూ సత్తా చాటింది. తమన్నా పాత్ర క్లైమాక్స్‌కే పరిమతమైంది. రెండో భాగంలోనే కనిపించిన సుబ్బరాజు కుమార వర్మగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ పండించాడు. కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవుడిగా నాజర్, ఇతన నటీనటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక నిపుణులు :
ఒక ఆలోచనను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఐదేళ్లపాటు తపస్సు చేసిన రాజమౌళి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. బాహుబలి తొలి భాగంలో వినిపించిన విమర్శలన్నింటికీ సీక్వల్తో సమాధానమిచ్చాడు. బాహుబలి 1స్థాయికి మించి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలతో పాటు ఎమోషన్స్, డ్రామాతో సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాడు. నటీనటుల నుంచి అద్భుతమైన నటన తీసుకోవటంతో పాటు గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫి, సంగీతం ఇలా ప్రతీ అంశంలోనూ ది బెస్ట్ అనిపించుకునే స్థాయిలో సినిమాను రూపొందించాడు.
బాహుబలి విజయంలో కీలక పాత్ర పోషించిన మరో అంశం గ్రాఫిక్స్. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. మహిష్మతి రాజ్యం, పాటు యుద్ధ సన్నివేశాల్లో ఏది గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేశారో.. ఏది రియల్‌గా షూట్ చేశారో అర్ధం కానంత నేచురల్‌గా ఉన్నాయి గ్రాఫిక్స్. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కమల్ కణ్నన్ టీం కృషి సినిమా స్థాయిని పెంచింది.
కీరవాణి నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను క్యారీ చేయటంతో పాటు కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. అయితే పాటల విషయంలో మాత్రం తొలిభాగానికి వచ్చినంత రెస్పాస్స్ బాహుబలి 2 పాటలకు రాలేదు. సాహోరె బాహుబలి, దండాలయ్య పాటలు తప్ప మిగతావి పెద్దగా ఆకట్టుకోలేదు. విజువల్‌గా మాత్రం అన్ని పాటలు బాగున్నాయి. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అంతర్జాతీయ స్థాయిలో ఉంది. రాజమౌళి ఊహను తెర మీదకు తీసుకొచ్చేందుకు సెంథిల్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా, లావిష్‌గా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్, రమా రాజమౌళి, ప్రశాంతిల స్టైలింగ్, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ ఇలా ప్రతీ అంశం బాహుబలి అంతర్జాతీయ సినిమాగా రూపొందేందుకు సాయపడ్డాయి.
బాహుబలి 2.. తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా నిలబెట్టే విజువల్ వండర్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
చదవండి రంగస్థలం రివ్యూ