ఈ ప్లాస్టిక్‌ను ఇలా తాగొచ్చు
బాలి: ఇండోనేషియా ద్వీపకల్పానికి మణిహారం బాలి దీవి. సుందరమైన బీచ్‌లతో కళకళలాడుతూ ఉండే ఇక్కడి బీచ్‌లు ప్యాస్టిక్ బాటిళ్లు, బ్యాగులతో కంపుకొడుతున్నాయి. ప్రపంచంలోనే చైనా తర్వాత, ఇండోనేషియానే ఎక్కువ ప్లాస్టిక్‌ను తీసుకొచ్చి నేరుగా సముద్రంలో పారేస్తోంది. అది ఎక్కువగా బాలి బీచ్‌లకే కొట్టుకొస్తోంది. ప్లాస్టిక్ గాలిలో కలిసిపోదు, మట్టిలో కుళ్లిపోదు. వాటిని తిన్న జంతువులు, జలచరాలు మత్యువాతన పడుతున్నాయి. మరి ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం ఏమిటీ?
ప్రపంచంలో ముందుగా కోలుకున్న పలు దేశాలు ప్లాస్టిక్ ఉపయోగాన్ని ఇప్పటికే నిషేధించాయి. ‘బై బై ప్లాస్టిక్ బ్యాగ్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఇద్దరు అమ్మాయిల విస్తృత ప్రచారం కారణంగా ఇండోనేషియా ప్రభుత్వం 2018 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. నిషేధంకన్నా ప్రత్యామ్నాయమార్గం ముఖ్యమని భావించిన బాలికి చెందిన కెవిన్ కుమాల్ అనే యువకుడు ఆ దిశగా ప్రయోగాలు ప్రారంభించారు. స్వతహాగా బయోకెమిస్ట్రీ చదివిన కుమాల్ ఇండేనేసియాలో దొరికే కసావా లాంటి కూరగాయ దుంపలతో, కూరగాయల నూనె, సేంద్రీయ పదార్థాలను కలిపి బయో ప్లాస్టిక్‌ను తయారు చేశారు. దాన్ని ద్రావకంగా తాగడం ద్వారా అందులో ఎలాంటి విషపదార్థాలు లేవని నిరూపించారు. ఆ ద్రావకంతో బ్యాగులను తయారు చేసి అవి మట్టిలో కలసిపోగలవని ధ్రువీకరించారు.
ఓ మిత్రుడితో కలసి ‘అవాని ఎకో’ బయోప్లాస్టిక్ బ్యాగుల ఉత్పత్తిని ప్రారంభించారు. వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి ఆర్థిక వనరులు అవసరమయ్యాయి. అందుకు ‘బై బై ప్లాస్టిక్ బ్యాగ్స్’ సంస్థ ఎంతో సహకరించింది. విరాళాలను సేకరించి అందజేసింది. అంతేకాకుండా సంస్థ తరఫున పెద్ద ఎత్తున ఈ బ్యాగులను కొనుగోలు చేస్తోంది.
ఇండోనేసియా ప్రభుత్వం సహకరించేందుకు ముందుకు వచ్చింది. మామూలు ప్లాస్టిక్ బ్యాగులకన్నా రెట్టింపు ధర ఉండడంవల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో వీటిని కొనేందుకు ముందుకు రావడం లేదని, ఈ విషయంలో వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందజేయాలని కుమాల్ కోరుతున్నారు. బయోప్లాస్టిక్‌ను ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని కుమాల్ భావిస్తున్నారు.