ప్రపంచమే ‘మాయా’ బజారు?!
విశ్లేషణ: ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాలబుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురు చూస్తూనే కాటికి చేరుతారు.
కూటికి లేని పేదల దగ్గర కూడా ఉండే అమూల్య సంపద బిడ్డలు. ఆ బిడ్డలనూ దోచుకునే దొంగలు భారత్ నుంచి ఇథియోపియా వరకు వర్ధమాన ప్రపంచమంతా విస్తరించారు. 2012లో మన దేశంలో 65 వేల మంది పిల్లలు ‘కనబడుట లేద’ని ఏలినవారి కాకి లెక్కల కథనం. అందులో దాదాపు సగం మంది ఎప్పటికీ ‘కనబడనివారే’నట. 30 శాతానికి మించి కేసులు నమోదు కావని అంచనా. అంటే 2 లక్షలకు పైగా కనబడకుండా పోగా, అందులో లక్ష మంది పిల్లలు కనబడకుండానే మిగిలిపోతున్నారు. మరి గల్లంతయి పోతున్న పిల్లలు ఏమైపోతున్నారు? బడికి వెళ్లే కిలకిల నవ్వులు, మురికివాడల్లోని సొమ్మసిల్లిన గాజుకళ్లు, ప్రభుత్వం చొరబడలేని మహారణ్యాల ఆదివాసి కడుపు పంట లు ఎలా మాయమైపోతున్నాయి? ఏమైపోతున్నాయి? చెన్నై శివార్లలోని ఓ మురికివాడలో నివసించే నీళ్లింకిన కళ్ల నాగరాణిని కదిపితే... మన మురికివాడల నుంచి అమెరికా వరకు విస్తరించిన పిల్లల మాయా బజారు డొంక కదులుతుంది.
పద్నాలుగేళ్ల క్రితం కూలిపని చేసి వచ్చి, రాత్రి ఆదమరచి నిద్రిస్తున్న తల్లి పక్కలో నుంచి నెలల బిడ్డడు అలిగి వెళ్లి ... ‘అమ్మలగన్న అమ్మ’ లాంటి ఓ ఎన్జీవో ఒడి చేరి అనాథనని చెప్పుకున్నాడనిపించే కాకమ్మ కథను నమ్మలేక కుములుతున్న కన్న పేగు వ్యథ ఆమెది. నాలుగేళ్ల క్రితం ఓ విదేశీ పరిశోధనాత్మక పత్రికా రచయిత వెలుగులోకి తెచ్చిన నాగరాణి కొడుకు సతీష్ కథ పాతదే. దొంగిలించిన బిడ్డలను కొని, అంతర్జాతీయ పిల్లల దత్తత సంస్థలకు ఇచ్చే ఆ ‘అనాధాశ్రమం’ నిర్వాకం అప్పట్లోనే రచ్చకెక్కింది.
ఇప్పుడు మళ్లీ ఆ గోల ఎందుకు? అప్పోసప్పో చేసి నాగరాణి రెండు సార్లు కొడుకు దత్తత పోయిన నెదర్లాండ్స్‌కు వెళ్లివచ్చింది. దత్తత చట్ట ప్రకారమే జరిగిందని తేల్చిన నెదర్లాండ్ కోర్టులు డిఎన్ఏ పరీక్షలకు నిరాకరించగా కన్నకొడుకు కంటి చూపుకైనా నోచుకోక తిరిగి వచ్చింది. ఇలాంటి మరో అభాగ్యురాలు జబీన్ కూడా ఇలాగే ఆస్ట్రేలియాకు వెళ్లి నిరాశతో తిరిగి వచ్చింది. నాగమణులు, ఫాతీమాలు ‘అదృష్టవంతులు.’ మనుషుల అక్రమ తరలింపు కార్యకలాపాల వ్యతిరేక అంతర్జాతీయ సంస్థలు వారి కోసం పోరాడుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో నాగమణి కేసు యూరోపియన్ మానవ హక్కుల న్యాయ స్థానం ముందు దాఖలైంది.
దత్తత వలసవాదం
తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు దేశవ్యాప్తంగా 1.15 కోట్ల మంది ఉన్నారని అంచనా. అలాంటి వారిని విదేశీ యులకు దత్తత ఇవ్వడానికి వందల కొలదీ సంస్థలు న్నాయి. అవి దొంగిలించిన పిల్లలని తెలిసి కూడా వారిని విదేశీయులకు దత్తత ఇస్తాయి. వేలల్లో పిల్లలు వారి వద్ద దత్తతకు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర దత్తత వనరుల కేంద్రం (సిఏఆర్ఏ) నిర్దేశన ప్రకారం దత్తత తీసుకునే విదే శీ తల్లిదండ్రులు 3,500 డాలర్లకు మించి సదరు దత్తత సంస్థకు చెల్లించడానికి వీల్లేదు. కాగా నాగరాణి కొడుకు దత్తత కోసం నెదర్లాండ్స్ తల్లిదండ్రులు చెల్లించినది అంతకు పది రెట్లు... 35,000 డాలర్లు. ఆఫ్రికా, ఆసియా దేశాల పిల్లల దత్తతకు పాశ్చా త్య దేశాల శ్వేతజాతి తల్లిదండ్రులు ఎక్కువగా మక్కువ చూపుతారు. చాలా సందర్భాల్లో అక్రమంగానే దత్తత జరుగుతుందని వారికి తెలుసు. ఇథియోపియా, కంబోడియా లు అంతర్జాతీయ దత్తత వ్యాపారానికి ప్రధాన కేంద్రాలు. చాలా ఆఫ్రికా దేశాల్లో పశువుల సంతలో లాగా పిల్లల్ని ఎంచుకుని మరీ కొనుక్కోవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ... ‘జహారా’ దత్తత కోసం 25,000 డాల ర్లు చెల్లించగా ఇథియోపియాకు చెందిన కన్నతండ్రికి చేరిం ది 300 డాలర్లే. ఆమె కంబోడియా నుంచి దత్తత తీసుకున్న మరో బిడ్డ విషయంలోనూ అదే జరిగింది. మన దేశంలో సైతం పేదరికంతో, ఆడపిల్లల పట్ల సాంఘిక వివక్షతో పిల్లల్ని అమ్మే తల్లిదండ్రులకు గాలం వేసే ‘అనాధాశ్రమాలు’ చాలానే ఉన్నాయి.
విదేశీ దత్తతదార్లు మెచ్చే గుణాలు ఉండాలేగానీ బిడ్డ దొంగలించినదైనా, కొన్నదైనా ‘బంగారమే’. బడుగుదేశాల పేద పిల్లలపై పాశ్చాత్యులకు ఎందుకింత వల్లమాలిన ప్రేమ? సంపన్న దేశాల్లో దత్తత తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు స్పష్టమైన నిబంధనావళి ఉంటుంది. ‘దత్తత తీసుకున్నవారు బిడ్డకు కన్న తల్లిదండ్రుల గురించి తెలియజేయాలి, కలుసుకునే అవకాశం కల్పించాలి’ అనేది వాటిలో ఒకటి. వెనుకబడిన దేశాల నుంచి దత్తతలో ఇలాంటి బాదరబందీలు ఏమీ ఉండవు. దత్తత తతంగం లేకుండా పూర్తి అక్రమంగా రవాణా అయ్యే పిల్లలు గల్ఫ్ దేశాలకు చేరి బానిస చాకిరీ చేస్తున్నారు, సెక్స్ బానిసలుగా బతుకుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, చట్టాలు ఏమి చేస్తున్నాయని అడగకండి. తిండికి బట్టకులేని పేద తల్లిదండ్రులు పిల్లలపై ఒలకబోస్తున్న ప్రేమంతా దత్తతదార్ల నుంచి డబ్బు గుంజ డానికేననే సమాధానం సదా సిద్ధంగా ఉంటుంది. అధిక ఆదాయ, సంపన్న వర్గాల పిల్లలకు ఉండే భద్రతా ఎక్కు వే. కానీ వారు సురక్షితమనడానికి వీల్లేదు. సొంత దేశం, జాతి, వర్ణం, భాష, సంస్కృతులకు దూరంగా దత్తత పేరిట పిల్లల్ని విసిరేయడం అమానుషమని వాదించే వారిని ఎవరు పట్టించుకుంటారు.
‘లేత మాంసం’ మార్కెట్లు
దత్తత వ్యాపారం ‘మర్యాదస్తులు’ చేసేది. అలా ఎగుమతి అయ్యే ‘భాగ్యం’ కొందరికే. మిగతావారు ఏమౌతారు? ఆడపిల్లలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతారు. అన్ని నగరాలను ముంచెత్తి, చిన్న పట్టణాలకు విస్తరిస్తున్న ఆధునిక సెక్స్ పరిశ్రమకు ముడి సరుకులవుతారు. దేశంలో అధికారికంగా వ్యభిచార వృత్తిలో ఉన్నవారు 30 లక్షల మంది. వారిలో 40 శాతం 18 ఏళ్లలోపు బాలికలే. హెచ్ఐవీ, తది తర వ్యాధులు, ‘వృత్తిపరమైన ప్రమాదాల’ కారణంగా సెక్స్ వర్కర్ల వృత్తి కాలం బాగా పడిపోతోంది. దీంతో సెక్స్ పరిశ్రమ మైనర్ ఆడపిల్లల కోసం ఆవురావురుమంటోంది. క్షామ పీడిత ప్రాంతాల నుంచి, అంతర్గత తిరుగుబాట్లు సాగుతున్న ప్రాంతాల నుంచి ఆడపిల్లల సరఫరా జోరుగా సాగుతోంది. కోల్‌కతా ఈ వ్యాపారానికి జాతీయ రాజధాని, ఎగుమతుల కేంద్రం. ఆ నగర శివార్ల నుంచి బడికి వెళ్లివస్తున్న పన్నెండేళ్ల దీపను మూడేళ్ల క్రితం మత్తు మందిచ్చి ఎత్తుకుపోయారు.
రోజుకు 12 నుంచి 14 మం ది మగాళ్ల మృగవాంఛను తీరుస్తూ క్షణం క్షణం తాను మరణించిన వైనాన్ని ఆ బాలిక ఇటీవల కళ్లకు కట్టింది. ఒక్కొక్క ఆడపిల్ల అమ్మకంపైనా వెయ్యి డాలర్ల లాభమని కోల్‌కతాకు చెందిన ఒక ఆడపిల్లల వ్యాపారి జనవరిలో బీబీసీ వార్తాసంస్థకు తెలిపాడు. తాను కోల్‌కతా, ఢిల్లీ, హర్యానాలకు ఆడపిల్లలను సరఫరా చేస్తాననీ, ఆ విష యం పోలీసులకు కూడా తెలుసని వెల్లడించాడు. బెంగాల్‌కే చెందిన మరో మైనరు ఆడపిల్ల రుక్సానా కథ కాస్త వేరు. ఆమెను హర్యానాలోని ఒక కుటుంబానికి అమ్మేసారు. ఆమెను గదిలో పెట్టి తాళం వేసి, ఇంట్లోని ముగ్గురు మగాళ్లూ నిత్యమూ రేప్ చేసేవారు. ఆడపిల్లలను హతమార్చిన ‘పాపానికి’ మగాళ్లు సెక్స్ దాహంతో అల్లాడిపోతున్న ప్రాంతాలు దేశంలో పెరుగుతున్నాయి. ‘లేత ఆడ మాంసా నికి’ అవి సరికొత్త మార్కెట్లు.
‘మర్యాదస్తుల’ బానిసలు
అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణా కార్యకలాపాలు 127 నుంచి 137 దేశాలకు విస్తరించాయని, ఇది ఏటా 1,000 కోట్ల డాలర్ల విలువైన వ్యాపారమని అంతర్జాతీయ మాననహక్కుల సంఘం అంచనా. అయితే మనుషుల అక్రమ తరలింపు 90 శాతం వరకు స్వదేశంలోనే జరుగుతుంది. అంటే ఏటా పిల్లల ప్రపంచ మార్కెట్ లావాదేవీల విలువ 10,000 కోట్ల డాలర్లకు పైనే. సెక్స్ పరిశ్రమకు చేరని పిల్లలు ఏమవుతున్నారు? రాజధాని ఢిల్లీసహా అన్ని పెద్ద నగరాల్లోనూ ఇప్పుడు సరికొత్త బానిసలు తయారయ్యారు. పిల్లల దొంగల మాఫియా వారిని ఇంటిపని బానిసలుగా అమ్మేస్తుంది. ఆడపిల్లలైతే ఇంటిపని చేయడంతో పాటూ, మగ దాహర్తిని తీర్చే సాధనాలుగా కూడా పనికొస్తారు. అస్సాం నుంచి పన్నెండేళ్ల ప్రాయంలో రాజ ధానికి చేరిన ఎలైనా కుజార్... యజమాని తన ముందే బూతు చిత్రాలను చూస్తూ తనను రేప్ చేసేవాడని చెప్పిం ది. ఆమె ఒక ఎన్జీవో పుణ్యమాని విముక్తిని సాధించింది.
పారిపోయిన ‘బానిసలను’ కట్టి, కొట్టి యజమానికి అప్పగించే బాధ్యత కూడా మాఫియా గ్యాంగులదే. అలాంటి ఆడామగా పిల్లలు ఎన్నివేల మంది నగరాల్లో విద్యావంతులు, గౌరవనీయులైన పెద్దమనుషుల ఇళ్లల్లో బానిసలుగా పడి ఉన్నారో లెక్కల్లేవు. గత మూడేళ్లల్లో కనిపించకుండా పోయే పిల్లల సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతోంది. పాలకులకు అది పట్టించుకునే తీరుబడి లేదు. ‘తల్లుల రొమ్ముల నుంచి తస్కరణకు గురైన పసి కందులం మేం, ఏం చేయాలి? ఎవరిని అడగాలి?’ అని ప్రశ్నించే పాల బుగ్గల కన్నీళ్లతో ‘కాక్ టెయిల్ పార్టీ’ చేసుకుంటున్న ఉన్మత్త గ్లోబల్ కుగ్రామంలో నాగమణులు, ఫాతీమాలు బిడ్డల కోసం ఎదురుచూస్తూనే కాటికి చేరుతారు.
- పిళ్లా వెంకటేశ్వరరావు