ప్రత్యేక హోదాకు 'ఆ రెండిటీ' ఆమోదం లేదు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు జాతీయ అభివృద్ధి మండలి, ప్రణాళిక సంఘం ఆమోదం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వీటి ఆమోదం కావాలంటే మిగిలిన 9 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని వెల్లడించారు.
మంగళవారం న్యూఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ఈ సమస్య ఒక్కరోజులో పరిష్కారం అయ్యేది కాదు... దీన్ని రాజకీయం చేయవద్దంటూ ఆయన రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను పిలిచామన్నారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడుతో జరిపిన భేటీలో విభజన అంశాలపై చర్చించామన్నారు. అలాగే వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.