'ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం'
హైదరాబాద్: కరువు మండలాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆదివారం హైదరాబాద్లో ఆరోపించారు. రాష్ట్రంలో 500 మండలాల్లో కరువు ఉందని జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదికను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కరువు పరిస్థితులపై ప్రభుత్వ శాఖలు కాకుండా జన్మభూమి కమిటీ సర్వే చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
గ్రామాలకు వాటర్ సప్లై చేసే లెక్కల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకు కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని రఘువీరా స్పష్టం చేశారు. కరువు మండలాల ప్రకటన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని రఘువీరా అన్నారు.