Baby Powder
-
బేబీ పౌడర్‌తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. కంపెనీ అనుబంధ సంస్థ తయారుచేస్తున్న బేబీ పౌడర్‌లోని టాల్కమ్ స్త్రీల అండాశయ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. వాటిని పరిష్కరించడానికి 25 ఏళ్ల వ్యవధికిగాను కంపెనీ సుమారు 6.48 బిలియన్ డాలర్లు(రూ.54వేలకోట్లు) చెల్లించడానికి సిద్ధమైంది.స్త్రీల పరిశుభ్రత కోసం కంపెనీ తయారుచేస్తున్న టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం ద్వారా ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై దాడిచేసే మీసోథెలియోమా, అండాశయ క్యాన్సర్ వస్తుందని ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కోర్టులో దాఖలైన వ్యాజ్యాల్లో ఏమాత్రం నిజం లేదని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గూగుల్‌లో మళ్లీ లే ఆఫ్స్.. ఎందుకో తెలుసా..బుధవారం అనుబంధ సంస్థ పునర్నిర్మాణానికి 75% మంది వాటాదార్లు సానుకూలంగా ఓటు వేస్తే ప్రీప్యాకేజ్డ్ చాప్టర్ 11 దివాలాకు దాఖలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. మెసోథెలియోమాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాలను రిఆర్గనైజేషన్ ప్లాన్ వెలుపల పరిష్కరిస్తామని పేర్కొంది. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ
సాక్షి,ముంబై: జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహారాష్ట్రలో మరో ఎదరుదెబ్బ తగిలింది. అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్( ఎఫ్‌డిఎ) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ తయారీ లైసెన్స్నురద్దు చేసింది. ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసిసినట్టు ఎఫ్‌డీఏ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. జాన్సన్స్ బేబీ పౌడర్ నవజాత శిశువుల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. (Gold Price: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్) ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక విలువలకు అనుగుణంగా లేవని రెగ్యులేటరీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940, నిబంధనల ప్రకారం జాన్సన్ కంపెనీకి ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది, అంతేకాకుండా మార్కెట్ నుండి జాన్సన్ బేబీ పౌడర్ స్టాక్‌ను రీకాల్ చేయాలని కూడా కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. (లాభాలు కావాలంటే...సారథ్య బాధ్యతల్లో మహిళలు పెరగాలి) ప్రభుత్వ విశ్లేషకుల నివేదికను అంగీకరించని జాన్సన్ అండ్ జాన్సన్ కోర్టులో సవాలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కంపెనీ వివరణాత్మక ప్రకటన రావాల్సి ఉంది. -
జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం
సాక్షి,న్యూడిల్లీ : ఎట్టకేలకు వివాదాస్పద బేబీ పౌడర్ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వేలాది కేసులు, కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండించిన సంస్థ ఉత్తర అమెరికాలో టాల్క్-ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని మంగళవారం ప్రకటించింది. వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్ అండ్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే నెలల్లో ఈ రెండు దేశాల మార్కెట్లలో అమ్మకాలను నిలిపివేస్తున్నామని నార్త్ అమెరికా కన్స్యూమర్ యూనిట్ ఛైర్మన్ కాథ్లీన్ విడ్మెర్ చెప్పారు. సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రీటైల్ మార్కెట్లటలో అమ్మకాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు. అయితే 1980 నుండి మార్కెట్లో ఉన్న తమ కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలు అమెరికా కెనడాలో కొనసాగుతాయన్నారు. మొదట 1890 లలో బేబీ-పౌడర్ ఉత్పత్తులను అమ్మడం ప్రారంభించిందని కంపెనీ బ్లాగ్ తెలిపింది. (కోవిడ్-19: రోల్స్ రాయిస్‌లో వేలాదిమందికి ఉద్వాసన) కాగా 2014 నుంచి జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్, ఇతర ఉత్పత్తుల్లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు న్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో వేలాది (16,000 కంటే ఎక్కువ) కేసులను సంస్థ ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. దీంతోపాటు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలో ఒక బాటిల్ బేబీ పౌడర్‌లో కలుషిత, ప్రమాదకర అవశేషాలను కనుగొన్న తర్వాత గత ఏడాది అక్టోబర్‌లో 33వేల బాటిళ్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకుంటున్నట్టు జె అండ్ జె తెలిపింది. మరోవైపు న్యూజెర్సీలోని ఫెడరల్ కోర్టులో 16,000కు పైగా సూట్లను పర్యవేక్షిస్తున్న అలబామా న్యాయవాది లీ ఓ'డెల్ మాట్లాడుతూ అమ్మకాలను నిలిపివేసే ప్రకటన విచారణ నుంచి తప్పించుకునేందుకే అని వ్యాఖ్యానించారు. అండాశయ క్యాన్సర్‌కు కారణమైన సంస్థ ఉత్పత్తులను నిలిపివేయాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లున్నాయన్న సమాచారంతో దేశీయ ఔషధ నియంత్రణ అధికారులు స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జాన్సన్ ఫ్యాక్టరీలో జాన్సన్ బేబీ పౌడర్ శాంపిళ్లను డ్రగ్ అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డీ ప్లాంట్‌నుంచి ఈ నమూనాలు సేకరించినట్టు పేరు వెల్లడించడానికి అంగీకరించని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీ) అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. అలాగే వార్తా కథనాల ఆధారంగా శాంపిళ్లను సీజ్ చేయాల్సిందేగా ఆదేశించానని తెలంగాణాకు చెందిన రీజనల్ డ్రగ్ ఆఫీసర్ సురేంద్రనాథ్ సాయి ధృవీకరించారు. పరీక్షల అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ప్రభావానికి లక్షలాదిమంది పసిపిల్లలు గురి కానున్నారనే అంశం బాధిస్తోందన్నారు. అయితే తాజా పరిణామంపై జాన్సన్ అండ్ జాన్సన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వ్యవహరాన్ని పరిశీలించేందుకు సుమారు 100మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించినట్టు వార్తలొచ్చాయి. జాన్సన్ ఇండియాతో సంబంధమున్న వేర్వేరు ఉత్పాదక యూనిట్లు, హోల్‌సేలర్స్, పంపిణీదారులను పరిశీలించడానికి నియమించారు. దీనిపై సంప్రదించినప్పుడు ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. అయితే ఈ రిపోర్టులో నివేదించిన అంశాలు చాలా ఆందోళన కరమని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్టు తెలిపింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్కారకాలు ఉన్నాయన్న సంగతిని మూడు దశాబ్దాలుగా కంపెనీ దాచి పెట్టిందంటూ ఇటీవల రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ ఆరోపణలను జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
జాన్సన్ అండ్ జాన్సన్‌కు రాయిటర్స్ షాక్ : వేల కోట్లు హాంఫట్
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు అంతర్జాతీయ మీడియా సంస్థ భారీ షాక్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు తమ బేబీపౌడర్లో క్యాన్సర్ కారకాలున్నాయన్న సంగతి ముందే తెలుసునని రాయటర్స్ తాజాగా వాదిస్తోంది. అయితే ఈ విషయంలో దశాబ్దాల తరబడి వినియోగదారులను మోసం చేస్తూ వస్తోందని విమర్శించింది. ఆస్బెస్టాస్ మూలంగా మేసోథెలియోమా లాంటి అనేక అరుదైన, బాధాకరమైన కాన్సర్లకుదారి తీస్తుందని పేర్కొంది. దీంతో వివాదాలు, పలు కేసులు, కోర్టు తీర్పులతో ఇబ్బందుల్లో పడిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఈ రిపోర్టును ఎప్పటిలాగానే జాన్సన్ అండ్ జాన్సన్ తిరస్కరించింది. తమ బేబీ టాల్కమ్ పౌడర్‌లో ఆస్బెస్టాస్ అనే క్యాన్సర్ కారకం ఉన్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి దశాబ్దాలుగా తెలుసని రాయిటర్స్ కథనం పేర్కొంది. బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నట్లు 1971లోనే జాన్సస్ సంస్థ గుర్తించిందని తెలిపింది. ఈ విషయమై ఇటీవల కంపెనీపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయిటర్స్ మీడియా సంస్థ పలు పత్రాలను అధ్యయనం చేసి మరీ నిర్ధారించింది. అయితే ఇది తక్కువ మోతాదు, హానికరం కాదంటూ రెగ్యులేటరీ సంస్థలను ఒప్పించటానికి ప్రయత్నం చేసిందని, కానీ ఈ సంవత్సరం న్యూజెర్సీ న్యాయమూర్తి జాన్సన్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ రాయటర్స్ నివేదించింది. అయితే ఈ వార్తలను జాన్సన్ అండ్ జాన్సన్ కొట్టిపారేసింది. ఇవన్నీ కల్పిత వార్తలని, నిజాన్నితప్పుదోవ పట్టించేందుకు చేసే ప్రయత్నాలను కంపెనీ ఆరోపించింది. తమ టాల్కం పౌడర్‌లో ఎలాంటి క్యాన్సర్ కారకాలు లేవని ఇప్పటికే చాలా పరీక్షలు రుజువుచేశాయని కంపెనీ గ్లోబల్ మీడియా రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎర్నీ నీవిట్జ్ తెలిపారు. అయితే బేబీ పౌడర్ కాకుండా పారిశ్రామిక అవసరాలకోసం ఉద్దేశించిన తమ టాల్క్ బ్యాచ్‌లలో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉండి వుండవచ్చని వాదించారు. కాగా జాన్సన్ అండ్ జాన్స్ బేబీ పౌడర్‌తో పాటు షవర్ ఉత్పత్తుల్లోనూ క్యాన్సర్ కారకాలు ఉన్నాయని, తద్వారా తమకు క్యాన్సర్ సోకిందన్న ఆరోపణలపై వేలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే బాధితులను వాదనలను సమర్థించిన పలుకోర్టులు పరిహారం చెల్లించాల్సిందిగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే. 2006లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక విభాగం జాన్సన్‌కు చెందిన జననేంద్రియ ప్రాంతాల్లో ఉపయోగించే (వెజైనల్) టాల్క్ అండాశయ క్యాన్సర్‌కు కారణం కావచ్చని ఒక ప్రకటన జారీ చేసింది, అయితే అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఈ ఆరోపణకు ఎలాంటి ఆధారం లేదని కొట్టి పారేసింది. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో అమెరికా మార్కెట్లో శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ షేర్లు కుప్పకూలాయి. షేరు విలువ 10శాతం మేర పడిపోయింది. 45బిలియన్ డాలర్ల సంపద (సుమారు 32వేల కోట్ల రూపాయలు) తుడిచిపెట్టుకుపోయింది. 16ఏళ్లలో కంపెనీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
స్త్రీలకు ఆ బేబీ పౌడర్ ప్రమాదకరమా?
హెచ్చరిక అవుననే అంగీకరించి తీర్పు ఇచ్చింది అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కోర్టు. ప్రపంచమంతటా విరివిగా దొరికే ‘జాన్సన్ అండ్ జాన్సన్’ బేబీ పౌడరును స్త్రీలు తమ జననాంగాల శుభ్రత కోసం వాడటం వల్ల వారికి ‘ఒవేరియన్ కేన్సర్’ (అండాశయ కేన్సర్) వచ్చే ప్రమాదం ఉందని ఆ కోర్టు నమ్మడం వల్ల కాలిఫోర్నియాకు చెందిన ‘ఈవా ఎచివెరియా’ అనే మహిళకు దాదాపు 2700 కోట్ల రూపాయలు (417 మిలియన్ డాలర్లు) నష్టపరిహారంగా చెల్లించమని తీర్పు చెప్పింది. ఫేస్ పౌడర్ల వల్ల తమ ఆరోగ్యాలు పాడయ్యాయని అమెరికాలో దాఖలైన కేసులలో అత్యధిక జరిమానా విధించిన కేసుగా దీనిని చెప్పుకోవచ్చు. ఈవా ఎచివెరియా అభియోగం ఏమిటి? కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివెరియా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌ను జననాంగ శుభ్రత కోసం 1950 నుంచి 2016 వరకు ఉపయోగించింది. అయితే 2016లో ఆమె అండాశయ క్యాన్సర్ బారిన పడింది. దీనికి కారణం జాన్సన్ అండ్ జాన్సన్ పౌడరే అని భావించిన ఈవా వెంటనే లాస్ ఏంజిల్స్ కోర్టులో నష్టపరిహారానికి దావా వేసింది. ‘జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన టాల్కమ్ పౌడర్ బాటిల్ మీద తగిన జాగ్రత్తలు ఇవ్వలేదు, కేన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించలేదు, అందువల్లనే నేను కేన్సర్ బారిన పడ్డానని’ ఈవా అభియోగం చేసింది. ‘నా లాగా మరొకరికి నష్టం జరగకూడదు. మహిళలకు నా పరిస్థితి గురించి చెప్పి, వారిని హెచ్చరించాలన్న ఉద్దేశంతో కేసు ఫైల్ చేశాను’ అని ఆమె చెప్పింది. ఆమె వాదనతో అంగీకారం తెలిపిన కోర్టు జాన్సన్ సంస్థకు భారీ జరిమానా విధించింది. ‘ఈ తీర్పుతో నా క్లయింట్ ఊరడిల్లే అవకాశం ఉంది. చావుతో పోరాడుతున్న నా క్లయింట్ ఈ వచ్చిన జరిమానా సొమ్ముతో తనలా ఒవేరియన్ కేన్సర్‌తో బాధ పడుతున్నవారికి సహాయం చేయదలిచారు’ అని ఈవా లాయర్ మార్క్ రాబిన్సన్ చెప్పారు.మరోవైపు ఈ తీర్పుపై జాన్సన్ అండ్ జాన్సన్ స్పందించింది. ‘మాకు కేన్సర్ బారిన పడ్డ ఈవా పట్ల సానుభూతి ఉంది. అయితే అంత మాత్రాన మా పౌడర్ వల్ల ఆమెకు కేన్సర్ వచ్చిందనడంతో ఏకీభవించలేం. దీనికి శాస్త్రీయ నిరూపణలు లేవు. మేము ఈ తీర్పును సవాలు చేస్తాం’ అని సంస్థ బాధ్యులు ప్రకటన చేశారు. దాదాపు 4000 కేసులు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మీద అమెరికాలో ప్రస్తుతం సుమారు నాలుగు వేల కేసులు విచారణలో మూలుగుతున్నాయి. ఇవన్నీ తీర్పు పెండింగ్‌లో ఉన్న కేసులే. జాన్సన్ ఉత్పత్పుల వాడకం వల్ల తమ ఆరోగ్యం పాడైందని దాఖలైన కేసులను కొన్ని రాష్ట్రాల్లోని కోర్టులు కొట్టేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల కోర్టులు జరిమానాలు విధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మిస్సౌరీ కోర్టు నాలుగైదు కేసులలో 300 మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది. ఇప్పుడు తాజాగా లాస్ ఏంజిల్స్ తీర్పుతో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ప్రాణం పోసుకున్నట్టయ్యాయి. వీటన్నింటి నుంచి జాన్సన్ సంస్థ ఎలా బయటపడుతుందో చూడాలి. -
చిట్కా తెలియడమే ఆలస్యం..
ఇంటిప్స్ * ఇంట్లో ఉండే మెడ గొలుసులన్నింటినీ ఒకే చోట దాచుకున్నప్పుడు అవి ఒకదానికొకటి మెలిక పడుతూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక్కో గొలుసును ఒక్కో స్ట్రాలోకి దూర్చి హుక్ పెట్టేయాలి. అలా ఎన్ని చెయిన్స్నైనా ఒక బాక్స్‌లో పెట్టుకొని ప్రయాణాలు చేయొచ్చు. అలాగే గొలుసులకు పడిన చిక్కును విడదీయడానికి బేబీ పౌడర్ వాడాలి. ఆ చిక్కుముడికి పౌడర్ రాస్తే సులువుగా విడిపోతుంది. * బంగారం ఆభరణాలను మినహా మిగతా అలంకరణ వస్తువులను జాగ్రత్తగా దాచుకోరు చాలామంది. ముఖ్యంగా చిన్ని చిన్ని చెవి దుద్దులు. ఫంక్షన్‌కు రెడీ అవుతున్నప్పుడు చూసుకుంటే ప్రతి జతలో ఒక్కో దుద్దు కనిపించకుండా పోవడం అందరికీ తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే వాటిని పెద్దసైజు బటన్లకు అమర్చితే చాలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ రకం కావాలంటే అవి సులువుగా కనిపిస్తాయి, ఎప్పటికీ భద్రంగా ఉంటాయి కూడా. * తలుపులకు, కిటికీలకు పెయింట్ వేయడానికి పెద్ద సైజు బ్రష్‌లను ఉపయోగిస్తుంటాం. ఒక్కోసారి అనుకోకుండా మోతాదుకంటే ఎక్కువగా పెయింట్ వచ్చేస్తుంది ఆ బ్రష్‌కు. దాన్ని తీసేయడానికి ఆ డబ్బా అంచులకు రాస్తుంటాం. అలా కాకుండా ఆ డబ్బా చుట్టూ ఓ రబ్బర్ బ్యాండును పెట్టి, దాని సాయంతో ఎక్కువగా ఉన్న పెయింట్‌ను తొలగించొచ్చు. అలా చేస్తే డబ్బాకు ఎలాంటి రంగు మరకలు ఉండవు. * షర్టు బటన్లు తరచూ ఊడిపోతూ ఉంటాయి. లేదా దారాలు ఒదులుగా ఉండి వేలాడుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే బటన్లు కుట్టిన వెంటనే వాటి మధ్యలో కొద్దిగా నెయిల్ పాలిష్ రుద్దాలి. అది ఆరే వరకు కదిలించకూడదు. అలా చేస్తే ఆ దారాలు తొందరగా లూజ్ కాకుండా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో కలర్‌లెస్ నెయిల్ పాలిషులు అందుబాటులో ఉంటున్నాయి. అది ఉపయోగిస్తే ఏ కలర్ బటన్స్కైనా పాలిష్ వేసినట్టు కనిపించదు. * ఫ్లవర్ వాజుల్లో పెట్టిన పూలు త్వరగా వాడిపోకుండా ఉండాలంటే కాస్త వాటిపై శ్రద్ధ పెడితే చాలు. రోజూ రోజూ ఖరీదైన పూలను మార్చి కొత్తవి పెట్టాలంటే కొంచెం ఇబ్బందే. కాబట్టి వాజులోని నీళ్లలో ఒక రాగి నాణెంతో పాటు కొద్దిగా చక్కెర వేయాలి. రోజూ ఆ నీటిని మార్చి చక్కెర వేస్తుండాలి. అలా చేస్తే ఆ పూలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఆ పూల సువాసనకు మార్కెట్లో దొరికే ఏ సెంటూ సాటి రాదు.