అరుదైన చికిత్సతో చిన్నారికి పునర్జన్మ
రాంగోపాల్‌పేట (హైదరాబాద్): గర్భంలోని పిల్లలు అత్యంత అరుదుగా మలవిసర్జన చేస్తారు. అప్పుడు అది ఉమ్మనీరులో కలసి తిరిగి వాళ్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా ఇలాంటి సమస్యకు గురైన ఓ శిశువుకు ఎక్మో చికిత్సతో పునర్జన్మనిచ్చారు కిమ్స్ వైద్యులు. ఆ వివరాలను ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్ డాక్టర్ వి.నందకిశోర్ బుధవారం వెల్లడించారు. ఉప్పల్‌కు చెందిన స్రవంతికి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పాప పుట్టినప్పుడు బాగానే ఉన్నా కొద్దిసేపటికే ఊపిరి పీల్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడసాగింది. దాంతో చిన్నారిని వెంటనే ఐసీయూకు తరలించి వెంటిలేటర్ ద్వారా గాలి అందించారు. గర్భంలో ఉండగా మల విసర్జన చేయడంతో అది ఊపిరితిత్తుల్లోకి చేరి పాపకు రక్తపోటు (పల్మనరీ హైపర్‌టెన్షన్) బాగా ఎక్కువైనట్లు గుర్తించారు. దాంతో ప్రత్యేకమైన ఔషధం, గ్యాస్ (ఇన్హేల్డ్ నైట్రిక్ ఆక్సైడ్) కూడా అందించి రక్తపోటు తగ్గించారు. ఇంత చికిత్స చేసినా పాప పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఎక్మో ఆధారంగా చికిత్స చేశారు. ఈ క్రమంలో పాపకు ఐదు రోజుల పాటు ఎక్మో సాయం అవసరమైంది. ఆ తర్వాత మరో ఐదు రోజులు ఐసీయూలో ఉంచి పర్యవేక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. చిన్నారి ఇప్పుడు పాలు కూడా తాగగలుగుతోందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ నందకిశోర్ తెలిపారు. కాగా, చిన్నారికి ఎదురైన అరుదైన పరిస్థితుల్లాంటివి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు చేసే పనిని ఎక్మో చేస్తుందని ఆయన చెప్పారు. అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడుతుందని వివరించారు. తద్వారా ఊపిరితిత్తులు కోలుకోవడానికి సమయం, విశ్రాంతి దొరుకుతాయన్నారు. ఎక్మో సర్క్యూట్లో ఉండే కృత్రిమ ఊపిరితిత్తులకు (ఆక్సిజనేటర్) రక్త ప్రసరణ మళ్లిస్తారని చెప్పారు. గుండె లేదా ఊపిరితిత్తుల పనితీరు దారుణంగా దెబ్బతిని, సంప్రదాయ చికిత్స పద్ధతులతో నయం కాని పరిస్థితుల్లో ఎక్మోను ప్రయోగిస్తారని పేర్కొన్నారు. అన్ని వయస్సుల వారికీ ఈ చికిత్స చేయవచ్చని చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎక్మో చికిత్స చేయడం కిమ్స్ ఆస్పత్రిలో ఇది రెండోసారని వెల్లడించారు.