యూనివర్సిటీలోకి చొరబడ్డ ఉగ్రవాదులు, కాల్పులు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. వాయవ్య పాకిస్థాన్ లోని ఛార్ సదా ప్రాంతంలో యూనివర్సిటీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఖైబర్ పక్తున్ ఖ్వా ప్రావిన్స్ లోని బచా ఖాన్ యూనివర్సిటీలోకి 12 మంది సాయుధ ఉగ్రవాదులు చొరబడ్డారు. తరగతులు, హాస్టళ్లలోని విద్యార్థులు, అధ్యాపకులపై విచక్షణారహితంగా కాల్పులు, బాంబు పేలుళ్లకు తెగబడ్డారని వార్తా చానళ్లు వెల్లడించాయి. 25 మంది మృతి చెందారు. 60 మందిపైగా గాయపడినట్టు సమాచారం. వర్సిటీలో మొత్తంలో 600 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబాన్ ప్రకటించుకుంది.
విద్యార్థులు తల్లిదండ్రులు, వర్సిటీ సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా వర్సిటీ వెలుపల గుమిగూడారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు రంగంలోకి దిగాయి. వీరికి సాయంగా హెలికాప్టర్లను రప్పించారు. పొగమంచు దట్టంగా అలముకోవడంతో వర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారనేది తెలియడం లేదు. కాగా, నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు వెల్లడించారు. సైనిక ఆపరేషన్ కొనసాగుతోంది.
పెషావర్ సైనిక స్కూల్ పై తాలిబాన్ ఉగ్రవాదులు 134 విద్యార్థులను కాల్చివేసిన సంఘటన మర్చిపోకముందే విద్యాలయంపై మరో దాడి జరగడం పట్ల భయాందోళన వ్యక్తమవుతోంది.