'అవి మీ దేశ ఫోన్లే.. సహాయం చేయండి'
ఇస్లామాబాద్: తమ దేశంలోని విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అఫ్ఘానిస్తాన్ సహాయాన్ని పాకిస్థాన్ అర్జించింది. ఈ మేరకు ఆ దేశ ముఖ్య సైనికాధికారి రహీల్ షరీఫ్ అఫ్ఘాన్ నేతలకు ఫోన్లు చేశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి, అక్కడ అమెరికా సైనిక వ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారికి ఫోన్ చేసి తమకు సహాయం చేయాల్సిందిగా కోరారు.
అఫ్ఘానిస్తాన్లో ఎక్కువ ప్రభావం ఉన్న తాలిబన్లు బుధవారం బచా ఖాన్ విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ ప్రొఫెసర్ తో సహా 21మంది ప్రాణాలుకోల్పోయారు. ఇటీవలె ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రపంచానికి చెప్తున్న పాక్ తాజా ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఎలా జరిగింది అని ఆరా తీయగా తాలిబన్ల ఆపరేషన్ అఫ్ఘానిస్తాన్ నుంచే పర్యవేక్షించారని, అఫ్ఘాన్ సెల్ ఫోన్లే తాలిబన్లు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించారని గుర్తించారు. ఈ నేపథ్యంలో వారి సహాయాన్ని పాకిస్థాన్ కోరింది.