army chief Raheel Sharif
-
వారం, పది రోజుల్లో పాక్ ఆర్మీకి కొత్త చీఫ్!
ఇస్లామాబాద్: కేవలం వారం లేదా పది రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీకి కొత్త చీఫ్ ను నియమించనున్నట్లు ఆ దేశ సీనియర్ మంత్రి తారీఖ్ ఫజల్ చౌదరీ తెలిపారు. ప్రస్తుతం పాక్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ రహీల్ షరీఫ్ పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీకి కొత్త చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందా అన్న దానిపై అక్కడ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పాక్ ప్రభుత్వం ఇప్పటివరకైతే ఆ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదని కానీ అతి త్వరలోనే పేరు వెల్లడిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ మీడియాకు చెప్పారు. తనకంటే ముందు ఆ బాధ్యతలు చేపట్టిన జనరల్ అష్ఫఖ్ పర్వేజ్ కయానీ తరహాలో రెండో పర్యాయం కొనసాగే ఉద్దేశం తనకు లేదని ప్రస్తుత ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కొన్ని నెలల కిందటే వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీకి 15వ చీఫ్ గా ఉన్నారు. 2013 నవంబర్ 29న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మూడేళ్ల కాలానికి ఆర్మీచీఫ్‌గా రహీల్ షరీఫ్‌ను నియమించిన విషయం తెలిసిందే. భారత్ తో సంబంధాలు మెరుగ్గా లేకపోవడం, దేశంలోనూ ఎన్నో అంతర్గత సమస్యలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఆర్మీ చీఫ్ పదవీకాలం ముగిసిపోతే కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించే అధికారం కేవలం పాక్ ప్రధానికి మాత్రమే ఉంటుంది. దీంతో నమ్మకస్తుడయిన ఓ సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ కు పాక్ ఆర్మీ నూతన చీఫ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పాక్ మీడియా తెలిపింది. -
ప్రధానమంత్రి వర్సెస్ ఆర్మీ చీఫ్!
పాకిస్థాన్‌లో కొత్త రగడ ఓవైపు భారత సైన్యం సర్జికల్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది పాకిస్థాన్‌ను మరో రగడ కుదిపేస్తోంది. తదుపరి ఆర్మీ చీఫ్ ఎవరనేది ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, సైన్యాధిపతి రహీల్ షరీఫ్ మధ్య వివాదం తీవ్రతరమవుతోంది. దేశంలో శక్తిమంతమైన సైన్యం నూతన అధిపతి తమకు అనుకూలుడై ఉండాలని ఇటు నవాజ్, అటు రహీల్ ఎవరికి వారు అనుకుంటుండటంతో ఈ రగడ ముదురుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ పదవీకాలం నవంబర్ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సైన్యాధిపతి ఎవరనే దానిపై తాడో-పేడో తేల్చుకోవడానికి ఇటు నవాజ్, అటు రహీల్ ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నిఘా వర్గాల అత్యున్నత సమాచారం ప్రకారం కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ జవేద్ ఇక్బాల్ రాండేను నియమించాలని ప్రధాని షరీఫ్ భావిస్తున్నారు. రాండే కుటుంబానికి మొదటినుంచి షరీఫ్ పార్టీ పీఎంఎన్ఎల్తో అనుబంధం ఉంది. అంతేకాకుండా ప్రధాని షరీఫ్‌కు జనరల్ రాండే విశ్వసనీయుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కార్ప్స్ కమాండర్‌గా రాండే కొనసాగుతున్నారు. పాక్ సైన్యంతో నవాజ్ షరీఫ్ సంబంధాలు ఎప్పుడూ ఘర్షణపూరితంగానే ఉన్నాయి. సీనియర్ ఆర్మీ జనరళ్లను పక్కనబెట్టి ఆయన ఏరికోరి మరీ పర్వేజ్ ముషార్రఫ్‌ను సైన్యాధిపతిగా నియమించగా.. ముషార్రఫ్ 1999లో ఆయనను గద్దె దించి.. సైనిక పాలనకు తెరలేపాడు. దేశ సైన్యం, రక్షణ వ్యవస్థపై పట్టు సాధించేందుకు కొత్త ఆర్మీ చీఫ్ నియమాకం షరీఫ్‌కు కీలకం కానుందని భారత్ భావిస్తోంది. దేశీయ రాజకీయాల్లోనే కాదు.. భారత్, ఐరాస వంటి విదేశీ దౌత్యవ్యూహాల్లోనూ రహీల్ షరీఫ్ నాయకత్వంలోని ప్రస్తుత పాక్ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భారత నిఘా వర్గాల ప్రకారం రహీల్ కొత్త సైన్యాధిపతిగా జనరల్ జుబైర్ మహమూద్ హయత్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రావాల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ జనరల్ స్టాఫ్ చీఫ్‌గా ఉన్న హయత్.. భారత్ పట్ల మరింత కఠినమైన వైఖరి అవలంబించే అవకాశముందని ఇండియా నిఘా వర్గాల అంచనా. హయత్‌తోపాటు లెఫ్టినెంట్ జనరళ్లు నదీమ్ అహ్మద్, కమర్ బజ్వా కూడా ఆర్మీ చీఫ్ పదవిరేసులో ఉన్నారు. దేశ అంతర్గత రాజకీయాలతో సహా విదేశీ దౌత్య వ్యూహాల వరకు అన్నింటా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న పాక్ ఆర్మీ చీఫ్ పదవిని ఎవరు చేపట్టబోతున్నారన్నది భారత్ నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. -
'అవి మీ దేశ ఫోన్లే.. సహాయం చేయండి'
ఇస్లామాబాద్: తమ దేశంలోని విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు అఫ్ఘానిస్తాన్ సహాయాన్ని పాకిస్థాన్ అర్జించింది. ఈ మేరకు ఆ దేశ ముఖ్య సైనికాధికారి రహీల్ షరీఫ్ అఫ్ఘాన్ నేతలకు ఫోన్లు చేశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి, అక్కడ అమెరికా సైనిక వ్యవహారాలు చూస్తున్న ఉన్నతాధికారికి ఫోన్ చేసి తమకు సహాయం చేయాల్సిందిగా కోరారు. అఫ్ఘానిస్తాన్‌లో ఎక్కువ ప్రభావం ఉన్న తాలిబన్లు బుధవారం బచా ఖాన్ విశ్వవిద్యాలయంపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ ప్రొఫెసర్ తో సహా 21మంది ప్రాణాలుకోల్పోయారు. ఇటీవలె ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రపంచానికి చెప్తున్న పాక్ తాజా ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన ఎలా జరిగింది అని ఆరా తీయగా తాలిబన్ల ఆపరేషన్ అఫ్ఘానిస్తాన్ నుంచే పర్యవేక్షించారని, అఫ్ఘాన్ సెల్ ఫోన్లే తాలిబన్లు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించారని గుర్తించారు. ఈ నేపథ్యంలో వారి సహాయాన్ని పాకిస్థాన్ కోరింది.