ప్రధానమంత్రి వర్సెస్‌ ఆర్మీ చీఫ్‌! | tussle over the next Army chief in pakistan | Sakshi
Sakshi News home page

ప్రధానమంత్రి వర్సెస్‌ ఆర్మీ చీఫ్‌!

Published Tue, Oct 4 2016 6:58 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

(ఎడమ) జవేద్‌ ఇక్బాల్‌ రాండే.. మహమూద్‌ హయత్‌(కుడి)

(ఎడమ) జవేద్‌ ఇక్బాల్‌ రాండే.. మహమూద్‌ హయత్‌(కుడి)

  • పాకిస్థాన్‌లో కొత్త రగడ

  • ఓవైపు భారత సైన్యం సర్జికల్‌ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది పాకిస్థాన్‌ను మరో రగడ కుదిపేస్తోంది. తదుపరి ఆర్మీ చీఫ్‌ ఎవరనేది ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌, సైన్యాధిపతి రహీల్‌ షరీఫ్‌ మధ్య వివాదం తీవ్రతరమవుతోంది. దేశంలో శక్తిమంతమైన సైన్యం నూతన అధిపతి తమకు అనుకూలుడై ఉండాలని ఇటు నవాజ్‌, అటు రహీల్‌ ఎవరికి వారు అనుకుంటుండటంతో ఈ రగడ ముదురుతోంది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ రహీల్‌ షరీఫ్‌ పదవీకాలం నవంబర్‌ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త సైన్యాధిపతి ఎవరనే దానిపై తాడో-పేడో తేల్చుకోవడానికి ఇటు నవాజ్‌, అటు రహీల్‌ ప్రయత్నిస్తున్నట్టు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

    నిఘా వర్గాల అత్యున్నత సమాచారం ప్రకారం కొత్త సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ జవేద్‌ ఇక్బాల్‌ రాండేను నియమించాలని ప్రధాని షరీఫ్‌ భావిస్తున్నారు. రాండే కుటుంబానికి మొదటినుంచి షరీఫ్‌ పార్టీ పీఎంఎన్‌ఎల్‌తో అనుబంధం ఉంది. అంతేకాకుండా ప్రధాని షరీఫ్‌కు జనరల్‌ రాండే విశ్వసనీయుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కార్ప్స్‌ కమాండర్‌గా రాండే కొనసాగుతున్నారు. పాక్‌ సైన్యంతో నవాజ్‌ షరీఫ్‌ సంబంధాలు ఎప్పుడూ ఘర్షణపూరితంగానే ఉన్నాయి. సీనియర్‌ ఆర్మీ జనరళ్లను పక్కనబెట్టి ఆయన ఏరికోరి మరీ పర్వేజ్ ముషార్రఫ్‌ను సైన్యాధిపతిగా నియమించగా.. ముషార్రఫ్‌ 1999లో ఆయనను గద్దె దించి.. సైనిక పాలనకు తెరలేపాడు. దేశ సైన్యం, రక్షణ వ్యవస్థపై పట్టు సాధించేందుకు కొత్త ఆర్మీ చీఫ్‌ నియమాకం షరీఫ్‌కు కీలకం కానుందని భారత్‌ భావిస్తోంది.


    దేశీయ రాజకీయాల్లోనే కాదు.. భారత్‌, ఐరాస వంటి విదేశీ దౌత్యవ్యూహాల్లోనూ రహీల్‌ షరీఫ్‌ నాయకత్వంలోని ప్రస్తుత పాక్‌ ఆర్మీ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. భారత నిఘా వర్గాల ప్రకారం రహీల్‌ కొత్త సైన్యాధిపతిగా జనరల్‌ జుబైర్‌ మహమూద్‌ హయత్‌కు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం రావాల్పిండిలోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ జనరల్‌ స్టాఫ్‌ చీఫ్‌గా ఉన్న హయత్‌.. భారత్‌ పట్ల మరింత కఠినమైన వైఖరి అవలంబించే అవకాశముందని ఇండియా నిఘా వర్గాల అంచనా. హయత్‌తోపాటు లెఫ్టినెంట్‌ జనరళ్లు నదీమ్‌ అహ్మద్‌, కమర్‌ బజ్వా కూడా ఆర్మీ చీఫ్‌ పదవిరేసులో ఉన్నారు. దేశ అంతర్గత రాజకీయాలతో సహా విదేశీ దౌత్య వ్యూహాల వరకు అన్నింటా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న పాక్‌ ఆర్మీ చీఫ్‌ పదవిని ఎవరు చేపట్టబోతున్నారన్నది భారత్‌ నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement