పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త నజిబుల్లా అలిఖిల్ (ఫైల్ ఫోటో)
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. సామాన్యులనే కాకుండా ఏకంగా దౌత్యవేత్తలపై కూడా దారుణాలకు పాల్పడుతున్నారు అక్కడి నేరస్తులు. తాజాగా పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురి చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ మేరకు అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ లేఖ విడుదల చేసింది. ఆ వివరాలు..
పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్త నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్‌సిలా అలిఖిల్‌ను కొద్ది రోజుల క్రితం ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేశారు. సూపర్‌మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా దుండగులు ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం సిల్‌సిలాను చిత్రహింసలకు గురి చేశారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతన్న స్థితిలో ఉండగా వదిలేశారు. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. విడుదల చేసిన లేఖలో తెలిపింది.
ఈ చర్యలను అఫ్గాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లో ఉన్న తమ దేశ దౌత్యవ్తేతలు, వారి కుటుంబాల భద్రతపై అఫ్గాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక సిల్‌సిలాను కిడ్నాప్ చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలానే తమ దేశ దౌత్యవేత్తలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది.
పాక్-అఫ్గాన్‌ల మధ్య ఏం జరుగుంది..
గత కొద్ది వారాలుగా అఫ్గాన్‌లోని పలు జిల్లాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడోంతుల దేశాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్.. పాక్‌పై ఆరోపణలు చేస్తోంది. ఆ దేశ మద్దతుతోనే తాలిబన్లు తమ దేశంలో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
‘‘స్పిన్ బోల్డాక్ ప్రాంతం నుంచి తాలిబాన్లను తొలగించే చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని’’ పాక్ వాయుసేన తమ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్‌ని హెచ్చరించినట్లు అఫ్గనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సాలెహ్ తెలిపారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తను కుమార్తె కిడ్నాప్‌కు గురి కావడం సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment