బిట్‌శాట్‌లో గెలుపు ఇలా..
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా బిట్‌శాట్! దేశంలో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ విధానంలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి ఎంత పోటీ ఉంటుందో.. అంతేస్థాయి పోటీ నెలకొన్న పరీక్ష బిట్‌శాట్. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పోటీ ఏటేటాపెరుగుతోంది. బిట్‌శాట్‌ను రాసేవారిలో మన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య అధికమే. వచ్చే నెల 14 నుంచి జూన్ 1 వరకు ఆన్లైన్ విధానంలో జరగనున్న బిట్‌శాట్‌లో విజయానికి సలహాలు..
బిట్స్-పిలానీలో సీటు.. ఉజ్వల భవితకు రూటు:
బిట్స్-పిలానీలో సీటు లభిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమైనట్లేననే అభిప్రాయం ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఔత్సాహిక విద్యార్థుల్లో నెలకొంది. దాంతో బిట్‌శాట్‌కు పోటీపడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది బిట్స్-పిలానీ మూడు క్యాంపస్‌లలో(పిలానీ, గోవా, హైదరాబాద్) అందుబాటులో ఉన్న రెండు వేల సీట్ల కోసం 1.36 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో మన రాష్ట్ర విద్యార్థులు 30 నుంచి 35 శాతం మధ్యలో ఉంటారని అంచనా.
మన రాష్ట్ర విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పటికీ.. చివరి నిమిషంలో పొరపాట్లు చేస్తూ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంపై ముందు నుంచీ సరైన పట్టు లేకపోవడం కాగా, రెండోది.. ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెస్ట్ టెస్ట్‌లకు భిన్నంగా బిట్‌శాట్‌లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌ల నుంచి కూడా ప్రశ్నలు అడగడం. చాలామంది విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో పట్టు సాధించడంపైనేదృష్టిపెట్టి.. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌లను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇదే తుది జాబితాలో చోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు ఆన్లైన్ ఆధారిత పరీక్ష విధానంపై అవగాహన పొందుతూనే.. సబ్జెక్ట్‌లలోనూ రాణించాలని నిపుణులు సూచిస్తున్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే 300కుపైగా స్కోర్ వస్తేనే బిట్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం ప్రస్తుతమున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
సిలబస్- ప్రిపరేషన్ ఇలా:
బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష. మొత్తం నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలలో.. 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బిట్‌శాట్‌లో ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ నుంచి 45 ప్రశ్నలు; ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ నుంచి 15 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది.
బిట్‌శాట్‌కు నిర్దిష్ట సిలబస్ నిర్దేశించారు. దాన్ని అనుసరించి ప్రిపరేషన్ సాగించాలి. ఈ సిలబస్ ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతుల స్థాయిలో ఉంటుంది. కాబట్టి మన ఇంటర్ బోర్డ్ విద్యార్థులు తమ అకడెమిక్ సిలబస్‌లో లేని.. ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. జేఈఈ-మెయిన్ పరీక్ష కూడా ముగిసింది. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు బిట్శాట్తోపాటు సమాంతరంగా ఎదుర్కోనున్న పరీక్షలు ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్డ్. వీటిని దృష్టిలో ఉంచుకుని మూడు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ముందుకుసాగాలి. జేఈఈ-అడ్వాన్స్డ్, బిట్‌శాట్ సిలబస్ దాదాపు ఒకే మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. కానీ బిట్శాట్తోపాటు ఎంసెట్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలి. మన ఇంటర్ బోర్డు సిలబస్‌ను అనుసరించి నిర్వహించే ఎంసెట్‌లో ఉన్న అంశాలు, ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా జరిగే బిట్శాట్లోని ఉమ్మడి అంశాలను ఒకే సమయంలో పూర్తి చేసుకోవాలి. బిట్‌శాట్‌లో మాత్రమే ఉన్న టాపిక్స్‌కు ప్రతిరోజూ ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి.
ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను సైతం దాదాపు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాదిరిగానే మార్పులు చేశారు. కాబట్టి ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్లపై పట్టు సాధించిన వారికి బిట్‌శాట్ సిలబస్ ఏమంత కష్టం కాదు.
బిట్‌శాట్‌కు మరో నెలరోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇప్పుడు కొత్త అంశాలు, లేదా చదవని చాప్టర్స్‌పై ఎక్కువ సమయం కేటాయించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమైనవని భావిస్తే.. ఏప్రిల్ నెలాఖరు నాటికి వాటిని పూర్తి చేయాలి.
ఏప్రిల్ చివరి వారం నుంచి ఆన్లైన్ పరీక్ష మొదలయ్యే వరకు రివిజన్‌కు కేటాయించడం శ్రేయస్కరం. తమ ఆన్లైన్ టెస్ట్ తేదీకి కనీసం 15 రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి.
ఆయా సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ సులభం అవుతుంది. కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి.
ఫిజిక్స్‌లో.. వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి.
మ్యాథమెటిక్స్‌లో.. హైపర్బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3-డి, ఇంటెగ్రల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ పూర్తి చేయాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం రెండు గంటల చొప్పున ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా అందుబాటులోని సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను పూర్తి చేసుకోవచ్చు.
బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష వివరాలు:
నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలతో 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే బిట్‌శాట్‌లో విభాగాలవారీగా అడిగే ప్రశ్నల సంఖ్య
బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్ ముఖ్య తేదీలు:
హాల్‌టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 15, 2014 నుంచి ఏప్రిల్ 30, 2014 వరకు
ఆన్లైన్ టెస్ట్ తేదీలు: మే 14, 2014 నుంచి జూన్ 1, 2014 వరకు
బిట్‌శాట్ ఫలితాల వెల్లడి: మే చివరి వారం
బిట్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు : మే 20, 2014 నుంచి జూన్ 30, 2014 వరకు వివరాలకు వెబ్సైట్: www.bitsadmission.com
ఆన్లైన్ టెస్ట్ - అనుసరించాల్సిన వ్యూహాలు
ఆన్లైన్ టెస్ట్ మూడు గంటలపాటు ఎలాంటి విరామం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇప్పటినుంచే ఆ విధానానికి అలవాటుపడేలా మాక్‌టెస్ట్‌లకు హాజరు కావాలి. కనీసం అయిదు మాక్‌టెస్ట్‌లకు హాజరై, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ద్వారా ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు.
ఇప్పటికే విద్యార్థులకు తమ ఆన్లైన్ టెస్ట్ సెంటర్ సమాచారం తెలిసుంటుంది. కాబట్టి ఆ సెంటర్లో ఉండే వాతావరణాన్ని పరిశీలించి.. అలాంటి పరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు సన్నద్ధత పొందేలా వ్యవహరించాలి. విద్యార్థుల మానసిక, శారీరక అంశాల కోణంలో ఈ వ్యూహం విజయానికి ఎంతో దోహదం చేస్తుంది.
ఆన్లైన్ టెస్ట్ సమయంలోనూ ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలి. మూడు గంటలపాటు నిర్వహించే పరీక్షలో ప్రథమార్థంలో ఒక్కో ప్రశ్నకు కేటాయించే సమయాన్ని ఒక నిమిషానికి పరిమితం చేయాలి.
బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్‌లో సెక్షన్లవారీగా ఎలాంటి సమయ నిబంధన లేదు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా బాగా అవగాహన ఉన్న ప్రశ్నలు లేదా సెక్షన్లను సాధించాలి.
మిగతా విభాగాలతో పోల్చితే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లలో అంచెలవారీ (స్టెప్‌వైజ్) సొల్యూషన్స్తోనే సమాధానాలు రాబట్టే ప్రశ్నలు ఎక్కువ. కాబట్టి ఈ రెండు విభాగాలను ముందుగా ఎంపిక చేసుకోవడం మంచిది.
సెక్షన్లవారీగా ఎలాంటి నిబంధన లేకున్నప్పటికీ విద్యార్థులు స్వీయ సమయ నిబంధన విధించుకోవాలి. దీన్ని ప్రిపరేషన్ దశ నుంచే అమలు చేసుకోవాలి.
మొత్తం 180 నిమిషాల్లో 30 నిమిషాలు కెమిస్ట్రీకి; 20 నిమిషాలు ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్‌కు; 40 నిమిషాలు ఫిజిక్స్‌కు; 70 నిమిషాలు మ్యాథమెటిక్స్‌కు కేటాయించడం మంచిది. మిగతా 20 నిమిషాలు తాము రాసిన సమాధానాలు సరిచూసుకోవడానికి కేటాయించాలి.
బిట్‌శాట్‌లో నిర్దేశిత 180 నిమిషాల్లోపు 150 ప్రశ్నలను పూర్తిచేస్తే బోనస్ కొశ్చన్స్ పేరుతో అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రశ్నలు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి నాలుగు చొప్పున ఉంటాయి. కానీ ఈ బోనస్ కొశ్చన్స్‌ను ఎంపిక చేసుకునే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒకసారి బోనస్ కొశ్చన్స్‌ను ఎంపిక చేసుకుంటే.. అప్పటికే రాసిన 150 ప్రశ్నల సమాధానాలను సరిచూసుకునే వీలుండదు. అంతేకాకుండా ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు బోనస్ కొశ్చన్స్ కంటే ముఖ్యంగా తాము రాసిన ప్రశ్నల సమాధానాలు- కచ్చితత్వం విషయంలో శ్రద్ధ చూపడం శ్రేయస్కరం.
కచ్చితంగా 100 నుంచి 120 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 300 నుంచి 360 మార్కులు సొంతం చేసుకోగలుగుతారు. బిట్స్ క్యాంపస్‌లలో కటాఫ్‌ల స్థాయికి చేరుకుంటారు. కౌన్సెలింగ్ లెటర్‌ను అందుకునే అవకాశం లభిస్తుంది.
కంగారు లేకుండా.. కచ్చితత్వమే ప్రధానంగా..
బిట్‌శాట్‌లో విజయంలో కీలక పాత్ర సమయ పాలన. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి కంగారు లేకుండా సమాధానాల్లో కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఉన్నాయని వందశాతం రూఢీ చేసుకున్న తర్వాతే బోనస్ ప్రశ్నలను ఎంచుకోవాలి. బిట్‌శాట్ మెరిట్ జాబితాలో నిలిచి బిట్స్ క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే పరిశోధనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా పలు సంస్థల స్పాన్సర్‌షిప్‌తో నిర్వహిస్తున్న పరిశోధనల్లోనూ అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పరిశోధనలు, పీహెచ్డీలవైపు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే ఆకర్షితులయ్యేలా చేస్తున్నాం. తద్వారా భవిష్యత్తులో సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం వేస్తున్నాం. బిట్‌శాట్‌లో మెరిట్‌తోపాటు ఆయా డిగ్రీ ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆసక్తి, అభిరుచి మేరకు కోర్సును ఎంచుకుంటే నిత్యనూతనంగా ఉండగలుగుతారు.
- ప్రొఫెసర్ వి.ఎస్.రావు,
డెరైక్టర్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్