చనిపోయిందనుకున్న పాప.. లేచి ఏడ్చింది!!
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలో ఓ చిత్రం చోటుచేసుకుంది. చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించిన ఓ పాపను శ్మశానానికి తీసుకెళ్తుండగా ఆమె ఒక్కసారిగా లేచి ఏడ్చింది!! హౌరా జిల్లాలోని గోలాబారి పట్టణంలోగల బన్సల్ నర్సింగ్ హోంలో రింకు భగత్ అనే మహిళకు ఆ పాప పుట్టింది. అయితే ఆమె పుట్టకముందే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
దీంతో బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా మధ్యలో లేచి ఏడ్చింది. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. వెంటనే బంధువులతో పాటు ఇతరులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకుని, వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.