నిరుద్యోగులపై నాగాస్త్రం
బ్యాగ్నిండా క్యాష్తో వస్తే బ్యాక్లాగ్ పోస్టు పక్కా అన్నాడు.సర్కారు కొలువులో సాఫీగా జీవితం సాగిపోతోందని భరోసా ఇచ్చాడు. తనకు అగ్రనేత అండదండలున్నాయని ఆందోళన చెందవద్దని రుజువులు చూపించాడు. అమరావతి నాగార్జునుడి నీడలో గౌరవంగా గవర్నమెంట్ జాబ్ చేద్దామన్న ఆశతో ఉన్న నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు దండుకున్నాడు. ‘ఉపాధి’ కేంద్రంగా ఉద్యోగాల ఇప్పిస్తానని సుమారు రూ. 2 కోట్లు దండుకున్న అధికారి బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం.
సాక్షి, అమరావతిబ్యూరో : ఓ ఉద్యోగ సంఘాల నేత....కేరాఫ్ విజయవాడలోని జిల్లా ఉపాధికల్పన కార్యాలయం...రాష్ట్ర ఉద్యోగ సంఘాల పెద్దల అండ...అదే అదనుగా ఆయన చెలరేగిపోతున్నారు. గతంలో మిగులు ఉద్యోగాలపేరిట కుంభకోణం...అయినా చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు...తాజాగా బ్యాక్లాగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా... రూ.2కోట్ల వరకూ వసూలు...ఇదీ జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం వేదికగా సాగుతున్న అడ్డగోలు వ్యవహారం.
‘బ్యాక్లాగ్’ బాగోతం...
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో వివాదాస్పద ఉద్యోగి మరోసారి చెలరేగిపోయారు. జిల్లా ఉద్యోగ సంఘ నేతగా కూడా ఉన్న ఆయన కొన్నేళ్లుగా ఆ కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన మిగులు ఉద్యోగాల్లో సర్దుబాటు చేస్తామని చెప్పి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. ఏకంగా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి మరీ జిల్లాలో మిగులు ఉద్యోగాలు కింద పోస్టింగులు ఇచ్చేయడం సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసినప్పటికీ ఆయనపై రాష్ట్ర కార్మిక శాఖ ఇంతవరకు ఎలాంటి చర్యా తీసుకోనే లేదు.
అదే దీమాతో ఆయన ఈసారి బ్యాక్లాగ్ పోస్టుల పేరిట నిరుద్యోగులకు బురిడీ కొట్టిం చారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన జిల్లాలో ఖాళీగా ఉన్న క్లాస్ ఫోర్ పోస్టులను ఇప్పిస్తామని నిరుద్యోగులకు టోకరా ఇచ్చారు. అందుకోసం అభ్యర్థులు ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆ కార్యాలయంలో ఉన్న ఓ చిరుద్యోగిని ముందుంచి కథ నడిపించారు. దాదాపు 100మంది నుంచి రూ.2 కోట్లు వరకూ వసూళ్లకు పాల్పడినట్లు సమచారం.
బోరుమన్న నిరుద్యోగులు...
ఆ ఉద్యోగ సంఘ నేత అదిగో ఉద్యోగాలు.. ఇదిగో ఉద్యోగాలు అంటూ కొన్ని నెలులుగా కాలయాపన చేశారు. కొందరు నిరుద్యోగులు ఉపాధి కల్పనా కార్యాలయానికి వస్తూ తమ ఉద్యోగాల గురించి అడగడంతో వ్యవహారం బయటకు వచ్చింది. అసలు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియే ప్రస్తుతం పరిశీలనలో లేదని ఉన్నతాధికారులు చెప్పడంతో వారు కంగుతిన్నారు. తాము మోసపోయామని భావించిన ఆ నిరుద్యోగులు తాము డబ్బులు ఇచ్చిన చిరుద్యోగిని నిలదీశారు. దాంతో ఆ కార్యాలయంలో పెద్ద ఘర్షణ జరిగింది.
ఆ డబ్బుల వ్యవహారం అంతా ఆ ఉద్యోగ సంఘ నేత చూసుకున్నారని ఆ చిరుద్యోగి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో బాధితులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆరా తీయగా అసలు ఆ ఉద్యోగ సంఘ నేత తరపునే తాను డబ్బులు తీసుకున్నానని... ఆ మొత్తాన్ని ఆయనకే ఇచ్చేశానని ఆ చిరుద్యోగి చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు మోసపోయిన నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు అయినా ఇవ్వాలి... తాము చెల్లించిన మొత్తం అయినా తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
చర్యలు తీసుకునే సత్తా ఏదీ...!
ఇంత జరిగినప్పటికీ ఆ వివాదాస్పద ఉద్యోగిపై చర్యలకు ఉన్నతాధికారులు సాహసించడమే లేదు. రాష్ట్ర ఉద్యోగ సంఘం నేతల అండతోపాటు జిల్లాలో కీలక ప్రభుత్వ నేత ఆశీస్సులూ ఉండడంతో చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. ఆ ఉద్యోగ సంఘ నేతపై జిల్లా, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులే ఎలాంటి చర్యలూ తీసుకోలేరు... కాబట్టి తామెందుకు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలన్న రీతిలో ఉదాసీనంగా ఉంటున్నారు. కాగా చిరుద్యోగి ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి అసలు వ్యక్తిని వదిలేశారు. చిరుద్యోగిని బలి చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏసీపీని ఆశ్రయించిన బాధితులు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమం) : ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి లక్షలాది రూపాయలు వసూలు చేసిన దంపతులతో పాటు వారి కుమార్తె, అల్లుడిపై కొత్తపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వించిపేటకు చెందిన వడ్డాది రాజారావు రైల్వే హాస్పటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. రాజారావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు రవీంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు. చిన్న కుమారు డు చంద్రశేఖర్ వివాహానికి ఉపాధి కల్పన శాఖలో పనిచేసే చిరుద్యోగి సింగపల్లి కుమారి ఆమె భర్త ఏడుకొండలు హాజరయ్యా రు.
ఆ సమయంలో రవీంద్రకు శిశు సంక్షేమ శాఖలో రూ. 2.50 లక్షలు ఇస్తే అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. గత ఏడాది జనవరిలో వారు రాజా రావు కుమార్తె ఇంటికి కూడా వెళ్లి చిన్న కుమారుడికీ ఉద్యో గం ఇప్పిస్తామని నమ్మించారు. పెద్ద మనుషుల సమక్షంలో రూ. 2.50 లక్షలు అందజేశారు. ఉద్యోగం గురించి నిలదీస్తే దూషిస్తున్నారని బాధితులు వెస్ట్ ఏసీపీ జి.రామకృష్ణకు ఫిర్యా దు చేశారు. వెస్ట్ ఏసీపీ కార్యాలయం నుంచి కేసు కొత్తపేటకు చేరడంతో కేసు నమోదు చేశారు.