ఎంత? ఎలా?
ఆస్తిపన్ను... పెనాల్టీ రద్దుపై అధికారుల చర్చ
సీఎం ప్రకటనతో కసరత్తు
లబ్ధిదారులకు వర్తించే ప్రయోజనంపై లెక్కలు
నివేదిక తయారీలో నిమగ్నం
సిటీబ్యూరో: గ్రేటర్‌లోని ఆస్తి పన్ను బకాయిదారులకు పెనాల్టీలతో పాటు పేద ప్రజలకు ఆస్తిపన్ను సైతం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ... ఎంతమందికి? ఏమేరకు ప్రయోజనం కలుగనుందనే అంశంపై జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పేదలుగా ఏ స్థాయి వారినిపరిగణనలోకి తీసుకోవాలనే అంశంలో స్పష్టత లేదు. దీంతో ఆస్తిపన్ను రూ.100 నుంచి రూ.5000 లోపు వారి వరకు వివిధ స్థాయిల్లో మినహాయిస్తే.. ఎంతమంది లబ్ధి పొందుతారు? జీహెచ్ఎంసీకి ఏమేరకు ఆదాయం తగ్గుతుందనే విషయమై నివేదిక సిద్ధం చేస్తున్నారు. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రూ. 5 వేల లోపు ఆస్తిపన్ను ఉన్న వారందరికీ రద్దు చేస్తే దాదాపు పది లక్షల గృహ యజమానులకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. తద్వారా జీహెచ్ఎంసీకి ఆస్తిపన్ను రూపేణా రావాల్సిన మొత్తంలో దాదాపు రూ.200 కోట్లు లోటు వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అలా రూ.4 వేల లోపు వారికైతే ఎంత? రూ.2వేల లోపు వారికైతే ఎంతమందికి మేలు కలుగనుందనే అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఆస్తిపన్ను మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని నగరంలో అన్ని ప్రాంతాల వారికి వర్తింపజేస్తారా? మురికివాడల్లోని భవనాలకే పరిమితం చేస్తారా అనే అంశంలోనూ స్పష్టత లేదు. ఇది సీఎం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
గతంలోనూ...
ఇదిలా ఉండగా రూ.4 వేల లోపు ఆస్తి పన్ను రద్దు చేయాలని గత పాలక మండలి హయాంలో (నవంబర్‌లో) స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని అమలుకు ప్రభుత్వ ఆమోదంతో పాటు జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేయాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఎవరికి ప్రయోజనం?
బస్తీలతో పాటు రూ.4 వేల లోపు ఉన్న వారందరికీ పన్ను మినహాయింపునిస్తే... సింగిల్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వారికీ ప్రయోజనం కలుగుతుంది. సంపన్న కాలనీల్లో ప్లింత్ ఏరియా 700 ఎస్ఎఫ్టీ నుంచి సాధారణ కాలనీల్లోని 950 ఎస్ఎఫ్టీ వారికి, స్లమ్స్‌లోని 1100 ఎస్ఎఫ్టీ వరకు ఆస్తిపన్ను రద్దవుతుందని అంచనా. వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహ దారిలో ఒకవిధంగా... కాలనీలో మరో విధంగా ఆస్తి పన్ను ఉంది. బస్తీలో ఎస్ఎఫ్టీకి సగటున 90 పైసలు ... సంపన్న కాలనీల్లో రూ.1.25గా ఉంది.
మినహాయింపు ఇలా...
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 202 -ఎ (1) ప్రకారం యాన్యువల్ రెంటల్ వాల్యూ రూ.600 వరకు నివాస గృహాలకు ఆస్తిపన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. సెక్షన్ 202 ఎ (2) ప్రకారం పట్టణ పేదల కోసం నిర్మించిన ఇళ్లకు అర్థ సంవత్సరానికి కేవలం రూ.2 వంతున పన్ను వసూలు చేయవచ్చు. రూ.4 వేల లోపు వారికి మినహాయింపు నివ్వాలనుకుంటే... యాన్యువల్ రెంటల్ వాల్యూ రూ.7500 వరకు ఉన్న నివాస భవనాలకు వర్తిస్తుంది.
ప్రభుత్వం చెల్లించాల్సిందే..
ఇదిలా ఉండగా, ఆస్తిపన్ను మినహాయింపుతో జీహెచ్ఎంసీ ఖజానాకు తగ్గే ఆదాయాన్ని ప్రభుత్వం గ్రాంట్‌గా అందజేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు ఈ నిర్ణయం ఆస్తిపన్ను వసూళ్లపైనా ప్రభావం చూపనుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. సీఎం ప్రకటనతో చాలామంది పన్ను చెల్లించకపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఆస్తిపన్ను వసూళ్లకు జీహెచ్ఎంసీ భారీ ఎత్తున యత్నిస్తున్న తరుణంలో సీఎం ప్రకటన అధికారులను ఇరకాటంలో పడేసింది.
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలు: 13.65 లక్షలు
ఇందులో నివాస గృహాలు: 11.50 లక్షలు
రూ. 5వేల లోపు ఉన్నవి: 10 లక్షలు(దాదాపు)
రూ.5 వేల లోపు భవనాల ద్వారా వచ్చే ఆస్తిపన్ను: దాదాపు రూ. 200 కోట్లు