మంచి మాట: అతి అనర్థమే!
‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే అతి ఎల్లవేళలా విడిచిపెట్టాలి అని పెద్దలు ఏనాడో చెప్పారు. అతి అన్న మాటకు ఎక్కువగా, అధికంగా, అవసరమైన దానికన్నా అని అర్థం. అవసరానికి మించినది ఎక్కువ ఏ విషయంలోనూ కూడదని దీని తాత్పర్యం. మన నడతలో, ఆహార్య ఆహారాదులలో, భాషణ, భూషణాది విషయాలలో ఒక హద్దు, నియమం ఒక పరిమితి ఉండాలి. అంతకుమించి పోరాదు.
పరిమితి, హద్దు అనేవి ప్రకృతికే కాదు, మనిషి జీవితానికి అవసరం. అవి మనకొక క్రమాన్ని, హద్దును ఏర్పరచి జీవితం, సత్సంబంధాలు హాయిగా కొనసాగేటట్టు చేస్తాయి. మనిషి నాగరికతను, సంస్కారాన్ని సూచించేవి దుస్తులు. సభ్యతతో సమాజంలో సంచరించటానికి చక్కని వస్త్రధారణ కావాలి. అవి మనకు ఒక హుందాను, నిండుదనాన్ని ఇవ్వాలి. సరైన కొలతలతో ఉన్న దుస్తులు మన ఒంటికి చక్కగా అమరుతాయి. అందాన్నిస్తాయి. పరిమాణంలో అతి ఎక్కువగా లేదా అతి తక్కువగా ఉన్న ఉడుపులు చూపరులకు ఇబ్బందిని కలిగిస్తాయి.
ఆహారం మన శరీరానికి శక్తినిస్తుంది. ఉత్సాహాన్నిచ్చి మన పనులు చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఆహారం మనకు అందించే కేలరీలు శరీరానికవసరమైన స్థాయిలో ఉంటే చక్కని ఆరోగ్యం. ఇవి అతిగా ఉంటే ఊబకాయం. పనులు చేసుకోవటం కష్టమవుతుంది. అలాగే వీటి సంఖ్య తగ్గితే అనారోగ్యమే. ఈ కేలరీలను నియంత్రించుకోవాలంటే జిహ్వను అదుపులో పెట్టుకోవాలి. ‘నాలుక కోరుతోంది కాబట్టి తింటాను’ అనే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే మితమైన లేదా సరిపడా ఆహారం తీసుకోవాలి.
అలసిన శరీరం మళ్లీ శక్తిని పుంజుకుని, మరుసటి రోజు పనులకు ఆయత్తమవాలంటే నిద్ర మనకు చాలా అవసరం. సేదతీరిన కాయం కొంత సమయం తరువాత చైతన్యవంతమవుతుంది. మన దినచర్య లోకి వెళ్ళమని సూచిస్తుంది. కొంతమంది అవసరమైన సమయంకన్నా ఎక్కువసేపు నిద్రపోతుంటారు.అటు వంటివారిలో ఒక మందకొడితనం వస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గి చైతన్యం మటుమాయం అవుతుంది. ఈ దురలటువాటు మన జీర్ణ వ్యవస్థను ఛిద్రం చేస్తుంది అందుకే అతినిద్ర చేటు అని వివేకవంతులు చెప్పారు.
‘కేయురాణి న భూష యంతిం’ అన్న శ్లోక భావార్థం ఇదే.
పెద్దలు, పండితులు, మహానుభావుల సమక్షంలో ఒదిగి, వినమ్రంగా ఉండాలి. వినయంతో సంచరించాలి.
ఇది వారి జీవితానుభవాన్ని, విద్వత్తును, ఘనతను గుర్తెరిగి ప్రవర్తించటం. కొందరు అవసరానికి మించిన వినయాన్ని చూపిస్తారు. అది ధూర్తుల లక్షణం. వీరి అతివినయపు లక్ష్యం ఒక స్వార్థ ప్రయోజనమే.
వినయాన్ని చూపుతూనే మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అపుడే దానికొక ఒక గౌరవం, ప్రశంస.
అతిపరిశుభ్రత వల్ల సమయం, శక్తి వృథా. అతి ప్రేమ, కాముకత, అహంకారం, జాత్యహంకారం వల్ల ఎందరో, ఎన్నో దేశాలు నాశనమయ్యాయో చెప్పే చరిత్ర పాఠాలు విందాం.
మనిషికి మాత్రమే ఉన్న అద్భుత ఆలోచనా శక్తి అతణ్ణి జంతుప్రపంచం నుండి విడిపడేటట్టు చేసింది. భాషను కనుగొనేటట్టు చేసింది. దీనికితోడు, సృష్టిలో ఏ ఇతరప్రాణికి లేని అతడి స్వరపేటిక, నాలుక, ఊపిరితిత్తుల కుదురైన అమరిక అతడి భావోద్వేగాలను వ్యక్తం చేసే గొప్పసాధనమైంది. సందర్భానికి కావలసిన అర్థవంతమైన మాటలను మనలో ఎంతమంది వాడగలరు? వేళ్ళమీద లెక్కపెట్టగలిగే వారే కదా! చాలామంది అధిక ప్రసంగం చేసేవారే. క్లుప్తత, ఔచిత్యత, వివేచనలతో సందర్భశుద్ధిగా భాషించే వాళ్ళు మనలో చాలా తక్కువమందే. ఈ వదరుబోతుల వల్ల కాలహరణమే కాక సంభాషణ పెడదారి పడుతుంది. అందుకే మాట్లాడటం ఒక కళ అన్నారు. అది కొందరికే అలవడుతుంది. అపుడు భాషణం గొప్ప భూషణమే అవుతుంది.
– బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు