కళ్ల ముందే ప్రళయం!
⇒ భూకంపం నుంచి బయటపడినవారి చేదు జ్ఞాపకాలు
⇒ క్షణమొక యుగంలా గడిపామంటూ ఉద్వేగం
కఠ్మాండు/న్యూఢిల్లీ: కళ్ల ముందే పేకమేడలా కూలిపోతున్న భవనాలు.. శిథిలాల నుంచి వినిపిస్తున్న ఆర్తనాదాలు.. క్షణక్షణం భయభ్రాంతులకు గురిచేసిన ప్రకంపనలు.. వెరసి ప్రళయాన్ని ప్రత్యక్షంగా చూశామంటూ ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు భూకంపం నుంచి బయటపడినవారు! రాత్రంతా నిద్ర లేకుండా క్షణమొక యుగంగా గడిపామని చెబుతున్నారు.
భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి తీర్థయాత్రలకు, పర్యాటకులుగా నేపాల్ వెళ్లినవారంతా తమ అనుభవాలను చెబుతూ వణికిపోతున్నారు. ప్రత్యేక విమానాల ద్వారా ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న 150 మందిలో కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు.
చనిపోతామనుకున్నాం..: లలిత
‘‘ పశుపతి నాథ్ ఆలయం సందర్శించిన తర్వాత అక్కడి షాపుల్లో వస్తువులు కొంటున్నాం. అప్పుడే భూకంపం వచ్చింది. 30 సెకన్లపాటు భూమి తీవ్రంగా ఊగింది. కళ్లముందే హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, ప్రాచీన కట్టడాలు పేకమేడల్లా కూలిపోవడం చూసి వణికిపోయాం. నేను నా భర్త, పిల్లల్ని గట్టిగా పట్టుకొని పరుగెత్తాం. అప్పటికీ నా భర్తకు ఇటుకలు తగిలి గాయపడ్డారు. ఎలాగో అలా ఇద్దరు పిల్లలతో బయటపడ్డాం’’
12 మందిని కాపాడాం: ఢిల్లీకి చెందిన వైద్యుడు
‘‘నేను, నా భార్య ఇద్దరం వైద్యులం. కఠ్మాండులో ఉంటున్నాం. భూకంపం రావడంతో మూడడుగుల దూరం వరకు పడిపోయాం. వెంటనే బయటకు వచ్చేశాం. మా ముందే ఇల్లు కూలిపోయింది. శిథిలాల నుంచి రక్తమోడుతున్నవారిని బయటకు తీసి చికిత్స అందేజేశాం. దాదాపు 12 మందిని అలా కాపాడాం’’
సాధువులు కాపాడారు: పంకజ్ అహూజా, వారణాసి
‘‘మేం కఠ్మాండులోని స్వయంభునాథ్ కాంప్లెక్స్‌లో ఉండగా భూకంపం వచ్చింది. బయటకు పరుగెత్తాం కానీ అప్పటికే ద్వారం కూలిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపటికి కొందరు సాధువులు వచ్చి బయటకు తేవడంతో ప్రాణాలతో బయటపడ్డా. రూ.7 వేలు చెల్లించి ట్యాక్సీ ద్వారా విమానాశ్రయానికి చేరుకున్నాం. అక్కడ్నుంచి భారత్ ఏర్పాటు చేసిన విమానంలో వచ్చాం’’