విషపుకాయలు తిని నలుగురు చిన్నారులకు అస్వస్థత
మదనపల్లె క్రైం, న్యూస్‌లైన్: పెళ్లింట విషాదం అలముకుంది. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న చిన్నారులు విషపూరితమైన కాయలుతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. చిన్నారుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు... గౌనిగారిపల్లెలో గురువారం ఓ ఇంట్లో వివాహం జరుగుతోంది. అదే సమయంలో ఇరుగుపొరుగుకు చెందిన వెంకటేష్ కుమారుడు బ్రహ్మ(5), ఆనంద్ కుమారుడు మధు(7), నాగరాజు కుమారుడు వినయ్‌కుమార్(5), రెడ్డినారాయణ కుమారుడు భాస్కర్‌బాబు(5) పెళ్లింట ఆడుకుంటున్నారు.
ఆ ఇంటివద్ద ఉన్న యర్రాముదం(జెట్రోఫా) చెట్టు కింద కాయలు పడి ఉన్నాయి. ఆ కాయలు నిమ్మకాయల సైజులో ఉండడంతో తినే కాయలని భావించి నలుగురు చిన్నారులు తిన్నారు. కొద్దిసేపటికే ఆ నలుగురు తీవ్ర వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పెళ్లిభోజనం ఏమైనా విషాహారంగా మారిందేమోనని కంగారు పడ్డారు. చిన్నారులను అడగడంతో తాము పెళ్లి భోజనం ఇంకా తినలేదని, ఆ కాయలను తిన్నామని చూపించారు. దీంతో వెంటనే చిన్నారులను 108లో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లలను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కంగారు పడాల్సిన పనిలేదని, త్వరగానే పిల్లలు కోలుకుంటారని చిన్నపిల్లల డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు.