Badampudi
-
బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతల ఆక్రోశంతో జాతీయ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉంగుటూరు మండలానికి చెందిన రైతులు, కౌలు రైతులు బాదంపూడి జాతీయ రహదారిని నిర్బంధించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వకుండా రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కయి.. తమను ఇక్కట్ల పాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో దాదాపు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వాటిని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. గతంలో బస్తా రూ. 1300 కొనేవారని, ఇప్పుడు బస్తాకు రూ.1100కి మించి గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. 1010 రకం ధాన్యాన్ని తాము పండిస్తుండగా.. వ్యవసాయ అధికారులు తమ వద్దకు వచ్చి 1026, 1056 రకం ధాన్యం పండించాలని తమకు చెప్పారని, ఇప్పుడు ప్రభుత్వం కానీ, రైస్ మిల్లర్లు కానీ ఆ ధాన్యాన్ని కొనడం లేదని రైతులు తెలిపారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు తమకు వేరేదారి లేదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే రహదారిని నిర్బంధించి నిరసన తెలిపామని చెప్పారు. నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీస్ గోబ్యాక్ అన్న నినాదాలతో జాతీయ రహదారి కొంతసేపు మార్మోగింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఆందోళనకారులను చెల్లాచెదురుచేసి కొంతమంది రైతునాయకులు అదుపులోకి తీసుకుని చేబ్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఉంగుటూరు మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
నెత్తురోడిన జాతీయ రహదారి
పదహారో నంబర్ జాతీయ రహదారి బుధవారం నెత్తురోడింది. ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద కారును లారీ ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వద్ద ఆగి ఉన్న గ్రానైట్ లారీని వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం చెందాడు. బాదంపూడి (ఉంగుటూరు)/కొండ్రుప్రోలు (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఈ రహదారిలో జిల్లాలోని వివిధ జంక్షన్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మహిళ సహా ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా గాయపడ్డాడు. రాజమండ్రికి చెందిన కముజు వెంకట్రావు, విజయలక్ష్మి కారులో విజయవాడలోని కుమారై ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బాదంపూడి వై జంక్షన్ వద్ద లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త వెంకట్రావుకు, భార్య విజయలక్ష్మి (65)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జైంది. విజయలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం ఉల్లి లోడుతో హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తున్న వ్యాన్ తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న గ్రానైట్ లారీని ఢీ కొట్టడంతో క్లీనర్ మృతి చెందాడు. గణపవరం మండలం మెయ్యేరుకు చెందిన ఎస్ఎంఎల్ వ్యాన్ డ్రైవర్ గంటా వెంకట రామకృష్ణ క్లీనర్ మల్లిపూడి వెంకట్రావు (40)తో ఉల్లిని లోడు చేసుకుని రావులపాలెం బయలుదేరారు. వ్యాన్ బుధవారం తెల్లవారుజాము కొండ్రుప్రోలు వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న గ్రానైట్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గ్రానైట్ లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయిందని, తెల్లవారుజామున మంచు కారణంగా ఆగి ఉన్న లారీని డ్రైవర్ గుర్తించక ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడు వెంకట్రావుకు భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వెంకట్రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలంలో రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.