నెత్తురోడిన జాతీయ రహదారి
Published Thu, Nov 21 2013 3:45 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పదహారో నంబర్ జాతీయ రహదారి బుధవారం నెత్తురోడింది. ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద కారును లారీ ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వద్ద ఆగి ఉన్న గ్రానైట్ లారీని వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం చెందాడు.
బాదంపూడి (ఉంగుటూరు)/కొండ్రుప్రోలు (తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి మృత్యుమార్గంగా మారింది. ఈ రహదారిలో జిల్లాలోని వివిధ జంక్షన్లు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. బుధవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మహిళ సహా ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా గాయపడ్డాడు. రాజమండ్రికి చెందిన కముజు వెంకట్రావు, విజయలక్ష్మి కారులో విజయవాడలోని కుమారై ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా బాదంపూడి వై జంక్షన్ వద్ద లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త వెంకట్రావుకు, భార్య విజయలక్ష్మి (65)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జైంది. విజయలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు చేబ్రోలు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో క్లీనర్ దుర్మరణం
ఉల్లి లోడుతో హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తున్న వ్యాన్ తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు వద్ద జాతీయ రహదారిపై నిలిపి ఉన్న గ్రానైట్ లారీని ఢీ కొట్టడంతో క్లీనర్ మృతి చెందాడు. గణపవరం మండలం మెయ్యేరుకు చెందిన ఎస్‌ఎంఎల్ వ్యాన్ డ్రైవర్ గంటా వెంకట రామకృష్ణ క్లీనర్ మల్లిపూడి వెంకట్రావు (40)తో ఉల్లిని లోడు చేసుకుని రావులపాలెం బయలుదేరారు. వ్యాన్ బుధవారం తెల్లవారుజాము కొండ్రుప్రోలు వద్దకు వచ్చే సరికి ఆగి ఉన్న గ్రానైట్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గ్రానైట్ లారీ టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిచిపోయిందని, తెల్లవారుజామున మంచు కారణంగా ఆగి ఉన్న లారీని డ్రైవర్ గుర్తించక ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడు వెంకట్రావుకు భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న వెంకట్రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలంలో రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది.
Advertisement
Advertisement