యూపీలో అత్యాచారం చిచ్చు
రాష్ట్ర హోం కార్యదర్శి తొలగింపు
లక్నోలో సీఎం అఖిలేష్ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం
లక్నో/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బదౌన్ సామూహిక అత్యాచారం, హత్యల ఉదంతంపై ఉత్తరప్రదేశ్ సర్కారుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌గుప్తాను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయనకు తదుపరి పోస్టింగ్ ఇచ్చే వరకూ వెయిటింగ్లో ఉంచుతున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం తెలిపారు. గుప్తా స్థానంలో ఇంకా మరో అధికారిని కూడా నియమించలేదు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. లక్నోలో ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు వందలాది మంది నిరసనకారులు ప్రయత్నించటంతో వారిని నిలువరించేందుకు పోలీసులు నీటి ఫిరంగులను వినియోగించారు. ఇదిలావుంటే.. బదౌన్‌లో ఇద్దరు దళిత టీనేజీ అక్కాచెల్లెళ్లపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం చెట్టుకు ఉరివేసి హత్యచేసిన ఘటనకు సంబంధించి నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కఠిన సెక్షన్లతో ఎందుకు కేసు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ యూపీ సర్కారుకు నోటీసు జారీ చేసింది. అయితే.. హత్యకుగురైన బాలికలు దళితులు కారని, ఈ చట్టం వారికి వర్తించదని ఐజీ అమరేంద్రసేంగార్ పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో అత్యాచార సంక్షోభ కేంద్రాలు: మేనకాగాంధీ
బదౌన్ ఘటన అత్యంత భయానకమైనదని.. యూపీ సర్కారులో ఏమాత్రం స్పందన లేదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ ఖండించారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని.. మహిళలైన బాధితులకు అత్యల్పమైన మద్దతు లభించటం దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలను తమ మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణిస్తోందని.. ఈ ఏడాది చివరికల్లా దేశమంతటా ప్రతి జిల్లాలో అత్యాచార సంక్షోభ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ కేంద్రాల్లో పోలీసులు, న్యాయవాదులు, వైద్యులు సేవలందిస్తారని.. అంబులెన్సులు ఉంటాయని, జాతీయస్థాయి హెల్ప్‌లైన్‌తో పనిచేస్తాయని వివరించారు. ఈ కేంద్రాలకు రూ. 500 కోట్లు కేటాయిస్తామన్నారు.
భారత్‌లో మహిళలపై హింసపై దృష్టి సారించాలి: ఐరాస
ఐక్యరాజ్యసమితి: బదౌన్ జిల్లాలో ఇద్దరు టీనేజీ బాలికలపై పాశవిక సామూహిక అత్యాచారం, హత్య ఉదంతాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. ఈ దురాగతానికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు చేపట్టాలని, భారతదేశమంతటా మహిళలపై హింస సమస్యను పరిష్కరించాలని పిలుపునిచ్చింది.