మేం గెలిచినా పట్టించుకోలేదేం?
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో డబుల్స్ క్రీడాకారిణుల పట్ల వివక్ష కొనసాగుతోందని, వారు పెద్ద స్థాయి విజయాలు సాధించినా వాటికి ప్రాధాన్యత లభించడం లేదని భారత క్రీడాకారిణి గుత్తా జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. తమకు తగిన గుర్తింపు దక్కకపోవడం తీవ్రంగా బాధిస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. అశ్విని పొన్నప్పతో కలిసి 2011 ప్రపంచ చాంపియన్‌షిప్ డబుల్స్ విభాగంలో జ్వాల కాంస్యం నెగ్గింది. ‘డబుల్స్ ప్లేయర్లకు ఎలాంటి గుర్తింపు లేదు.
వారి పట్ల దృక్పథం మారాలి. సింగిల్స్‌లో గెలిచినవారితో పోలిస్తే ఇది ఏ రకంగా తక్కువ? ఈ గెలుపు ఎందుకు ముఖ్యం కాదు? ఎందుకు దీనిని ఎవరూ అభినందించరు? ఎందుకీ వివక్ష? శ్రీకాంత్, సింధు గెలవడం మంచిదే...కాదనను. కానీ నేనూ గ్రాండ్ ప్రి గోల్డ్‌లు నెగ్గాను. ఒక ఆటగాడి ప్రదర్శనను గుర్తించకుంటే అది చాలా బాధ పెడుతుంది’ అని జ్వాల తన అభిప్రాయాన్ని వెల్లడించింది. మిక్స్డ్ డబుల్స్‌లో మను అత్రిని భాగస్వామిగా కొనసాగిస్తానని చెప్పిన జ్వాల... డబుల్స్‌లో మాత్రం ప్రజక్తా సావంత్నుంచి విడిపోయి కొత్త పార్ట్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉందని వెల్లడించింది. ఐబీఎల్‌ను తాను పునరాగమనంగా భావిస్తున్నట్లు ఆమె వెల్లడించింది.