నేను పేరుకే టీడీపీ ఇన్చార్జిని..
* ఎమ్మెల్యే, విజయమ్మ చెబితేనే అధికారులు పలుకుతున్నారు
* బద్వేలుకు ఎలా వస్తావో చూస్తాం- టీడీపీ జిల్లాఅధ్యక్షుడితో కార్యకర్తల వాగ్వాదం
ప్రొద్దుటూరు: ‘పేరుకే నేను టీడీపీ ఇన్చార్జిని..ఎమ్మెల్యే జయరాముడో, విజయమ్మనో చెబితేనే అధికారులు పనులు చేస్తున్నారు’ అని బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి విజయజ్యోతి అన్నారు. ప్రొద్దుటూరు ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం విజయజ్యోతి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో మాట్లాడేందుకు వచ్చారు.
ఆమె వెంట సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మరి కొంత మంది వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 75 మంది నాయకులు, కార్యకర్తలకు నీరు-చెట్టు పథకం కింద కాలువలు తీసేందుకు పనులు పెట్టామన్నారు. 3 నెలలుగా ఈఫైల్ను పక్కన పెట్టారన్నారు. నిన్నకాక మొన్న వచ్చిన ఎమ్మెల్యే జయరాములు, విజయమ్మ కలిసి రూ.10కోట్ల పనులు చేస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు.
కూర్చొని మాట్లాడుదామని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి చెబుతుండగానే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము విజయమ్మకో, జయరాములుకో ఓట్లు వేయలేదన్నారు. ఇంతలో జిల్లా అధ్యక్షుడు పార్టీ అనుకున్నారా, ఏమనుకున్నారు అంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కార్యకర్తలు జిల్లా అధ్యక్షునితో వాగ్వాదానికి దిగారు. బద్వేలుకు ఎలా వస్తావో చూస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు సమన్వయ కమిటీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లోకి వెళ్లిపోయారు. దీంతో బద్వేలు నుంచి వచ్చిన వారు బయటికి వచ్చారు.