bahubali movie release
-
'బాహుబలి' గాయాలు
హైదరాబాద్: మొదటి రోజే సినిమా చూడాలన్న అభిమానుల అత్యుత్సాహం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. టిక్కెట్ల కోసం అభిమానులు చూపిస్తున్న అసహనం సమస్యలకు దారి తీస్తోంది. అటు ధియేటర్ యాజమాన్యాలు కూడా ఎక్కువ రేట్లకు టిక్కెట్లను ముందుగానే అమ్మేయడంతో అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది. టికెట్లు విక్రయించకపోవటంతో హైదరాబాద్ ఎల్బీనగర్ విజయలక్ష్మి థియేటర్‌పై అభిమానులు దాడి చేశారు. థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో బాహుబలి సినిమా టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకోవటంతో పోలీసులు రంగంలోకి దిగారు. అభిమానులపై లాఠీఛార్జ్ చేశారు. దాంతో ఆగ్రహం చెందిన అభిమానులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ప్రేక్షకులపై బౌన్సర్ల దాడి
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ వద్ద అభిమానులు ఆందోళన చేపట్టారు. 'బాహుబలి' టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నారంటూ వారు ఆందోళన చేశారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా అదుపుతప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అంతేకాక థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన బౌన్సర్లు ప్రేక్షకులపై దాడికి దిగారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో 'సాక్షి' విలేకరికి గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. థియేటర్ల వద్ద ఉద్రిక్తత అదేవిధంగా తార్నాక ఆరాధన థియేటర్ వద్ద, శంషాబాద్ లోని గణేష్ థియేటర్ పై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో థియేటర్ పై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి ని మొదటి రోజు చూడాలనే అత్యుత్సాహం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.