సీఎం హామీకి మోక్షమెప్పుడో ?
‘‘పక్కనే కృష్ణమ్మ ఉంది. ఇక్కడి రైతులకు నీరందాలంటే నెల్లికల్ ఎత్తిపోతల అవసరం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించండి. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే నెల్లికల్ లిఫ్ట్ పనులు ప్రారంభిస్తాం’’ హాలియాలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.సీఎం హామీ నెరవేరుస్తారని తిరుమలగిరి మండలంలోని నెల్లికల్, జాల్తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్ండా, చెంచోనితండా, మూలతండా గ్రామాల రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు ముగిశాయి. కాలం గడిచిపోతోంది. కానీ నెల్లికల్ లిఫ్ట్పై ఎవరూ నోరు మెదపడం లేదని ఆయా తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బహుళార్ధకసాధక ప్రాజెక్టు. ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ... ఎంతో మంది గొంతును తడుపుతున్న కృష్ణమ్మ... కానీ పక్కనే మూడు కిలోమీటర్లు కూడా లేని నెల్లికల్ ప్రాంత ప్రజలకు మాత్రం తాగు, సాగు నీరు అందడం లేదు. ఈ సమస్యను తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదు. వివరాల్లోకెళితే...తిరుమలగిరి మండలంలోని నెల్లికల్, జాల్తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతం డా, సఫావత్ండా, చెంచోనితండా, మూలతండా గ్రామాల రైతులకు సాగునీరందించే ఎత్తిపోతల పథకం ప్రకటనలకే పరిమితం అయింది. ఎత్తిపోతల పథకాన్ని నాయకులు, అధికారులు పట్టించుకోకపోడంతో రైతులు వర్షాలపైనే ఆధారపడి పంటను సాగుచేస్తున్నారు. వర్షాలు కూడా కాలాగుణంగా పడకపోవడంతో ప్రతి ఏటా రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో నిరాశచెందుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
4500 ఎకరాలు సాగులోకి
నెల్లికల్ లిప్టు పూర్తయితే ఏడు గ్రామాల్లో 1500 కుటుంబాలకు సుమారు 4500 ఎకరాలకు సాగునీరందనుంది. ప్రతి ఏటా రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో నెల్లికల్లో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అక్కడి భూములును సస్యశ్యామలం చూస్తామంటూ ఊకదంపుడు ప్రచారాలతో ప్రజలను, రైతులను మభ్యపెడుతూ ఓట్లను దండుకొని బయటపడుతున్నారు. అనంతరం అనుమతుల సాకుతో తప్పించుకుంటున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు సుమారు రూ. 60 కోట్ల వ్యవయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి రైతులు నీటిని వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది. ఈ పథకం నిర్వాహణకు 1 /4 టీఎంసీల నీరు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంపుహౌస్లు నిర్మించి, మోటార్ల ద్వారా సాగునీరు అందించాల్సి ఉంటుంది.
రెండు నెలలు కావస్తున్నా ఊసేలేదు..
లిప్టును ఏర్పాటు చేయకుండా నాయకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో ఎన్నికల సమయంలో లిప్టు పేరును చెప్పి తమ ఓట్లను దండుకుంటున్నారని, ఈసారి ఎన్నికలను బహిష్కరించాలని ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముందస్తు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఏడు గ్రామాల ప్రజలు తీర్మానం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపు, ఓటములను కృష్ణపట్టె ప్రాంతం శాశిస్తుండటంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజలకు గట్టి హామీనే ఇచ్చింది. ఈ సారి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే స్వయంగా తానే వచ్చి కొబ్బరికాయ కొట్టి నెల్లికల్ లిప్టు పనులను ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రకటించడంతో ఏడు గ్రామాల ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలు కావస్తున్నా నేటికీ లిప్టు పనుల ప్రారంభ దిశగా అడుగులు పడకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.
ఏళ్లుగా ఎదురుచూపులే
లిప్టుకు సంబంధించిన ప్రాథమిక పనులను ప్రారంభించటానికి అటవీ అనుమతులు రావా ల్సి ఉండటంతో ఐడీసీ అధికారులు కలెక్టర్ ద్వా రా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. వణ్యప్రాణుల అభయారణ్యం కావడంతో పాటు సుమా రు 9 ఎకరాలు అటవీభూమి మీదుగా పైపులైన్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశా ఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో పైపులైన్ల నిర్మాణంతో అడవికి జరిగే నష్టానికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్లు రెవెన్యూ శివారులో సర్వే నంబర్ 299 /2లో గల సుమారు 9 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించడానికి ప్రతిపాదనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరితట్రిబ్యూనల్కు ప్ర భుత్వ భూమిని బదలాయింపు ప్రతిపాదనలు రా ష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గత సంవత్సరం డిసెంబర్ మాసంలో లిప్టు పనులతో అడవికి, అందులోని వణ్యప్రాణులకు ఏమైనా హాని ఉందా అని ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది.
సీఎం మాటపై నమ్మకముంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే తానే స్వయంగా వచ్చి నెల్లికల్ లిప్టుకు కొబ్బరికాయకొట్టి పనులు ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రకటించారు. ముఖ్యమంత్రి సారు నోరువెంట నెల్లికల్ లిప్టు రావడంతో ఈసారి లిప్టు పనులు ప్రారంభమవుతాయని సంతోషపడ్డాం. ప్రభుత్వం ఏర్పడి రెండు మాసాలవుతున్నా నేటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో బాధగా ఉంది. కేసీఆర్ సారు తన మాటకు కట్టుబడి నెల్లికల్ లిప్టును త్వరగా ప్రారంభించాలి. – మేకపోతుల గాలయ్య, రైతు, నెల్లికల్
వేల ఎకరాలు సాగులోకి
లిప్టును ఏర్పాటు చేస్తే వేల ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. వర్షాలపై ఆధారపడి పంటలను సాగు చేసే రోజులు పోయాయి. వర్షాలు కూడా కాలానుగుణంగా పడకపోవడంతో ప్రతి ఏటా వేల రూపాయలు నష్టపోతున్నాం. ప్రభుత్వం చొరవ చూపి నెల్లికల్ లిప్టును త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలి. – బుర్రి భిక్షమయ్య, రైతు నెల్లికల్